Saturday, May 4, 2024

రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు

- Advertisement -
- Advertisement -

Rajiv Gandhi Khel Ratna Award Renamed

ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ పురస్కారంగా నామకరణం
ప్రధాని మోడీ ప్రకటన

న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును కేంద్రప్రభుత్వం మార్చింది. ఇకపై దీనినిని మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలుస్తారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఓ ట్వీట్‌లో తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళా హాకీ జట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి దేశ ప్రజల ప్రశంసలనందుకొంటున్న తరుణంలోఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధాని శుక్రవారం చేసిన ట్వీట్‌లో ‘ఖేల్ రత్న పురస్కారానికి ధ్యాన్‌చంద్ పేరు పెట్టాలని నాకు దేశం నలుమూలలనుంచి వినతులు అందుతున్నాయి.

అభ్యర్థనలు వెల్లడించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖేల్ రత్న అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుగా పిలుస్తాం. జైహింద్’ అని పేర్కొన్నారు. ఖేల్ రత్న అవార్డును 1991-92లో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఈ పురస్కారం కింద రూ.25 లక్షలు నగదు పురసస్కారం అందజేస్తారు. మొట్టమొదట చదరంగం ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్‌కు ఇచ్చారు. లియాండర్ పేస్, సచిన్ తెండూల్కర్, ధన్‌రాజ్ పిళ్లై, పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, అంజూ బాబీ జార్జ్, మేరీకోమ్, రాణీ రాంపాల్ కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ మాంత్రికుడిగా గుర్తింపు పొందారు. ఆయన 1926నుంచి 1945 వరకుఅంతర్జాతీయ హాకీ పోటీల్లో పాల్గొన్నారు. తన కెరీర్‌లో 400కు పైగా గోల్స్ చేశాడు.1928, 1932, 1936లో ఒలింపిక్స్ బంగారు పతకాలు గెల్చుకున్న భారత టీమ్‌కు ఆయన ననాయకత్వం వహించారు.

ముందు మోడీ స్టేడియం పేరును మార్చండి: కాంగ్రెస్

క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న గా మార్పు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొద్ది సేపటికే సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు స్వాగతం పలికారు. బిజెపిసైతం ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధాని నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆరోపించింది. ఖేల్ రత్న అవార్డుకు ధ్యాన్‌చంద్ పేరును పెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అంటూనే అలాగే నరేంద్ర మోడీ స్టేడియం, అరుణ్ జైట్లీ స్టేడియం పేర్లను కూడా మారిస్తే బాగుంటుందని అన్నారు. బిజెపి నేతలు మాత్రం ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి హాకీ లెజండ్ ధ్యాన్‌చంద్ పేరు పెట్టడం ఆయనకు నిజమైన నివాళి అని హోంమంత్రి అమిత్ షా అంటూ, ఈ నిర్ణయం క్రీడలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేస్తుందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, ధ్యాన్‌చంద్ భారతీయ క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమేకాకుండా గర్వించదగ్గ వ్యక్తి అని అన్నారు.

Rajiv Gandhi Khel Ratna Award Renamed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News