Saturday, May 4, 2024

హైపర్ క్షిపణి దాడులు

- Advertisement -
- Advertisement -

Russia Uses Hypersonic Missiles in Ukraine

ఉక్రెయిన్‌పై తొలిసారి ప్రయోగించిన రష్యా
భారీ ఆయుధ నిల్వల కేంద్రాన్ని ధ్వంసం చేసిన అత్యాధునిక కింజాల్ క్షిపణి
మిలిటరీ బ్యారక్స్‌పై దాడిలో వంద మంది ఉక్రెయిన్ సైనికుల మృతి?

మాస్కో: ఉక్రెయిన్‌పై దాడుల్లో భాగంగా రష్యా తన అమ్ముల పొదిలోంచి మరో అస్త్రాన్ని బయటికి తీసింది. శుక్రవారం తమ సరికొత్త కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించి పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఆయుధ నిల్వల కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ‘హైపర్‌సోనిక్ ఏరోబ్లాస్టిక్ క్షిపణులతో కూడిన కింజాల్ ఏవియేషన్ క్షిపణి వ్యవస్థ ఇవనోష్రాంకివిస్క్ ప్రాంతంలోని డెలియాటిన్‌లో ఉక్రెయిన్ క్షిపణులు, విమానయాన మందుగుండు సామగ్రి కలిగిఉన్న పెద్ధ భూగర్భ గిడ్డంగిని ధ్వంసం చేసింది’ అని శనివారం ఆ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడుల్లో కింజార్ హైపర్‌సానిక్ క్షిపణులను ప్రయోగించడం ఇదే మొదటిసారి. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి రష్యా రక్షణ శాఖ ప్రతినిధి నిరాకరించారు. ధ్వనికన్నా పది రెట్లు వేగంతో ప్రయాణించగల ఈ క్షిపణి ఫ్లయిట్ రూట్ మొత్త అదే వేగంతో వెళ్తుంది. ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలనైనా అధిగమించి ఇది లక్షాన్ని ఛేదించగలదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ‘ ఐడియల్ వెపన్’గా అభివర్ణించారు. ఆయుధ నిల్వలున్న డెలియాటిన్ ప్రాంతం పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉంది. కాగా నాటో సభ్య దేశమైన రొమేనియాతో ఈ ప్రాంతం 50 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉండడం గమనార్హం.

మిలిటరీ బ్యారక్స్‌పై దాడిలో డజన్ల సంఖ్యలో మరణాలు?

దక్షిణ ఉక్రెయిన్‌లోని మిలటరీ బ్యారన్‌సపై రష్యా జరిపిన దాడిలో డజన్ల సంఖ్యలో సైనికులు మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు శనివారం తెలిపారు. రష్యా బలగాలు శనివారం తెల్లవారుజామున దాడి చేసిన సమయంలో 200 మందికి పైగా సైనికులు బ్యారక్స్‌లో నిద్రిస్తున్నారని ఉక్రెయిన్ సైనికుడు ఒకరు ఎఎఫ్‌పి వార్తాసంస్థకు తెలిపారు. ఇప్పటివరకు కనీసం 50 మృతదేహాలను వెలికి తీయడం జరిగిందని, అయితే శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో తమకు తెలియదని పూర్తి పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ వ్యక్తి చెప్పారు.అయితే రష్యా జరిపిన దాడిలో కనీసం వంద మంది దాకా చనిపోయి ఉంటారని మరో సైనికుడు చెప్పారు. అయితే అధికారికంగా మరణాల సంఖ్య ఇంకా వెల్లడించలేదు.

అజోవ్‌స్టాల్ స్టీల్‌ప్లాంట్ రష్యా వశం

మరో వైపు ఉక్రెయిన్ బలగాలు రష్యా దళాలతో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ ప్రాంతాల్లో గత 24 గంటల వ్యవధిలో పెద్ద ఘటనలేమీ నమోదు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ చెప్పారు. మరియుపోల్, మైకోలైవ్, ఖేర్సన్, ఇజియంలలో పరిస్థితులుతీవ్రంగా ఉన్నాయని, ఇక్కడ రష్యా దళాలు భారీ ఎత్తున దాడులు చేస్తున్నాయని ఆయన చెప్పారు. మరియుపోల్‌ను చుట్టుముట్టిన రష్యా బలగాలు నగరంలోనూ దాడులు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఐరోపాలోనే అతిపెద్ద మెటలర్జికల్ కర్మాగారాల్లో ఒకటైన అజోవ్‌స్టాల్ స్టీల్‌ప్లాంట్‌పై పట్టుకోసం ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోందని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారయిన వాదిమ్ దెనిసెంకో శనివారం చెప్పారు. అయితే ఈ ఆర్థిక దిగ్గజాన్ని కోల్పోయామని చెప్పగలనని ఆయన అంటూ, ఐరోపాలోనే అతిపెద్ద మెటలర్జికల్ ప్లాంట్ అయిన దీన్ని ధ్వంసం చేస్తున్నారని వాపోయారు.

జపోరిజియాలో 36 గంటల కర్ఫూ

తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజియా నగర శివార్లపై జరిగిన దాడుల్లో 9 మంది మరణించినట్లు స్థానిక డిప్యూటీ మేయర్ అనటోలీ కుర్టీవ్ చెప్పారు. మరో 17 మంది గాయపడినట్లు కూడా తెలిపారు. మరోవైపు నగరంలో 36 గంటల కర్ఫూ ప్రకటించారు. ఇటీవల జపోరిజియాని ఓ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసిన విషయం తెలిసిందే.

రష్యా తన నష్టాలు తగ్గించుకునేందుకు
చర్చలొక్కటే మార్గం: జెలెన్‌స్కీ

కీవ్: ఉక్రెయిన్ దాడులు శనివారానికి 24వ రోజుకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి చర్చలకు పిలుపునిచ్చారు. ‘ ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన, ఉక్రెయిన్ల భద్రత విషయంలో అర్థవంతమైన చర్చలే.. రష్యాకుతన స్వీయ తప్పిదాలనుంచి కలుగుతున్న నష్టాలను తగ్గించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం’ అని అన్నారు. ‘కలిసేందుకు .. మాట్లాడేందకు.. ఉక్రెయిన్‌కు న్యాయం చేకూర్చేందుకు ఇదే తగిన సమయం. లేకపోతే రష్యా భారీ నష్టాలను చవి చూడవలసిఉంటుంది. పుంజుకోవడానికి తరాలు సరిపోవు’ అని రాత్రిపూట జాతినుద్దేశించి చేసిన ఓ వీడియో సందేశంలో జెలెన్‌స్కీ అన్నారు. కీవ్‌లోని అధ్యక్ష భవనం వెలుపల ఈ వీడియోను రికార్డు చేశారు.‘14 వేల మృతదేహాలు, మరిన్ని వేల మంది క్షతగాత్రులతో ఉన్న మాస్కోలోని స్టేడియంను ఊహించుకోండి. ఈ దురాక్రమణలో రష్యా చెల్లించుకున్న మూల్యం ఆ మరణాలు’అని జెలెన్‌స్కీ ఆ వీడియోలు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News