Sunday, April 28, 2024

రైల్వేకు రూ. 1.10 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

Rs. 1.10 lakh crore for Railway Department

 

ఇందులో మూలధన వ్యయం కింద రూ.1.07 లక్షల కోట్లు
2030 వరకల్లా డిమాండ్‌కు తగిన సామర్థాన్ని పెంచే జాతీయ రైల్వే ప్రణాళిక

న్యూఢిల్లీ: 2021-22 బడ్జెట్‌లో రైల్వేశాఖకు 1,10,055 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు కానున్నట్టు అంచనా. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గూడ్స్ రైళ్లపై రైల్వేశాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. కరోనా కాలంలో నిత్యావసర వస్తువుల సరఫరాలో రైల్వేశాఖ అందించిన సేవలను ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ సందర్భంగా కొనియాడారు. 2030 వరకల్లా డిమాండ్‌కు తగ్గట్టు రైల్వేల సామర్థ్యాన్ని పెంచడానికి సంబంధించి రైల్వేశాఖ రూపొందించిన జాతీయ రైల్వే ప్రణాళిక గురించి నిర్మల ప్రస్తావించారు. భవిష్యత్ అవసరాల కోసం మేకిన్ ఇండియాలో భాగంగా లాజిస్టిక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆమె తెలిపారు. దీంతో, సరుకు రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు.

2022 జూన్ వరకల్లా ఈస్టర్న్(ఇడిఎఫ్‌సి), వెస్టర్న్(డబ్లూడిఎఫ్‌సి) రవాణా కారిడార్లు ఏర్పాటు కానున్నట్టు ఆమె తెలిపారు. ఇడిఎఫ్‌సిలో భాగంగా సోనేనగర్‌గోమో సెక్షన్‌లో 263 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి) కింద ఈ ఏడాదే ప్రారంభించనున్నట్టు ఆమె తెలిపారు. దాని తర్వాత త్వరలోనే గోమోదాన్కునీ సెక్షన్‌లో 274.3 కి.మీ. రైల్వే లైన్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు.

విజయవాడకు రెండు కారిడార్లు

బెంగాల్‌లోని ఖారగ్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మధ్య ఈస్ట్‌కోస్ట్ కారిడార్‌ను, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ, విజయవాడ మధ్య నార్త్‌సౌత్ కారిడార్‌ను, భూసావల్ నుంచి ఖారగ్‌పూర్,దాన్కునీకి ఈస్ట్‌వెస్ట్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. తొలిదశలో వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డిపిఆర్)ను రూపొందించనున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు.

2023 వరకల్లా 100 శాతం విద్యుదీకరణ

2023 డిసెంబర్ వరకల్లా బ్రాడ్‌గ్వేజ్ రైల్వే లైన్‌ను 100 శాతం విద్యుదీకరించాలని లక్షంగా నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి తెలిపారు. ఇది 46,000 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇందులో 41,548 కిలోమీటర్ల మేర 2021 చివరికల్లా విద్యుదీకరణ పూర్తి కానున్నది. అంటే నిర్దేశించుకున్న లక్షంలో ఇది 72 శాతం. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై రైల్వేశాఖ దృష్టి సారించిందని ఆర్థికమంత్రి అన్నారు. అందులో భాగంగానే పర్యాటక మార్గాల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అధునాతన విస్టాడోమ్ ఎల్‌హెచ్‌బి కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్టు ఆమె తెలిపారు. ఎక్కువ రద్దీ, వినియోగం ఉన్న మార్గాల్లో ప్రయాణికుల భద్రత కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘యాంటీ కొలిజన్ సిస్టమ్’ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News