Thursday, May 9, 2024

జడ్జిలకు బెదిరింపులు రావడం తీవ్రమైన అంశం

- Advertisement -
- Advertisement -

Threats to judges are serious issue

ఫిర్యాదు చేసినా పోలీసులు, సిబిఐ పట్టించుకోవడం లేదు
సిజెఐ ఎన్‌వి రమణ తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశంలో న్యాయమూర్తులకు బెదిరింపులు రావడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత నెల 28న జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జిల్లా న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్‌ను దుండగులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు, జడ్జిల రక్షణ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది. న్యాయమూర్తులకు కల్పిస్తున్న రక్షణపై ఈ నెల 17 లోపు నివేదికను సమర్పించాలని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. జడ్జి హత్య కేసును సిబిఐకి అప్పగించినట్లు జార్ఖండ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించగా ధర్మాసనం ఆ ప్రభుత్వంపై మండిపడింది. సిబిఐ కేసు విచారణ ప్రారంభించిందని మీరు చేతులు దులిపేసుకున్నారా అని ప్రశ్నించింది.

జడ్జిలకు గ్యాంగ్‌స్టర్లు, ఉన్నతస్థాయి వ్యక్తులనుంచి బెదిరింపులు వస్తున్నట్లు అనేక ఉదాహరణలున్నాయని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌కుప్రధాన న్యాయమూర్తి గుర్తు చేశారు. వాట్సాప్ ,ఎస్‌ఎంఎస్ మెస్సేజిలు పంపుతూ న్యాయమూర్తులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ వేధింపులు, బెదిరింపులపై ఫిర్యాదు చేసినప్పటికీ సిబిఐ చేస్తున్నదేమీ లేదన్నారు. సిబిఐ వైఖరిలో మార్పు రాలేదని అంటూ, ఈ విధంగా వ్యాఖ్యానించాల్సి రావడం బాధాకరమన్నారు. అలాంటి ఫిర్యాదులు దాఖలైతే న్యాయవ్యవస్థకు పోలీసులు, ఐబి, సిబిఐ కూడా సాయం చేయడం లేదని వ్యాఖ్యానించారు. ‘ ఇది వారికి ప్రాధాన్యతా అంశం కాదని వారు భావిస్తున్నారు.

ఐబి, సిబిఐ ఎంతమాత్రం న్యాయవ్యవస్థకు సాయపడడం లేదు. నేను బాధ్యతతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. నేను ఇలా అనడానికి ఆ సంఘటన కారణమని నాకు తెలుసు. అంతకు మించి వివరాలు వెల్లడించడం ఇష్టం లేదు’ అని సిజెఐ అన్నారు. 2019లో ఓ జడ్జిపై దాడి సందర్భంలో జారీ చేసిన నోటీసులకు సమాధానమివ్వాల్సి ఉన్నా కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని సిజెఐ ఎన్‌వి రమణ అన్నారు. దీనిపై వారంలోపు సమాధానమివ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.

Threats to judges are serious issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News