Saturday, May 11, 2024

యాదాద్రి ఆర్జిత సేవలు 31 వరకు రద్దు

- Advertisement -
- Advertisement -

తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత, నేటి మధ్యాహ్నం నుంచి దర్శనం నిలిపివేత
వేములవాడలో పలు ఆర్జిత సేవలు రద్దు
ఏప్రిల్ 3 వరకు తలనీలాలకు స్వస్తి
నిత్యాన్నదాన సత్రాలు మూసివేత
థర్మల్‌గన్‌లతో భక్తులపై నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ప్రస్తుతం ఆలయాలపై పడింది. గుళ్లకు వెళ్లాలంటేనే ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఆలయాల్లో భక్తుల రద్దీ రోజుకురోజుకు పడిపోతుండగా, భక్తులు దర్శనాలకు రావొద్దంటూ ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ లోని యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలను ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోగా, నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి చెరువుగట్టు శ్రీ పార్వతీజడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నేటి నుంచి ఈ నెల 31 వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే మొయినాబాద్‌లోని చిల్కూరు బాలాజీ టెంపుల్‌ని మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఆలయ అధికారులు వెల్లడించగా, భద్రాద్రి రాములోరి కల్యాణానికి భక్తులు రావద్దొని మంత్రి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఎక్కడికక్కడ భక్తుల నియంత్రణకు దేవాలయ అధికారులు పలు చర్యలు చేపడతున్నారు. ఎపిలోని తిరుపతి శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాలని టిటిడి నిర్ణయించింది. నేటి(శుక్రవారం) మధ్యాహ్నం నుంచి తిరుపతి ఆలయాన్ని మూసివేయనున్నట్టుగా టిటిడి వర్గాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలో అధికంగా కేసులు నమోదవుతుండడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచే షిర్డీ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ఇలా పలు ఆలయాలపై కరోనా ఎఫెక్ట్ పడడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

శ్రీవారి మూలవిరాట్టుకు కైంకర్యాల కొనసాగింపు
ఇప్పటికే భక్తుల దర్శనాలను నియంత్రించిన టిటిడి ఇప్పుడు, శ్రీవారి మూలవిరాట్టుకు నిర్వహించే స్వామి వారి కైంకర్యాలను కొనసాగిస్తూ భక్తుల దర్శనాలను రద్దు చేసింది. అత్యవసర పరిస్థితిలో తిరుమలేశుని దర్శనాలను నిలిపి వేయవచ్చని ఆగమ శాస్త్రం చెబుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆలయంలో దర్శనాల నిలిపివేత ప్రక్రియ ప్రారంభమయ్యింది. తిరుమల సహా ఎపిలోని ప్రధాన ఆలయాల్లో దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ఎపి మంత్రి నాని ప్రకటించిన కొద్ది సేపటికే తిరుమలలో మార్పులు ప్రారంభమయ్యాయి. ముందుగా దర్శనం టైమ్ స్లాట్లను ఇవ్వడాన్ని అధికారులు నిలిపి వేసి, అలిపిరి చెక్ పోస్టును మూసి వేసి భక్తులు కొండ మీదికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దర్శనానికి టైమ్ స్లాట్లను పొందిన వారిని మాత్రం అలిపిరి నుంచి అనుమతిస్తుండ డంతో గురువారం రాత్రి వరకు భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని టిటిడి వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం ఉదయం కొన్ని సేవలకు సంబంధించి జారీ చేసిన టిక్కెట్ల మేరకు భక్తులను అనుమతించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెలాఖరు దాకా భక్తులు తిరుమలకు ప్రయాణాన్ని పెట్టుకోవద్దని టిటిడి ఇప్పటికే శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Tirumala
తిరుమల ఘాట్‌రోడ్ల మూసివేత
ఇప్పటికే తిరుమల ఘాట్‌రోడ్లను కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టిటిడి విజిలెన్స్ అధికారులు ప్రకటించారు. అలిపిరి గరుడ సర్కిల్ నుంచి వచ్చే భక్తులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఎగువ ఘాట్ రోడ్డుపైకి వాహనాలు వెళ్లకుండా అధికారులు నిలిపివేస్తున్నారు. కొండ పైనుంచి వాహనాలను కిందకు మాత్రమే అనుమతిస్తున్నారు. కొండ పైనుంచి వాహనాలన్నీ కిందకు వచ్చాక దిగువ ఘాట్ రోడ్డును కూడా మూసేయనున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్లు కాలినడక మార్గాలను టిటిడి అధికారులు మూసివేశారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఘాట్ రోడ్లను మూసివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో భక్తులు లేక వెలవెల
నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీకాళాహస్తి, కాణిపాకం దేవాలయాలు సైతం భక్తులు లేక వెలవెలబోతున్నాయి. అన్నదానం, రాహుకేతులు పూజలు చేయించుకొనే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని శ్రీకాళహస్తి ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. వచ్చిన కొద్ది మంది భక్తులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించి వస్తున్నారు. ఇంద్రకీలాదిపై అంతరాలయ దర్శనాన్ని అక్కడి అధికారులు రద్దు చేశారు.
యాదగిరిగుట్టలో కరోనా నివారణకు శ్రీ సుదర్శన నారసింహ మహా ధన్వంతరి జపాహోమం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దేవాలయ ఈఓ గురువారం ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు, ఆలయానికి వచ్చే భక్తులందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్వామివారి లఘు దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నిత్య కల్యాణం, శాశ్వత కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, కేశకండనం అన్ని రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రజలు ఆలయ సమీపంలో గుంపులుగా ఉండకుండా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దేశాలయానికి వచ్చిన భక్తులు, ఇక్కడ వస్తువులు అమ్మే దుకాణదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. కరోనా వైరస్ నివారణకు ఆలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహా ధన్వంతరి జపా హోమాన్ని ఆర్చకులు నిర్వహిస్తున్నారు.

services Cancelled in Yadagirigutta Temple till March 31st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News