Tuesday, April 30, 2024

అందుబాటులోకి కొవిషీల్డ్.. ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600

- Advertisement -
- Advertisement -

సీరం కొవిషీల్డ్ మందు అందుబాటులోకి
రాష్ట్రాలకు రూ.400 చొప్పున, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600
డోస్‌ల ఉత్పత్తి పెంచేందుకు రెడీ

Serum's Covishield at Rs 600 for Private Hospitals

న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్‌ను వ్యాపార సరళిలో విక్రయించేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఔషధ సంస్థ సీరం ఇనిస్టూట్ ఆఫ్ ఇండియా (సీరం) ముందుకు వచ్చింది. ప్రైవేటు మార్కెట్‌లో తమ సంస్థ ఉత్పత్తి అయిన కొవిషీల్డ్ టీకాల ధరలను బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రైవేటు ఆసుపత్రులకు డోస్ ఒక్కంటికి రూ 600, అవసరం మేరకు డిమాండ్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలకు డోస్‌కు రూ 400 చొప్పున ఈ టీకాను విక్రయిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వ్యాక్సిన్ ఉత్పత్తిదార్ల సాధకబాధకాలను వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంది. వ్యాక్సిన్ తయారీ సంస్థలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్లకు విక్రయించుకునేందుకు వీలుకల్పించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ప్రముఖ వైద్యులు, సాంకేతిక నిపుణులతో సుదీర్ఘస్థాయి, విశ్లేషణాత్మక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో కరోనా ఉధృతి కారణాలను, కట్టడికి తీసుకుని తీరాల్సిన వాస్తవిక అంశాలను వారితో కూలంకుషంగా సమీక్షించారు. తరువాత ఇందుకు అనుగుణంగా మార్కెట్‌లో విరివిగా టీకా డోస్‌లు అందుబాటులోకి రావల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్‌లో ఈ టీకాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అధీకృత నిర్ణయం వెలువరించారు. ఈ నిర్ణయాన్ని సీరం సంస్థ స్వాగతించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఉత్పత్తిలో 50 శాతం కోటాను కేంద్రానికి, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందిస్తామని ఈ సంస్థ నిర్వాహకులు బుధవారం వెలువరించిన ప్రకటనలో తెలిపారు. ఈ ఔషధ సంస్థ ముఖ్యకార్యనిర్వాహణాధికారి యువ పారిశ్రామికవేత్త అయిన అధర్ పూనావాలే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమకు ఇంతవరకూ టీకా ఉత్పత్తికి సంబంధించి ఉన్న అవరోధాలు తొలిగినట్లు హర్షం వ్యక్తం చేశారు. అత్యవసరం అయిన ఈ మందును అందరికి సకాలంలో అందుబాటులోకి తీసుకువచ్చే లక్షానికి కట్టుబడి ఉంటామన్నారు. వచ్చే రెండు నెలల్లో ఉత్పత్తిని మరింత పెంచుతాం అని తెలిపారు.
ఓన్లీ నాలుగు నెలలు తరువాత రిటైల్ మార్కెట్‌లోకి
సీరం టీకాను వచ్చే 4 లేదా 5 నెలల కాలంలోనే రిటైల్ మార్కెట్‌లో ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీనితో ఇప్పుడు జనం డాక్టర్ల చిట్టీల మేరకు అవసరం అయిన మందులను కొనుగోలు చేసినట్లుగానే మార్కెట్‌కు వెళ్లి డోస్‌లను తీసుకుని వెళ్లవచ్చు. వీటిని నిర్ణీత పద్థతి ప్రకారం వేసుకుంటే చుట్టుముట్టే వైరస్ వీరిని ఏమి చేయకుండా ఉంటుంది. ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం, అంతకు మించి ప్రజల నుంచి తమ సంస్థ పట్ల వెలువడుతున్న ఆదరణల క్రమం మధ్య తాము ఉత్పత్తి సామర్థాన్ని రెండు మూడింతలు చేసుకుని తీరుతామని సీరం సంస్థ తెలిపింది. వచ్చే నాలుగు అయిదు నెలలు అంటే ఈ సంవత్సరాంతానికి కొవిడ్ టీకా విరివిగా దొరికేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ టీకాల ఉత్పత్తి సంస్థలు అయిన సీరం, భారత్ బయోటెక్‌లకు కలిపి రూ 4500 కోట్ల సాయం అందించారు. ఈ మొత్తాన్ని తరువాతి క్రమంలో పెంచుతామని కూడా తెలిపారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల సంస్థల నుంచి ఉత్పత్తి అయిన టీకాల కోటాలు నేరుగా కేంద్రానికి వెళ్లుతున్నాయి. దీనితో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాజకీయ పక్షపాత ఆరోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం అనివార్యంగా తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు రాష్ట్రాలు ఆయా సంస్థల నుంచి నేరుగా టీకాలను డబ్బులిచ్చి తీసుకుని వెళ్లవచ్చు. విదేశీ టీకాల రాకకు కూడా మార్గం ఏర్పడితే జాతీయ స్థాయి విధివిధానాలకు అనుగుణంగా వీటిని కూడా రాష్ట్రాలు పొందేందుకు వీలేర్పడుతుంది. ఎప్పుడైతే ప్రాణాంతక వైరస్‌కు విరుగుడు విరివిగా అందుబాటులోకి వస్తుందో అప్పుడు మూలపుటేళ్లను ముందుగానే నరికేసేందుకు వీలేర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇకపై సంస్థల నుంచి రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ కోటాను కొనుక్కోవచ్చునని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఖరారు చేసిన 50 శాతం కోటాలలో కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు అయిన ధరలతో సమీకరించుకోవచ్చు. మరింతగా అవసరం అయితే నేరుగా ఆయా వ్యాక్సిన్ల తయారీ సంస్థలను సంప్రదించి వ్యాక్సిన్‌ను పొందేందుకు కేంద్రం స్వేచ్ఛ కల్పించిన తరుణంలోనే ఇప్పుడు సీరం సంస్థ తమ టీకా ధరను ప్రకటించింది.
1న ఆరంభమయ్యే మూడో విడతకు ఊతం
వచ్చే మే నెల 1 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ల మూడో దశ ఆరంభం అవుతుంది. ఇప్పటికే వ్యాక్సిన్లు పొందుతున్న వారికి తోడుగా ఇప్పుడు ఈ దశలో దేశంలో 18 సంవత్సరాలు పై బడ్డ వారికీ టీకాలు అందుబాటులోకి వస్తాయి. దీనితో దేశంలో అత్యధిక శాతంగానే ఉన్న యువతరం అత్యుత్సాహంగా టీకా కోసం పోటీ పడే వీలుంది. దీనితో ఈ డిమాండ్‌ను తీర్చేందుకు అవసరం అయిన సాధనసంపత్తిని ఆయా సంస్థలు మరింత జోరుగా సమీకరించుకుంటున్నాయి. ఈ తరుణంలో వచ్చే వారం పదిరోజులలో మొదలయ్యే మూడో దశ వ్యాక్సినేషన్ దేశంలో కరోనాపై యుద్ధంలో అత్యంత కీలక ఘట్టం కానుంది. లాక్‌డౌన్‌లు, ఇతరత్రా ఆర్థిక ఆంక్షలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఉన్న దశలో జన జీవన విధానంలో, మార్కెట్ వ్యవస్థలలో ఎటువంటి కీలక మార్పులు లేకుండా కరోనా కట్టడికి అవసరం అయిన ప్రక్రియను అన్వేషించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ క్రమంలో దండిగా వ్యాక్సిన్లను అందరికి అందుబాటులోకి తేవడం అత్యుత్తమ మార్గం అనే అంశాన్ని గ్రహించింది. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మన దేశానికి ఏర్పడ్డ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థాన్ని మన బలంగా ఎంచుకుని కరోనాను దెబ్బతీసేందుకు టీకాల ఉత్పత్తిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు మార్గం సిద్ధం అవుతోంది. దీని వల్ల అత్యయిక వైద్య పరిస్థితులను అధిగమించేందుకు ఆపరేషన్ వంటి లాక్‌డౌన్‌లు ఇతరత్రా దిగ్బంధాలు అవసరం లేని పరిస్థితిని కల్పించుకోవచ్చునని ఆశిస్తున్నారు.

Serum’s Covishield at Rs 600 for Private Hospitals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News