Thursday, July 18, 2024

నగరంలో.. ఆర్టిసి కార్గో సేవలు ప్రైవేట్‌కు

- Advertisement -
- Advertisement -

RTC Cargo

 

హైదరాబాద్ : త్వరలో నగరంలో రోడ్డు ఎక్కనున్న ఆర్టిసి కార్గోబస్సులను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రెండో వారంలో సుమారు 50 కార్గోబస్సులను ప్రారంభించేందుకు అధికారులు సిద్దం అవుతుండగా వాటిలో నగరంలోని 29 డిపోలకు ఒకొక్కటి చొప్పున కేటాయించగా మిగిలిన 21 జిల్లాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరంలోని అన్ని డిపోలకు ఇందుకు సంబంధించి అలాట్‌మెంట్ ఇవ్వగా సంబంధిత అధికారులు వాటికి సంబంధించిన సిబ్బందిని కూడా సిద్దం చేసినట్లు చెప్పారు.

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే కార్యక్రమంలో భాగంగా నగరానికి సంబంధించిన కార్గో సేవలను ప్రైవేట్  కు అప్పగిస్తామని, యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. కార్గోకు సంబంధించిన పార్సిళ్ళు, ఇతర వస్తువులను ఉంచేందుకు గోడౌన్‌గా బస్టాండ్‌లలో ఖాళీగా ఉన్న స్టాల్స్ లేదా ఎమ్యునిటి సెంటర్‌లలో ఖాళీగా ఉన్న స్థలాలను వీటికి కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇతర ప్రైవేట్ కార్గో సంస్థలకు ధీటుగా వీటిని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్గో సేవలకు సంబంధించిన టారిఫ్‌ను ఇంకా నిర్ణయించలేదని, ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉందన్నారు.

సాధారణ బస్సులను కార్గో బస్సులుగా మార్చేందుకు ఒకోక్క బస్సుకు కేవలం రూ. 1 లక్షా 50 వేలు మాత్రమే అయినట్లు తెలిపారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న సంస్థపై ఎటువంటి అదనపు భారం పడకుండా ప్రయాణికులు ప్రయాణించేందుకు పనికిరాని, పాడై పోయిన బస్సులనే కార్గో సేవలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఎపిఎస్‌ఆర్‌టిసి తన కార్గో సేవల ద్వారా కొంత మేరకు నష్టాల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో అదే మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.

గంటల కొద్ది బస్సులను నడపలేని డ్రైవర్లు, లేదా ఎక్కువ సమయం బస్సులో నిలబడి టికెట్లు ఇవ్వలేని కండక్టర్లను ఈ కార్గో సర్వీస్ పాయింట్లలో నియమించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఏ చిన్ని అవకాశాన్ని వదులుకునేది లేదని, గతంలో మాదిరిగా కాకుండా సంస్థలో ఉన్న ప్రతి సిబ్బంది సేవలను వినియోగించుకుని తద్వారా సంస్థ ఆదాయం పెంచడమే కాకుండా సింగరేణి సంస్థ తరహాలో సంస్థకు లాభాలు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్నారు.

RTC Cargo Services to Pvt persons
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News