Sunday, April 28, 2024

కాంగ్రెస్ అహ్మద్ భాయ్ ఇకలేరు

- Advertisement -
- Advertisement -

 

కరోనాతో కన్నుమూసిన సీనియర్
సోనియా, రాహుల్ ఆంతరంగికుడు
పార్టీలో సర్దుబాట్ల దిట్టయిన పటేల్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బుధవారం కన్నుమూశారు. సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పటేల్‌కు పేరుంది. 71 సంవత్సరాల అహ్మద్ పటేల్ కరోనా సంబంధిత విషమ పరిస్థితి ఏర్పడటం, పలు ప్రధాన అవయవాలు క్రమేపీ పనిచేయకుండా పోవడంతో ఆయన మృతి చెందారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఈ నెల 15వ తేదీనుంచి చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన పరిస్థితి విషమిస్తూ వచ్చింది. ఈ క్రమంలో తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో తన తండ్రి మృతి చెందారని అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన పటేల్ పార్టీ అత్యున్నత స్థాయి వ్యూహకర్తగా పేరుతెచ్చుకున్నారు. నెలరోజులుగా ఆయన కరోనాతో బాధపడుతూ రావడంతో అనారోగ్యం మరింత తీవ్రతరం అయిందని, చికిత్సకు స్పందించలేని స్థితిలో మృతి చెందారని తెలియచేయడానికి చింతిస్తున్నట్లు ఫైసల్ తెలిపారు.

‘జన్నాతుల్ ఫిరదౌస్, ఇన్షాల్లాహ్’ అని వేదనాభరిత ట్వీట్ వెలువరించారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు కోవిడ్ నిబంధనలను పాటించాలని, పరామర్శకు తరలిరాకుండా ఉండటం మంచిదని సూచించారు. పార్టీలో అహ్మద్ పటేల్‌ను అత్యధికులు ‘ ఎ పి ’ అని పిలుస్తుంటారు. స్నేహితులు అహ్మద్ భాయ్ (ఎబి) అంటుంటారు. సోనియా గాంధీకి పటేల్ చాలాకాలం వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. పార్టీలో సంక్షుభిత దశలలో ఎనలేని సేవలు అందించారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా మన్ననలు పొందారు. ఇతర పార్టీల నేతలు పార్టీలతో కీలక సంక్లిష్ట విషయాలలో కూడా పార్టీపరంగా సరైన సమన్వయ సాధన దిశలో చాణక్య నీతిని ప్రదర్శించి, ఈ అత్యంత పురాతన పార్టీలో తనదైన ముద్రవేసుకున్నారు. మృధుభాషి, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుంది. రాజీవ్ గాంధీకి ఆంతరంగిక మిత్రుడిగా నిలిచిన అహ్మద్ పటేల్ 1985 86 మధ్యకాలంలో ప్రధానికి పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరించారు. రాజకీయ రాజకీయేతర రంగాలకు చెందిన వారితో కూడా మంచి సాన్నిహిత్యం పటేల్ సొంతం.

తనకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయిందని అక్టోబర్ 1వ తేదీనే పటేల్ స్వయంగా తెలియచేసుకున్నారు. తనను ఈ దశలో కలిసేందుకు వచ్చిన వారు విధిగా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. గుజరాత్ నుంచి ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఎనిమిది పర్యాయాల పార్లమెంటేరియన్‌గా ఖ్యాతి గాంచారు. ఐదు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మూడు సార్లు లోక్‌సభ సభ్యులుగా గెలిచారు. 2017లో గుజరాత్ నుంచి ఎగువ సభకు ఎన్నిక దశలో తీవ్ర పోటీ ఎదురైంది. పార్టీ ఫిరాయింపుల దశల నడుమనే ఎన్నిక జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా కూడా ఉన్న పటేల్‌ను పలు ముఖ్యమైన విషయాలపై సోనియా రాహుల్‌లు సంప్రదిస్తూ సలహాలు తీసుకుంటూ ఉండటం ఆనవాయితీ అయింది. అహ్మద్ పటేల్‌కు భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. కోవిడ్ సంబంధిత అనారోగ్యంతో రెండు మూడు రోజుల క్రితమే సీనియర్ కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ మృతి చెందారు. ఇప్పుడు పటేల్ మరణం సంభవించింది. అహ్మద్ పటేల్ మరణవార్తపై దేశవ్యాప్తంగా పలువురు నేతల నుంచి సంతాప ప్రకటనలు వెలువడ్డాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు ఇతరులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ నేతకు నివాళులు తెలియచేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ ఇతరులు సంతాప ప్రకటనలు వెలువరించారు. సీనియర్ పార్లమెంటేరియన్,సిపిఎం నేత సీతారాం ఏచూరి, డిఎంకె నేత స్టాలిన్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అహ్మద్ పటేల్‌ను స్మరించుకున్నారు.

పార్టీకి జీవితం అంకితం చేశారు : సోనియా
రాజకీయ పరిణతితో వ్యవహరించిన అహ్మద్ పటేల్ తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకోసం అంకితం చేశారని సోనియా గాంధీ స్పందించారు. తాను ఓ కీలకమైన పార్టీ సహచరుడిని కోల్పోయ్యానని సంతాప సందేశం వెలువరించారు. పార్టీ పట్ల ఆయన విశ్వాసం విధేయత, కట్టుబాటు, అంకితభావం కలకాలం గుర్తుకు ఉంటాయి. ఇతరులకు సాయం చేసేందుకే నిలిచే వ్యక్తిగా మెదిలారు. ఔదార్యం సహృదయత సంతరించుకున్న అరుదైన నేత అని సోనియా ప్రకటన వెలువడింది. తాను భర్తీ చేయలేని ఓ కామ్రేడ్‌ను నష్టపోయినట్లు , స్నేహితుడిగా కూడా నిలిచిపోతారని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

ఇదో విషాదకర ఘట్టం : రాహుల్
అహ్మద్ పటేల్‌జీ మరణం ఓ విషాదకర ఘట్టం అని పార్టీ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ఓ స్తంభంగా నిలిచారని , పార్టీకోసమే జీవించారు, పాటుపడ్డారని, ఎప్పుడూ పార్టీ బాగోగులే ధ్యాసగా నిలిచారని తెలిపారు. పలు క్లిష్టదశలలో పార్టీకి పటేల్ సేవలందించారని, తనకు మార్గదర్శకులుగా నిలిచిన ఆయన మరణం పార్టీకి తీరని నష్టం కల్గించిందని పేర్కొన్నారు. బాధాతప్త కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్లు వివరించారు. ఆయన లేని లోటును పార్టీ భరించాల్సి ఉంటుందని, కుమారుడు ఫైసల్, కూతురు ముంతాజ్ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. అత్యంత విజ్ఞుడైన నాయకుడు అని అహ్మద్ పటేల్ మృతికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. అనుభవజ్ఞుడైన పటేల్‌తో తాను తరచూ రాజకీయ విషయాలపై సలహాలు తీసుకుంటూ వచ్చానని, ఆయన తమ కుటుంబానికి రాజకీయంగానే కాకుండా ఇతరత్రా కూడా స్నేహితుడిగా నిలిచారని తెలిపారు. స్థిరత్వం, విధేయత్వం, ఆసాంతం ఆధారపడతగ్గ వ్యక్తితం పటేల్ లక్షణాలు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News