Saturday, April 27, 2024

సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి
ఈ మేరకు సిఎంకు లేఖ రాసిన సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క
కేంద్రంపై ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో కెసిఆర్ చెప్పాలని డిమాండ్
కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేయాలని సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సిఎం కెసిఆర్‌కు తాను ఒక లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కొద్ది రోజుల క్రితం వరకు ఒకప్పుడు ఒంటికాలిపై లేచిన కెసిఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. నూతన వ్యవసాయ చట్టానికి నిరసనగా దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఇచ్చిన భారత్‌బంద్‌లో కూడా రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. కానీ సిఎం కెసిఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత పూర్తిగా వెనక్కి తగ్గారన్నారు. సిఎం కెసిఆర్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ తన వ్యక్తిగత అవసరాల కోసమే రాష్ట్ర రైతాంగ భవిష్యత్‌ను ప్రధాని నరేంద్రమోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం సరికాదని హితవు పలికారు.
బుధవారం అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో దేశవ్యాప్తంగా రైతులు అల్లాడుతున్నారు. దేశానికి అన్నంపెట్టే రైతన్న సమస్యలపై రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరముందన్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్‌కు కాంగ్రెస్ తరపున లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గతంలో విద్యుత్ బిల్లులను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గతంలో మాదిరిగానే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలన్నారు.
ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్న నెపంతో కొనుగోలు కేంద్రాలను తొలగిస్తామంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. కేంద్రంపై ముందుగా గాంభీర్యాలు పలకడం… ఆ తరువాత శరణు కోరడం సిఎం కెసిఆర్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోందన్నారు. వారి దృష్టిని మరల్చడానికే అడపా, దడపా కేంద్రంపై విమర్శలు చేసి అనంతరం మరిచిపోతున్నారని భట్టి వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఎన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర ప్రజలు టిఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అందుకే సిఎం కెసిఆర్ తన కుమారుడైన మంత్రి కెటిఆర్‌కు పట్టం కట్టేందుకు సమాయత్తమవుతున్నారన్నారు. సిఎం కుర్చీని కెసిఆర్ ఎవరికి అప్పగించినా టిఆర్‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలన్నారు. భవిష్యత్తుల్లో మళ్లీ టిఆర్‌ఎస్ పార్టీలో గెలిచే అవకాశమే లేదన్నారు. ఈ నేపథ్యంలో ఇక అధికారంలో ఉండబోయే తక్కువ కాలంలోనైనా సిఎం కెసిఆర్ ప్రజలకు నిజాలు చెప్పాలని భట్టి విక్రమార్క సూచించారు.

Resolution moved against farm laws in Assembly: Bhatti

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News