Sunday, April 28, 2024

అవినీతిపై కెసిఆర్ మహాస్త్రం

- Advertisement -
- Advertisement -

telangana new revenue act in telugu

తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరలేపిన శుభ రోజు ఈ నెల 9వ తారీఖు. రెవెన్యూ సంస్కరణల కోసం కెసిఆర్ గత 4సంవత్సరాలుగా కఠోర కసరత్తే జరిపారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతి కాన్సర్‌తో కుళ్ళిపోయిందని, అది పూర్తిగా రూపుమాపాలంటే పాత రెవెన్యూ చట్టాలన్నిటినీ సంపూర్ణంగా సంస్కరించాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రాలన్ని సాధించి ఏ విధంగా కెసిఆర్ చరిత్రకారుడయ్యారో అంతే విధంగా రెవెన్యూ వ్యవస్థలో కొత్త చట్టాల్ని తీసుకొచ్చి మరో ‘విప్లవ కారుడు’ అయ్యారు. ఆయన కృషి ఫలించి కొత్త చట్టాలు నిజంగా జనం చుట్టాలుగా మిగిలితే మానవ జాతి ఉన్నంత కాలం ఆయన అందరి మనసుల్లో నిలిచిపోతారు. నిష్కల్మష మనస్కులైన తెలంగాణ ప్రజానీకం ఆయన్ని ‘దేవుడు’గా కొలిచినా కొలుస్తారు. దేశమంతటా ‘అవినీతి మహావృక్షం’ పెరిగిపోవడం మనందరికీ తెలిసిందే. ఆ మహా అవినీతి వృక్షం కొమ్మలు మున్సిపల్, రెవెన్యూ, హోం, ఇరిగేషన్ తదితర శాఖలు. అన్నిటికన్నా ముఖ్యమైంది ‘రెవెన్యూ’ శాఖగా చెప్పవచ్చు.

అవినీతి మాత్రం భారతదేశంలో ఎందెందు వెతికినా అందందే దాగి వుంటుంది. ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం అవినీతిలో భారతదేశం ర్యాంకు 2019 ప్రకారం 80గా చూపింది. అవినీతి సొమ్ము చాలా దేశ రాజకీయాల్లో ప్రభావితం చూపుతున్నాయి.
గత 8 సంవత్సరాల కాలంలో 22 దేశాలు అవినీతిలో మరింత ముందుకెళ్ళాయి. కెనడా, ఆస్ట్రేలియా లాంటి మరో 21 దేశాలు అవినీతి తగ్గించుకొనే దశలో వున్నాయి. 137 దేశాలలో మాత్రం యధాస్థితిలో వున్నాయి. ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా విభాగం 2019లో భారతదేశంలోని పలు రాష్ట్రాలలో అవినీతిపై సర్వే చేసింది. రాజస్థాన్, బీహార్‌లను అత్యంత అవినీతి రాష్ట్రాలుగా పేర్కొంది. మిగిలిన రాష్ట్రాలు వరుసగా రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, గోవా రాష్ట్రాల్ని పేర్కొంది. ఆ రాష్ట్రాలలో జరిపిన సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది తాము డబ్బులిచ్చి పనులు చేయించుకోవాల్సి వచ్చింది అని విచారం వ్యక్తం చేశారు. దీనిని బట్టి కరప్షన్ ఎంతగా వికృత రూపం దాల్చిందో చెప్పవచ్చు. చాలా ప్రామాణికత గల సర్వే సంస్థ ఇది. 20 రాష్ట్రాలలో 248 జిల్లాలలో 81,000 మందిని ఈ సంస్థ సర్వే చేసింది.

టాప్ 10 అవినీతి రాష్ట్రాలలో తెలంగాణ 5వ స్థానంలో నిలవడం మనందరం విచారించాల్సిన విషయం. 2019న చాలా పెద్ద అవినీతి అనకొండలే ఎసిబి వలలో చిక్కిన విషయం భారతదేశాన్నంతటినీ ఆకర్షించింది. సెప్టెంబర్ 1న ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణిపై ఎసిబి దాడులు జరిపింది. ఆమెతో పాటు మరో 16 మందిని కూడా అరెస్టు చేశారు. ఆమె అక్రమ ఆస్తుల విలువ దాదాపు రూ. 300 కోట్లు పైనే. గత వారం మరో 5 కోట్లు దొరికి తిరిగి అరెస్టు చేశారు. శుక్రవారం కూడా మరో నాలుగు కోట్లు దొరికాయి. ఆమె అంతులేని ధన దాహం, విలాస జీవితం, ఆమె దినచర్యల వైభోగం గూర్చి ఆ సంవత్సరమంతా టివిలలో సీరియల్‌లా వచ్చి అందర్నీ ముక్కు మీద వేలు వేసుకొనేలా చేసింది. కార్మిక వర్గాల పొట్ట కొట్టి, వాళ్ళ నోట్లో దుమ్ముకొట్టి, వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి సంపాదించిన పాపిష్టి డబ్బు అది. ఇంకా ఆమె దాచిన నగల గని ఎక్కడుందో? ఇక తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థలోని అవినీతి గూర్చి చర్చిద్దాము. అమాయకులైన తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా రైతన్నల్ని రెవెన్యూ అధికారులు జలగల్లా పీల్చి, పీడించి, నరకాన్ని చూపిస్తున్నారు. భూ వ్యవహారాల్లో లంచాలు, ఇళ్ల పట్టాల్లో లంచాలు, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో లంచాలు ఒకటేమిటి పనిపై ఆఫీసుకెళ్ళిన ప్రజలకు డబ్బులు చేయి తడపందే పనులు జరగవు. ఎసిబి, విజిలెన్స్ వర్గాలు 7 సంవత్సరాల కాలంలో 600 మందికి పైగా ఉద్యోగులపై కేసులు పెట్టారు. ఇందులో అధిక భాగం రెవెన్యూ అని చెప్పాల్సిన పనేలేదు.

గ్రామాల్లో విఆర్‌ఒలను ప్రజలు దయ్యాల్లాగా చూస్తున్నారు. ఎంఆర్‌ఒల లంచగొండి తనం అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా వచ్చాక శతాబ్దాలుగా పాతుకుపోయిన తెలంగాణలోని పటేల్, పట్వారీ వ్యవస్థను పూర్తిగా తుదముట్టించి తెలంగాణ ప్రజల హర్షాన్ని, జేజేల్ని అందుకొని ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. పాత తరం ప్రజలు ఇప్పటికీ ఎన్‌టిఆర్‌ను దేవుడిగానే భావిస్తారు. అలాంటి పీడే ఈ రోజున మరో చీడ ‘రెవెన్యూ’ విభాగం. కెసిఆర్ మంచి ప్రజ్ఞావంతుడు. ప్రస్తుత రెవెన్యూ విధానాన్ని అందులోని లోపాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి. ఏదో విధంగా మంచి చేస్తూ తెలంగాణ ప్రజల మనస్సులు గెలుచుకోవాలన్న తపన ఆయనలో ఎప్పుడూ కన్పిస్తుంటుంది. ఆ ఆలోచనలో భాగంగా పుట్టినదే ప్రస్తుత అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘The Telangana Abolition of Village Revenue Officers Bill’ ఈ వ్యవస్థలో ఇప్పటికే కేన్సర్ అనే అవినీతి వ్యాధి ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అందుకే ఈ వ్యవస్థకు కెసిఆర్ పూర్తి సమాధి కట్టాలనుకొని ఈ చట్టం తీసుకొస్తున్నారు. దీనివల్ల విఆర్‌ఒలు ఇక గ్రామాల్లో ఎక్కడా కనపడరు, ఎవర్నీ పీడించరు.

తెలంగాణలోని అవినీతిశాఖ ఇటీవల కొంత కాలంగా ‘దాడులు పెంచి’ తమ శాఖ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ శాఖ డిజి పూర్ణచంద్రరావుని మనందరం అభినందించక తప్పదు. రాష్ట్రంలో సంవత్సర కాలంలో 209 అవినీతి కేసులు పట్టుకొంటే అందులో సింహభాగం అనగా 50 కేసులు రెవెన్యూ శాఖలోనివే. ఇందులో ఆర్‌డిఒలు, ఎంఆర్‌ఒలు, డిప్యూటీ తహసీల్దార్‌లు, సర్వేయర్లు, విఆర్‌ఒలు వున్నారు. అన్ని కేసుల్లో అత్యంత భయంకరమైన రెండు కేసుల్ని మాత్రం మనం ఒకసారి మననం చేసుకోవాల్సి వుంది. అవినీతి గత ఏడాదికి ఈ ఏడాది 45 శాతం పెరిగింది. అన్నం ఉడికిందా లేదా తెలియడానికి ఒక్క అన్నం మెతుకు పట్టుకుని చూస్తే చాలు అని పూర్వం నుండి వస్తున్న సామెత. దేశంలో అవినీతి వలలో చిక్కుకున్న వారే దొంగలుగా మిగిలినవారు దొరలుగా చలామణి అయిపోతున్నారు. ఎందుకంటే ఎసిబి, విజిలెన్స్ విభాగాలు పకడ్బందీ ఆధారాలుతోనే దాడులు చేస్తున్నారు. అందువల్ల వారు చేస్తున్న దాడులు చాలా స్వల్పం. అడ్డంగా దొరికిపోయిన అధికార్లు కూడా చట్టంలోని లొసుగుల వల్ల తప్పించుకొని తిరగడమో, తిరిగి ఉద్యోగాల్లో చేరిపోవడమో, లేదా బెయిల్‌పై విడుదలై జల్సాగా తిరగడమో చేస్తున్నారు. కొంత రాజకీయ జోక్యం కూడా అవినీతి పెరిగిపోతున్నదానికి కారణం అని చెప్పవచ్చు. ఇందుకు చట్టాలు మార్చాలి. శిక్షలు కఠినంగా వుండాలి. అవినీతి చేయడానికి ఎవరైనా భయపడేలా శిక్షలుండాలి. అవినీతి తుదముట్టించడం చాలా కష్టసాధ్యం. అందుకే కెసిఆర్ కొత్త ఎత్తుగడలో అసలు రెవెన్యూ చట్టాల్నే మార్చడానికి ఉపక్రమించారు.

గత ఏడాది ఇఎస్‌ఐ డైకెక్టర్ దేవికారాణి ఉదంతం జరిగిన కొన్ని రోజుల్లోనే కేశంపేట ఎంఆర్‌ఒ లావణ్య ఉదంతం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈమె ఉత్తమ అధికారిగా కూడా ప్రశంసలు అందుకొంది. ఓ రోజు ఓ రైతు తన పొలం తగాదాలో న్యాయం చేయాల్సిందిగా ఆఫీసులో లావణ్య కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా ఆ అధికారిణి కరుణించలేదు. ఆమె రాతి గుండె స్పందించలేదు. ఆ రైతు ప్రాధేయపడే విడియో, అందులో ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తే ఆమె చాలా గొప్ప నీతిమంతురాలు’ అన్పించేలా వుంది. ఆ 9 ఎకరాల భూ విషయంలో ఈమె అనుంగు శిష్యుడు విఆర్‌ఒ అనంతయ్య రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికాడు.

వారు తీగలాగితే ఆ మహారాణి అసలు రూపం మొత్తం బయటపడింది. ఆమెపై వాళ్ళు దాడి చేయడం ఆమె దగ్గర 93.5 లక్షల రూ. నగదు, 40 లక్షల విలువ చేసే బంగారు నగలు దొరికాయి. ఆస్తులు ఇక లెక్కలేనన్ని. ఆ భర్త కూడా సెప్టెంబర్‌లో ఎసిబికి రెండున్నర లక్షలు లంచం తీసుకొంటూ దొరికిపోయాడు. ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో సూపరింటెండెంట్‌గా వెలగపెట్టేవారు. సతిపతులిద్దరూ అవినీతి జంటగా పేపర్లకెక్కారు. ఆ తర్వాత బాచుపల్లి ఎంఆర్‌ఒ శ్రీదేవి ఇంకా చాలా మంది ఎంఆర్‌ఒలు, విఆర్‌ఒలు కూడా అవినీతి ట్రాప్లో చిక్కుకున్నారు. ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్య్ర దినోత్సవ శుభ దినాన మనందరం టివిల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గర్వంగా చూసేవాళ్ళం. ఆ స్వాతంత్య్ర స్ఫూర్తితోనే కీసర తహసీల్దార్ నాగరాజు ఒ 23 ఎకరాల భూ వ్యవహారంలో లంచంగా కాదు బహుమతిగా రూ. కోటి పది లక్షలు తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కదా అవినీతి శాఖ ఉత్సవాల్లో మునిగి వుంటుందిలే అనే అతి విశ్వాసంతో రియల్టర్‌లను డబ్బు సంచులతో ఆఫీసుకు రమ్మన్నాడు. పాపం స్వాతంత్య్ర సాధన పితామహుడు మహాత్మాగాంధీ ఆత్మ ఆదేశించిందో ఏమో అవినీతి శాఖాధికారులు అప్పటికే అక్కడ పొంచివుండి పట్టేసుకున్నారు. ఈ అవినీతి గురువు ఇలా అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యక్తి ‘టైపిస్టు’గా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి తహసీల్దార్ స్థాయికొచ్చాడు.

గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఒక్కసారి రైడ్ కూడా జరిగింది. అయినా దర్జాగా ఎవరి కాళ్ళో పట్టుకొని ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ ధైర్యమే ఇతణ్ణి అవినీతి సాధనలో మరింత ఉత్సాహంగా నడిపించింది. ఆయన ఆస్తులు, ఇళ్ళు, నగదు అయ్యబాబోయ్ అనిపించాయి. మరో మహా అవినీతి తిమింగళం కూడా ఈ నెల 8న అవినీతి శాఖకు దొరికిపోయింది. ఈయన చేస్తున్న చాలా పెద్ద ఉద్యోగం. గర్వంగా కాలర్ ఎత్తుకొని తిరిగేది. అదే అడిషనల్ కలెక్టర్ ఉద్యోగం. పేరు నగేశ్ ఉద్యోగం మెదక్ జిల్లాలో ఆ మధ్య ఈ జిల్లా కలెక్టర్ రిటైర్డ్ అయ్యారట. మరి ఈ పెద్ద మనిషి అదే అదనుగా చక్రం తిప్పాలనుకున్నాడు. 112 ఎకరాల భూ వివాదానికి సంబంధించి పెద్ద పార్టీ కాల దగిలింది. ఎన్‌ఒసి ఇచ్చేస్తాను కోటి పన్నెండు లక్షలు నగదు, 10 ఎకరాల భూమి తన బినామీ పేరు రాయాలని కండిషన్ పెట్టాడు. బేరాలు జరిగాయి. ఆ సంభాషనలన్నీ రికార్డింగ్ అయి అవినీతి శాఖకు దొరికాయి. ఇంకేం గంతులేస్తూ ఆయన ఇంటికి ఉదయమే వచ్చి పట్టుకొన్నారు. ఇది తాజా బాగోతం కనుక ఇంకా ఈయన సౌభాగ్య సంపద భయటకు రావాల్సి వుంది. ఈ పెద్దాయనతో పాటు మరో 12 మంది రెవెన్యూ అధికారులు కూడా దొరికారు. ఆ రైతే ఈయనని పట్టిచ్చేశారు. ఆ భూమికి ఎన్‌ఒసి ఈయడానికి ఆ రైతు రూ. కోటి 12 లక్షల అగ్రిమెంట్ చేసుకొని కొంత అడ్వాన్స్ ఇచ్చాడు. ఎంతకూ పని జరగకపోవడంతో ఆ రైతే ఎసిబి వాళ్ళకు ఉప్పందించాడు. రూ. 40 లక్షల లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీనికి సంబంధించి నర్సాపూర్ ఆర్‌డిఒగా వున్న ఆరుణారెడ్డి, తహసీల్దార్ మాలతి, తదితరులపై కూడా సోదాలు జరిగాయి.

అరుణారెడ్డి ఇంట్లో 26 లక్షల నగదు, అర కిలో బంగారం దొరికాయి. ఇంకా చాలా వివరాలు రావాల్సివుంది. ఇలా రెవెన్యూశాఖ పూర్తిగా అవినీతిమయంగా మారిపోయింది. దురదృష్టం ఈ ఏడాది కాలంలో మహిళలు కూడా మగవారితో పోటీపడుతూ దొరికిపోయారు. ధనదాహం, అత్యాశ మనిషిని మృగాలుగా మారుస్తోంది. అవినీతి పర్వతం గూర్చి రాసుకొంటూ పోతే గ్రంథాలే అవుతాయి. “ఈ ప్రపంచంలో నీవు చూడాలనుకొన్న మార్పు నీతోనే ఆరంభం కావాలి” – మహాత్మాగాంధీ. “ఎవరో ఒకరుఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా ఆటో ఇటో ” సిరివెన్నెల సీతారామశాస్త్రి. అందుకే రెవెన్యూ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నడుం కట్టాడు. భూ వివాదాలు, భూ తగాదాలు, భూ లంచాలు లేకుండా ఓ మంచి అధ్యాయాన్ని తేలవాలనుకొన్నారు. మేధో మథనం చేశారు.

అనేక మంది మేధావులతో ఆర్థికవేత్తలతో, న్యాయమూర్తులతో, రెవెన్యూలో తలనెరిసిన పెద్దలతో చర్చించారు. కొంతమంది అధికార్లను కూడా నాలుగు సంవత్సరాల పాటు ఆ చట్టం తీసుకురావడం పనిలోనే నిమగ్నం చేశారు. మంచి అధికార్ల టీం లభించడం కెసిఆర్‌కి బాగా కలిసొచ్చింది. ఈ బిల్లు ప్రవేశం రోజునుండే దీనిపై పెద్ద చర్చ బయల్దేరింది. కోట్లాది తెలంగాణ బిడ్డల మనసుల్లో ముఖ్యంగా రైతుల్లో వెలుగు, ఆనందం వెల్లివిరిసాయి. భూ వివాదాలు, భూ తగాదాల కేసులు తెలంగాణ అంతటా వేలాది కేసులు వివిధ కోర్టుల్లో మగ్గుతున్నాయి. చిన్నచిన్న భూ తగాదాలకు కూడా రైతులు కోర్టుల చుట్టూ, సర్వేయర్ల చుట్టూ, ఎంఆర్‌ఒల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కెసిఆర్ కల నిజమై బిల్లు చట్టమై తెలంగాణలోని ప్రతి లోగిల్లలోనూ సంతోష వృక్షాలు మొలకెత్తడం ఖాయం. ఇక విఆర్‌ఒలుండరు. ధరణి అనే పోర్టల్‌లో యావన్మంది భూ వివరాలు అత్యంత సమగ్రంగా పొందుపరిచి వుంటాయి. ఎవరికి ఎలాంటి లంచం ఈయాల్సిన పనిలేదు. ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన శ్రమ లేదు. దీని విజయం ఖచ్చితంగా కెసిఆర్ తెలంగాణ దేవుణ్ణి చేస్తుంది. ఇంటింటా కెసిఆర్ ఫోటోలు వెలుస్తాయి. తక్షణమే సర్వే స్టార్ట్ చేయించి పూర్తి చేయిస్తే అందరి కళ్ళల్లో ‘బతుకమ్మ’ ఆశీస్సులు కనిపిస్తాయి. తర్వాత కెసిఆర్ హాయిగా ఢిల్లీకి వెళ్ళి చక్రం తిప్పవచ్చు. రీజినల్ ఫ్రంట్ స్థాపించవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News