Monday, April 29, 2024

సంపాదకీయం: కాంగ్రెస్ పార్టీలో మార్పులు

- Advertisement -
- Advertisement -

kesavananda bharati passed away

గత నెలలో 23 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖాముఖంగా కోరినట్టు కాంగ్రెస్ సమూలమైన మార్పులతో తనను తాను దిద్దుకునే దిశగా అడుగులు వేస్తున్నదా, పార్టీలోని వివిధ పదవులకు ఎన్నికలు జరిపించి అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందా, గట్టిగా పని చేసే పూర్తి స్థాయి నాయకత్వాన్ని సమకూర్చుకోనున్నదా లేక మరేదైనా వ్యూహంతో పావులు కదుపుతున్నదా? శుక్రవారం నాడు అది తీసుకు వచ్చిన వ్యవస్థాగత మార్పులు గమనించేవారికి వాటి ఆంతర్యం ఖచ్చితంగా అంతుబట్టదు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని బాగు చేసుకోడానికి వాస్తవిక దృష్టితో కూడిన అడుగు ఒకటి పడిందని చెప్పవచ్చు. నిజానికి కాంగ్రెస్‌లో వివిధ పదవులకు ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిపించడం, పూర్తి స్థాయి ఆంతరంగిక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమనేవి అసంభవమని చెప్పక తప్పదు.

గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీ సూచించినట్టు, ప్రియాంక గాంధీ ఇటీవల మళ్లీ చెప్పినట్టు గాంధీయేతరుల చేతికి పార్టీ పగ్గాలు అప్పగించడం ఆషామాషీ కాదు. ఒక వేళ అటువంటిది జరిగినా అది మొక్కుబడి వ్యవహారంగానే ఉండి గాంధీల చేతుల్లోనే అసలు పగ్గాలు కొనసాగుతాయని గట్టిగా చెప్పవచ్చు. పార్టీ అధ్యక్ష పదవిని గాని, అది సాధించుకునే దేశాధికారాన్ని గాని అత్యుత్సాహులైన బయటి వారికి అప్పగిస్తే ఏమి జరుగుతుందో అనుభవం ద్వారా తెలుసుకున్న సోనియా గాంధీ కోరికోరి అటువంటి పరిస్థితిని మళ్లీ తీసుకు రారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి చివరి సారిగా 1998లో ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నాడు తీసుకు వచ్చిన మార్పులలో భాగంగా వర్కింగ్ కమిటీ పునర్వవస్థీకరణ జరిగింది కాబట్టి దానికి ఎన్నికలంటూ ఇక ఉండవు.

పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సహకరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ నియామకం, వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జీలుగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు కొందరిని ఆ బాధ్యతల నుంచి తప్పించి మరి కొందరు కొత్త వారికి వాటిని అప్పగించడం కూడా తాజా భారీ దిద్దుబాటు చర్యల్లో భాగంగా జరిగిపోయాయి. ఇందులో కొట్టవచ్చినట్టుగా కనిపించింది సీనియర్ నాయకుడు, లేఖకుల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్‌ను హర్యానా పార్టీ బాధ్యతలతో కూడిన ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడం. అదే సందర్భంలో వర్కింగ్ కమిటీలో ఆయనను కొనసాగనిచ్చారు. ఉత్తరం రాసిన మొత్తం 23 మందిపైనా చర్య తీసుకోకుండా అందులో కొందరి ప్రాధాన్యతను పెంచడం గమనార్హం. ఆజాద్‌తో పాటు వృద్ధ నేత మోతీలాల్ ఓరా (91), అంబికా సోనీ, మల్లికార్జున్ ఖర్గే, లిజినో ఫలేరియో, గౌరవ గొగోయ్, ఆశాకుమారి, ఆర్‌సి ఖుతియా, అనురాగ్ ఎన్ సింగ్‌లను వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జీ బాధ్యతలతో కూడిన ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు.

లేఖ మీద సంతకం చేసిన ఆనంద శర్మ, జితిన్ ప్రసాద, ముకుల్ వాస్నిక్ వంటి వారి జోలికి పోలేదు. వాస్నిక్‌ను ప్రధాన కార్యదర్శిని చేసి మధ్యప్రదేశ్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ కమిటీ సభ్యత్వంతో పాటు పార్టీ అధ్యక్షురాలి సలహా సంఘం సభ్యత్వాన్ని కూడా కట్టబెట్టారు. మొత్తం మీద లేఖకుల్లో కొందరిని దూరంగా ఉంచి మరి కొందరి ప్రాధాన్యం పెంచడంలో చీలించి పాలించే వ్యూహం స్పష్టపడింది. రాహుల్ గాంధీ ఇష్టులను మరింతగా చేరదీసి ఆయనకు అయిష్టులైన వారిని దూరం పెట్టారని బోధపడుతున్నది. వచ్చే జనవరిలో జరిగే ఎఐసిసి సమావేశాల్లో రాహుల్‌ను తిరిగి పార్టీ అధ్యక్షుడిని చేయడానికి వీలుగా మార్పులు జరిగాయని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. లేఖ సంచలనం దరిమిలా జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశం తరువాత రాహుల్ బృందంలోని పార్లమెంటు సభ్యులిద్దరికి లోక్‌సభలో పార్టీ నాయకత్వ బాధ్యతలప్పగించారు.

పార్టీ ఇటీవల నెలకొల్పిన పది మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీలో కూడా కెసి వేణుగోపాల్ వంటి రాహుల్ సన్నిహితులకు చోటు లభించింది. కేరళకు చెందిన వేణుగోపాల్‌కు రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఇప్పించారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిని చేశారు. గత వర్కింగ్ కమిటీ సమావేశంలో యుపిఎ 2లోని మంత్రులను కడిగిపారేసిన వారి ప్రాధాన్యాన్ని కూడా బాగా పెంచారు. కొత్తగా తెలంగాణకు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మాణిక్యం టాగోర్ రాహుల్ ఇష్టుల బృందంలోని వారేనని చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికలలో ఓటమి తర్వాత ఎంత మంది బతిమలాడినా కొనసాగకుండా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన తదుపరి కార్యక్రమం ఏమిటనేది తెలియక సన్నిహితులు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు దానికి పూర్తిగా తెరపడిపోయినట్టే. నిజానికి ప్రతి సందర్భంలోనూ ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా తప్పుపడుతూ ఎన్‌డిఎని నేరుగా ఢీ కొంటున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడుగా వార్తలకెక్కుతుండడంలోనే రాహుల్ లక్షం ప్రస్ఫుటమవుతూ వచ్చింది. ఇప్పుడది పూర్తిగా ముసుగు తొలగించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News