Monday, April 29, 2024

ఢిల్లీ బాసులు రాసిన తీర్పు ఇది

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర స్పీకర్ నిర్ణయంపై థాక్రే వర్గం ఆరోపణ

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని పార్టీని అసలైన శివసేనగా అసెంబ్లీ స్వీకర్ రాహుల్ నార్వేకర్ గుర్తించడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) మండిపడింది. దొంగల ముఠాను గుర్తించడం ద్వారా రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆరోపించింది. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని రాష్ట్ర ప్రజలు క్షమించబోరని శివసేన(యుబిటి) సొంత పత్రిక సామ్నాలో గురువారం ప్రచురించిన సంపాదకీయం పేర్కొంది. స్పీకర్ తీర్పు వెనుక ఢిల్లీలోని బిజెపి పెద్దల హస్తం ఉందని సామ్నా ఆరోపించింది.

స్పీకర్ తీర్పు ముందుగానే నిర్ణయించబడిందని, దీనిపై దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం లేదని సామ్నా తెలిపింది. ఢిల్లీలోని నార్వేకర్ బాసులే ఈ సుదీర్ఘ తీర్పును రాశారని సామ్నా ఆరోపించింది. బాల్ థాక్రేకు చెందిన శివసేనను ద్రోహుల చేతికి అప్పగించడం మహారాష్ట్రకు ద్రోహం చేయడమేనని మరాఠీ దినపత్రిక సామ్నా పేర్కొంది. చరిత్రను సృష్టించే అవకాశం నార్వేకర్‌కు వచ్చిందని, కాని ఆయన తన నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సామ్నా పేర్కొంది. కాగా.. శివసేన(యుబిటి) అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయం చేసే బాధ్యతను స్పీకర్ నార్వేకర్‌కు అప్పగిస్తే ఆయన షిండే తరఫు న్యాయవాదిగా వ్యవహరించారని ఆరోపించారు.

ఈ నిర్ణయం తాము ఊహించిందేనని, దీని వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ తీర్పుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పారు. న్యాయం చేసే బాధ్యతను సుప్రీంకోర్టు స్పీకర్ నార్వేకర్‌కు అప్పగించిందని, కాని ఆయన షిండే గ్రూపు తరఫున నార్వేకర్ వాదించారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శివసేనకు చెందిన 2018 నియమావళిని స్పీకర్ తిరస్కరించడం తప్పని, దీన్ని సుప్రీంకోర్టు ముందు కూడా ఉంచామని ఆయన చెప్పారు. బిజెపి కార్యకర్తగా నార్వేకర్ పనిచేశారే తప్ప న్యాయమూర్తిగా కాదని ఆయన అన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News