Friday, May 3, 2024

శ్రీబలరామావతార దర్శనం పరమపావనం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం : భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంకు వస్తున్నభక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం దశావతారల్లో 8వ అవతారమైన శ్రీబలరామావతారంలో రామయ్య భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీబలరామావతారంలో స్వామి వారిని అలంకరణ చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపు నిర్వహించారు. మిథిలా మండపంలో పరివార దేవతల నడుమ కొలువు తీరిన స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

వేద పండితులు, అర్చకులు, నాళాయార్ దివ్య ప్రబంధాలు చదువుతుండగా, ఆ కమనీయ దృశ్యాలు చూసిన భక్తులు పులకించారు. భక్తులు మంగళహారతులు పాడారు, అర్చకులు భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివారికి తిరువీధి సేవను ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఆస్థాన విద్వాంసుల నాదస్వరాలు, కోలాటాల నడుమ తాతగుడి వరకు తిరువీధి సేవ సాగింది. దారిపొడవునా భక్తులు స్వామివారికి పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. రాత్రి స్థానిక మిథిలా స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులను అలరించాయి. భక్తులు భారీ సంఖ్యలో హాజరై బలరామావతారంలో స్వామివారిని దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News