Friday, May 3, 2024

సంచార జాతులకు చేయూత

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ బిసి సమాజంలోని అన్ని కులాలకు సమ న్యాయం జరగాలని అందుకోసం జనాభాలో వాళ్లు ఎంత శాతం మంది ఉంటె అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బిసి కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేసిన అనంతరం 17 సంచార కులాలను బిసిలుగా చేర్చాలని ఫార్వర్డ్ చేయడం వల్లనే పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కెసిఆర్ మానవీయ కోణంలో చూడడం వల్లనే 17 సంచార జాతుల కులాల వాళ్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు కావడం తెలంగాణలోని వెనుకబడిన కులాలకు సంబంధించిన ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం. 70 సంవత్సరాలుగా దగాబడ్డ సంచార జాతులను బిసిలుగా గుర్తించి బిసిల్లో చేర్చడాన్ని తెలంగాణ సమాజం మానవీయ కోణంలో స్వాగతించాల్సిన అవసరం ఉంది.

 

రాజ్యాంగం 370 ఆర్టికల్ ప్రకారం 29 జనవరి 1953 లో మొట్ట మొదటి సారిగా బిసి కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో బిసి కమిషన్ సిఫార్సులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నామమాత్రంగానే కమిషన్ వేయడం, కమిషన్ సిఫార్సులను అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉంచడం మామూలైంది. సిఫార్సులు అమలుకు నోచుకోక ముందే కొత్త సిఫార్సులను కొత్త కమిషన్ ప్రతిపాదించడం, ప్రవేశ పెట్టడం నిరంతరం సాగుతూనే ఉండేది. ప్రభుత్వాలు అధికారంలో గాని, ప్రతిపక్షంలో గాని ఏ రాజకీయ పార్టీ ఏ దశలో ఉన్నప్పటికీ ఆ సిఫార్సులను అమలు జరిపే బాధ్యత ఎవరు తీసుకున్న పాపాన పోలేదు. బిసిలను ఓటు బ్యాంకుగానే చూశాయి తప్ప, వారి బాగోగులు పట్టించుకున్న నాథుడే కరువైనారనే విమర్శ ఉంది. వెనుకబాటుతనాన్ని వినియోగించుకుని బిసిలకు సంబంధించిన ప్రతి విషయంలో అతి సాధారణంగా తీసుకున్నాయి. వాస్తవానికి వివిధ రాజకీయ పార్టీలలో బలమైన నాయకత్వం లేకపోవడం బయట బిసి ఉద్యమ నిర్మాణం కాక పోవడం ప్రధాన కారాణంగా భావిస్తున్నారు.
రాష్ట్రంలో బిసిల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష, అన్యాయం వివిధ ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా వారి అభివృద్ధికి సంచార జాతులు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తే 36 సంచార జాతులకు ప్రభుత్వ ఫలాలు వారిలో కనీసం నోచుకోని వారు ఎందరో ఉన్నారు. అత్యంత వెనుకబడిన గ్రూపులకు, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెట్టినప్పటికీ గుర్తింపులేని కారణంగా ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. సామాజిక జీవితంలో ప్రయాణం కష్టంగా మారింది. 1972 నుండి 2014 వరకు 20కి పైగా కమిషన్ల సంచార జాతుల స్థితిగతులపై అధ్యయనం చేసినప్పటికి కాని ఇప్పటికీ ఏ కమిషన్ ఫలితాన్ని నోచుకోలేదు. దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లు, కుల విభజన జాబితా చూసిన డీ నోటిఫైడ్ ట్రైబ్‌కి చట్టబద్ధత, గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ సంచార జాతులు ప్రదర్శనలు నిర్వహించారు, ఏ లక్ష్యంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మేనిఫెస్టోలో బిసిలకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబిసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఆర్థిక సాయం అందించడమే కాకుండా కులాల వారీగా రాష్ట్ర రాజధానిలో ఆత్మగౌరవ భవనాల కోసం స్థలం, నిధులు మంజూరు చేసిన విషయం విదితమే.

బిసి కులాలలో సంచార జాతులు ఎస్‌సి, ఎస్‌టిల కంటే నికృష్ట జీవితం గడుపుతున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, అడుక్కుంటూ దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో సంచార జాతులను అధ్యయనం చేసినట్లయితే వారి రిపోర్టు ప్రకారం బ్రిటిష్ కాలం నుండి నేరాలకు పాల్పడే వారుగా చూడడంతో వీరంతా సమాజానికి దూరంగా జీవిస్తున్నారనే చెప్పవచ్చు. పట్టణాలకు దూరంగా గ్రామాల సమీపంలో డేరాలు వేసుకొని వీరి నైజం . 17% శాతం మంది వ్యవసాయేతర 12% శాతం చిన్న, చిన్న కూలీలుగా, పాత వస్తువుల సేకరణ, 2% శాతం చిత్తు కాగితాలు, సంచులు, సేకరించడం ఒక్క శాతం మాత్రం గ్రామీణ ఉపాధి, మిగితా వారు తమ సంప్రదాయ వృత్తి బుట్టలు రకరకాల జీవనోపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ గడుపుచున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే వీరిలో 59 శాతం మందికి కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వలన, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నఅనేక సంక్షేమ పథకాలు అర్హులు కావడం లేదు. లబ్ధి అందని ద్రాక్షే, ఫలాలు మిగిలిపోతున్నాయి. సంచార జాతులలో అక్షరాస్యత కూడా కేవలం 39 శాతం మాత్రమే. అందులో చదివింది కేవలం 5 వ తరగతిలోపు ఉన్న వారే ఎక్కువ. ఎన్ని పనులు చేసినప్పటికీ నెలసరి ఆదాయం రూ. రెండు వేల నుంచి నాలుగు వేలు దాటిన దాఖలాలు లేవు. సమాజం గుర్తించడం లేదనే అభిప్రాయం ఉంది.

ఈ నేపథ్యంలో బిసి కమిషన్ సూచనల మేరకు సంచార జాతులు ఎక్కడ పేరు, ఊరు లేకుండా కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా ఆర్థిక భారంతో ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి 17 సంచార జాతులకు చట్టబద్ధత కల్పించి, వారిని గుర్తించి జనజీవన స్రవంతిలో కలిపిన జన హృదయ నేత కెసిఆర్‌కి సహజంగానే నీరాజనాలు పట్టడం జరుగుతుంది. బిసిల పట్ల మొదటి నుంచి కూడా వారికి కావాల్సిన అన్ని సదుపాయాల విషయంలో ఒక అడుగు ముందుకేసి మేము సగం మాకు సగం అని దానికి కావలసినటువంటి అన్ని సమస్యలకు పరిష్కారానికి ఒక మార్గం చూపిన మార్గదర్శి దిక్సూచి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. బిసి కమిషన్ ఏర్పాటు చేయడం వల్లనే క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా సంచార జాతులకు విముక్తి కల్పించి ఈ గుర్తింపు కారణంగా విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపడి తలరాతను మార్చిన తెలంగాణకు రుణపడి ఉంటారని ఆశిద్దాం.

ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు 90% గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రిజర్వేషన్లు పెంచాలన్న దృష్టిని సిఎం కెసిఆర్ సానుకూలంగా ముందుకు తీసుకురావడం, గతంలో తమిళనాడు రాష్ట్ర బిల్లును పివి ప్రభుత్వం ఏ విధంగా తొమ్మిదో షెడ్యూల్లో బిల్లు పెట్టినారో, తెలంగాణ రిజర్వేషన్లు బిల్లు అమలు చేయడానికి కేంద్రానికి కెసిఆర్ విన్నవించడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ రిజర్వేషన్లపై చేసిన చరిత్రాత్మక తీర్మానం కేంద్ర పరిధిలో ఉంది. తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయం గమనించాలి. రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు జాట్లు చేసిన ఉద్యమం ఫలితంగా 68 శాతం రిజర్వేషన్ల చట్టం చేసి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలలో గణనీయంగా జనాభా పెరిగింది. వెనుకబడిన కులాలను గుర్తించాల్సి ఉంది. దానికి సంబంధించిన నివేదిక అమలు పరుచలేదు. రాష్ట్రంలో మాత్రం బిసి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సంచార జాతులను బిసిలలో కలపడం శుభపరిణామం. ఏ లాబీ లేని సంచార జాతులకు గులాబీ పెద్ద దిక్కయింది. అణగారిన వర్గాల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న కెసిఆర్ నిర్ణయం సాహసోపేతమే. కాని, కేంద్రం నిర్ణయంలో ఆలస్యం అయితే రిజర్వేషన్ తగ్గుతాయనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సిఎం కెసిఆర్ బిసి సమాజంలోని అన్ని కులాలకు సమ న్యాయం జరగాలని అందుకోసం జనాభాలో వాళ్లు ఎంత శాతం మంది ఉంటె అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బిసి కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేసిన అనంతరం 17 సంచార కులాలను బిసిలుగా చేర్చాలని ఫార్వర్డ్ చేయడం వల్లనే పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కెసిఆర్ మానవీయ కోణంలో చూడడం వల్లనే 17 సంచార జాతుల కులాల వాళ్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలకు అర్హులుకావడం తెలంగాణలోని వెనుకబడిన కులాలకు సంబంధించిన ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం. 70 సంవత్సరాలుగా దగాబడ్డ సంచార జాతులను బిసిలుగా గుర్తించి బిసిల్లో చేర్చడాన్ని తెలంగాణ సమాజం మానవీయ కోణంలో స్వాగతించాల్సిన అవసరం ఉంది. అన్ని కుల సంఘాలు హర్షిస్తున్నాయి.

సంగని మల్లేశ్వర్

9866255355

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News