Thursday, May 16, 2024

ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణపై రేవంత్ హైకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

Vote for note case has been adjourned until feb 16

మనతెలంగాణ/హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ ప్రక్రియపై మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి గురువారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారులు, పంచనామా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే వరకు ఈ కేసులోని ప్రధాన సాక్షులు స్టీఫన్ సన్, ఆయన స్నేహితుడు మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా వేయాలని కోరారు. ఓటుకు నోటు కేసులో ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల సాక్షుల విచారణ ప్రక్రియ ప్రారంభించింది.

అయితే దర్యాప్తు అధికారులు అశోక్ కుమార్, మల్లిఖార్జున్ రెడ్డి, పంచనామా సాక్షులు ఎ.శ్రీకాంత్, జి.కపూర్‌ల ప్రధాన విచారణ ముగిసే వరకూ స్టీఫన్ సన్, ఆయన కుమార్తె జెస్సికా, స్నేహితుడు మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి ఎసిబి కోర్టును కోరారు. ఈక్రమంలో రేవంత్ అభ్యర్థనను పాక్షికంగా అనుమతించిన ఎసిబి కోర్టు మాల్కం టేలర్, జెస్సికాల చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయ్యే వరకు స్టీఫన్ సన్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా వేసేందుకు అంగీకరించింది. దర్యాప్తు అధికారులు, పంచానామా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే వరకు ముగ్గురి క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపి వేసేందుకు మాత్రం నిరాకరించింది. స్టీఫన్ సన్, మాల్కం టేలర్ ప్రధాన విచారణ ఇటీవలే ముగిసింది. ఎసిబి అభ్యర్థన మేరకు స్టీఫన్ సన్ కుమార్తె జెస్సికాను సాక్షుల జాబితా నుంచి తొలగించేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.

అలాగే స్టీఫన్ సన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు విచారణను జూన్ 2కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సాక్షుల విచారణ ప్రక్రియపై ఎసిబి న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు అధికారుల విచారణను చివరలో చేపట్టాలన్న సంప్రదాయాన్ని ఎసిబి న్యాయస్థానం విస్మరించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు, పంచనామా సాక్షులు, ప్రధాన సాక్షులు చెప్పేది సాధారణంగా ఒకే విధంగా ఉంటుందని అందరి ప్రధాన విచారణ పూర్తయ్యాకే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అనుమతించాలని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి కౌంటరు దాఖలు చేయాలని ఎసిబిని ఆదేశిస్తూ విచారణను జూన్ 18కి వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News