Saturday, April 27, 2024

శశికళ అనూహ్య నిర్ణయం!

- Advertisement -
- Advertisement -

Shashikala quits from Politics

 

జైలు నుంచి విడుదలై బయట కాలు పెట్టగానే తమిళనాడు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని తడాఖా చూపిస్తానంటూ స్పష్టమైన ప్రకటన చేసిన వికె శశికళ ఇంతలోనే అందుకు పూర్తి విరుద్ధమైన ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగించే పరిణామమే. ఆధ్యాత్మిక రాజకీయ శకానికి శ్రీకారం చుడతానంటూ అత్యంత ఆలస్యంగానైనా అట్టహాసంగా రాజకీయ అరంగేట్రం చేస్తానన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇలాగే ఆకస్మికంగా తెర వెనుకకు వెళ్లిపోయారు. అయితే ఆయన తన ఆరోగ్య పరిస్థితిని చూపించి తప్పుకున్నారు. శశికళ ఇదమిత్థమైన కారణమేదీ చెప్పకుండానే రాజకీయ సన్యాస ప్రకటన చేశారు. గత నెలలో ఆమె జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు రాజకీయాల పైన పాలక ఎఐఎడిఎంకె పగ్గాలు చేపట్టడంపైనా అసాధారణమైన ఉత్సాహాన్ని చూపారు. ప్రస్తుతం తమిళనాడును పాలిస్తున్న ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం తనపట్ల ప్రదర్శిస్తున్న విముఖతను మనసులో పెట్టుకొని ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెలో గూడుకట్టుకున్న రాజకీయ దీక్షను ప్రతిబింబించాయి.

తన కారుపై పార్టీ జెండాను పెట్టుకున్నందుకు పళనిస్వామి వర్గం అభ్యంతరం చెప్పడం కూడా తననెంతో బాధించినట్టు ఆమె చెప్పుకున్నారు. వారు నన్ను చూసి భయపడుతున్నారు, తాను వస్తున్నానని తెలిసి మెరీనా బీచ్‌లోని జయలలిత స్మారక స్థలాన్ని మూసివేశారని కూడా అన్నారు. ఎఐఎడిఎంకె గుర్తు కోసం న్యాయస్థానంలో శశికళ పోరాడనున్నారని ఆమె దగ్గర బంధువు ఎఎంఎంకె (అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం) ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ ప్రకటించిన సంగతి తెలుసు. అవన్నీ ఏమయ్యాయి, శశికళ ఎందుకిలా తన జెండాను తానే అవనతం చేశారు అనే ప్రశ్నకు సరైన సమాధానం కనిపించడం లేదు. వాస్తవానికి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించినందుకు ఆమె మరి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు. ఆ విషయం తెలిసీ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ఆమె ప్రకటించారంటే బహుశా దినకరన్‌ను ముందుంచి వెనుక నుంచి కథ నడిపించాలని ఆమె భావించి ఉంటారు.

బెంగళూరు నుంచి ఆరున్నర, ఏడు గంటల్లో చెన్నై చేరిపోయి ఉండవలసిన శశికళ ప్రయాణం ఆరోజున 23 గంటలు తీసుకోడం దారి పొడుగునా ఆమె అభిమానుల స్వాగత సంరంభం మిన్నుముట్టడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె రాక తమ పతనానికి నాంది కాగలదని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం భయపడిన సూచనలు నిజంగానే కనిపించాయి. అంతటి నల్లేరు మీది నడకలాంటి పరిస్థితిని ఉపయోగించుకోకుండా శశికళ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? దీనికి ఇప్పట్లో సరైన సమాధానం లభించదు. కాని కిమ్మనకుండా తప్పుకోడానికి బదులు నిజమైన జయలలిత అనుచరులందరూ కలిసి కట్టుగా పని చేసి డిఎంకెను ఓడించండి అని ఆమె పిలుపు ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటి? డిఎంకెని ఓడిస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది పళనిస్వామే గాని తాను కాదన్న సంగతి ఆమెకు తెలియదా? తెలిసీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారా?

అటువంటప్పుడు జయలలిత పాలన వస్తేనేమి, రాకపోతే ఏమి ఆమెకు ఒరిగేదేమీ ఉండదు కదా, అయినప్పటికీ జయలలిత పాలనను శశికళ కోరుకుంటున్నారంటే భవిష్యత్తులో సందు దొరికితే తిరిగి ఎఐఎడిఎంకె పగ్గాలు చేపట్టాలనే కాంక్ష ఆమెలో గూడుకట్టుకున్నదనే అనుకోవాలి. అటు రజనీకాంత్, ఇటు శశికళ అస్త్రసన్యాసం చేసిన తర్వాత రేపటి అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాడు యుద్ధ రంగం ఎఐఎడిఎంకె, డిఎంకెల మధ్యనే సిద్ధమై ఉందని భావించక తప్పదు. డిఎంకె గనుక గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది కేంద్ర పాలక పక్షం భారతీయ జనతా పార్టీకి తలవంపులు తెస్తుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో అక్కడ గల 39 లోక్‌సభ స్థానాల్లో డిఎంకె కూటమి ఒకటి తప్ప మిగతా అన్నింటినీ గెలుచుకున్నది. అందుచేత ఆ పార్టీని తక్కువ అంచానా వేయడానికి వీల్లేదు. డిఎంకె కూటమిలో కాంగ్రెస్ కూడా ఉన్నది కాబట్టి దానిని మట్టి కరిపించడం ద్వారా హస్తం పార్టీని దెబ్బ తీయాలన్నది బిజెపి వ్యూహం.

తానుగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని బిజెపి సాధించుకోజాలదు కాబట్టి ఎఐఎడిఎంకె విజయానికి వెనుక నుంచి తోడ్పడం ద్వారా అక్కడ పరోక్ష ప్రాబల్యాన్ని మరింతగా గట్టిపరచుకోవాలని అది ఆశిస్తున్నది. శశికళ కనుక ప్రత్యేక శక్తిగా ఈ ఎన్నికల్లో ప్రవేశిస్తే ఎఐఎడిఎంకె ఓట్లను ఆమె భారీగా చీల్చుకుంటారని అది డిఎంకెకి అనాయాస విజయం కట్టబెడుతుందని తలచి ఆమెను మొత్తం ఎన్నికలకే దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఆమె చేత రాజకీయ సన్యాసాన్ని చేయించారని అది తాత్కాలిక సన్యాసమే కాగలదని భావించవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News