Tuesday, April 30, 2024

రియాకు బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

Rhea Chakraborty has been denied bail

ఆరుగురి నిందితుల బెయిల్ పిటిషన్ తిరస్కృతి
అది బలవంతపు వాంగ్మూలం.. ఉపసంహరించుకుంటున్నా: రియా

ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో ముడిపడిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి స్థానిక కోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించింది. ఆమెతోపాటు ఆమె తమ్ముడు షౌమిక్ చక్రవర్తి, మరో నలుగురు దాఖలు చేసిన జామీను పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ నెల 22 వరకు రియా చక్రవర్తికి స్థానిక కోర్టు జుడిషియల్ కస్టడీ విధించడంతో ఆమె ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్నారు. నేడు జామీను తిరస్కృతికి సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు సోమవారం జారీ అయిన తర్వాత ఆమె వాటిపై బొంబాయి హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. కాగా..రియా చక్రవర్తి తన జామీను దరఖాస్తులో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన చేత బలవంతంగా నేరం చేసినట్లు వాంగ్మూలం తీసుకున్నారని, తాను ఎటువంటి నేరం చేయలేదని, తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే కోర్టు మాత్రం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) వాదననే పరిగణనలోకి తీసుకున్నట్లు కనపడుతోంది. డ్రగ్స్ సేకరణకు రియా చక్రవర్తి డబ్బును సమకూర్చినందున ఈ డ్రగ్ సిండికేట్‌లో ఆమె కీలక సభ్యురాలని ఎన్‌సిబి వాదించింది. ఆమె చేసిన నేరానికి ఆమెకు 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని ఎన్‌సిబి వాదించింది. రియా చక్రవర్తి తన సొంత అవసరాల కోసం డ్రగ్స్ కొనుగోలుకు ఫైనాన్స్ చేయలేదని, మరో వ్యక్తికి సరఫరా చేసేందుకు ఆమె వీటిని కొన్నారని ఎన్‌సిబి పేర్కొంది. తన బాయ్‌ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ వాడతారని రియా చక్రవర్తికి తెలుసునని, అతని కోసం డ్రగ్స్ కొనుగోలు చేసి ఆమె తనకు తానుగా నేరంలో భాగస్వామి అయ్యారని ఎన్‌సిబి వాదించింది.

బెయిల్‌పై ఆమెను విడుదల చేస్తే ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సమాజంలో తనకు ఉన్న పలుకుబడితో, తన ధన బలంతో ఆమె సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారని కూడా ఎన్‌సిబి వాదించింది. అక్రమ డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో ఆమె తన క్రెడిట్ కార్డును ఉపయోగించారని, తాను స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చినట్లు ఆమె స్వయంగా ఒప్పుకున్నారని ఎన్‌సిబి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News