Monday, April 29, 2024

శిల శిల్పమయ్యే కవన సందేశం

- Advertisement -
- Advertisement -

కవి, గాయకుడు జయరాజ్ రాసిన ’శిల నీవే..శిల్పి నీవే..శిల్పం నీవే సృష్టిలో..’ అనే గీతం ఇటీవల యూట్యూబ్ లో విడుదలై ఇప్పటికే లక్షల గుండెల్ని తాకింది. కర్ణపేయంగా ఆలపించి చక్కని దృశ్యాలతో చిత్రీకరించిన ఈ 23 నిమిషాల వీడియోకు పాటే ప్రాణం. ఆ పాటలోని పదజాలం, భావం, హితబోధ విన్నవారి మనసుల్ని కరిగిస్తోంది. పత్రికలో వస్తే దీర్ఘ కవితగా , పాడితే అమర గానంలా బతికే లక్షణాలు ఈ గీతానికున్నాయి.
ఉత్తమ మానవీయ కోణంలో, ఉన్నత సాహిత్య విలువలున్న ఈ గీతం జయరాజ్ రచనల్లో మరో ఆణిముత్యంగా భాసిల్లుతుంది. అమ్మ, ప్రకృతి, నీరు, మానవ సంబంధాల ప్రధానంగా ఎన్నో గీతాలు రాసిన జయరాజ్ ’శిల నీవే..’లో అన్ని పార్శ్వాలను రంగరించి కుప్ప పోశారు. తెలుగులో కలకాలం నిలిచే గురజాడ ’దేశమంటే మట్టి కాదోయ్!’, దాశరథి ’ఆ చల్లని సముద్ర గర్భం..’ గీతాల సరసన నిలిచే స్తోమత ఈ గీతానికి ఉంది.
నిజానికి పాటకు ఏ అలంకరణలు, తోడ్పాట్లు అవసరం లేదు. పాటంటే కొన్ని పదాలు, ఒక గొంతు అంతే! అప్పుడే అచ్చంగా పాట నిలుస్తుంది. కళ్ళుమూసుకొని విన్నా మనసులో వెలిగేదే సాహిత్యపరంగా నిజమైన పాట. జాతీయ పండుగల్లో వినిపించే శ్రీశ్రీ గీతం ’పాడవోయి భారతీయుడా!’ ఏ సినిమాలోదో, ఎవరి పాడారో, ఎవరిపై తీశారో అనేవి వెనక్కి వెళ్లి చెవిన పడగానే మనసు దృష్టిని లాగేస్తుంది. అదీ పాట గుణం, పాట విజయం. ఆ లక్షణాలన్నీ జయరాజ్ ’శిల నీవే..’లో ఉన్నాయి.
శిల, శిల్పి, శిల్పం నీవే సృష్టిలో అనే పదాల్లోనే ప్రతి మనిషి జీవితానికి కర్త, కర్మ, క్రియ తానే అనే సందేశముంది.

సొంత అనుభవాలతో, జ్ఞానంతో మనిషి తనను తాను మలచుకోవాలనే సూచనతో పాటు భ్రమలకు, మూఢత్వాలకు దూరంగా నిండుమనిషి జీవనానికి రూపశిల్పివి నీవే, ఫలాలకు అధికారివి నీవే అనే హితబోధ ఇందులో ఉంది. మనిషిగా పుట్టినందుకు, సంఘజీవిగా బతుకును సార్థకం చేసుకొనే క్రమాన్ని కవి చరణ ముద్రగా వివరించారు. కవి తాత్విక గీతం అని చెప్పినా ప్రతి పదం మానవహితం కోరేదే! ప్రజాకవిగా పేరొందిన జయరాజ్ లోలోపలి తల్లడింపుకు అక్షర రూపమిది.
గత కాలపు ఘనతగా కీర్తింపబడే మన సాహిత్యంలో అధికభాగం ఏకపక్షంగానే సాగింది.

దేవుడే ఈ సృష్టికి మూలమని, మనిషి సకల కష్టాలకు, సుఖాలకు దేవుడే నిర్ణయాధికారి అని, దేవుణ్ణి పూజిస్తే, విశ్వసిస్తే కష్టాలు రూపుమాపుతాడని, ఉన్నవారి పట్ల శ్రమజీవులు అణిగిమణిగి ఉండాలని అది బోధించింది. మూగవాన్ని పలికించే బృందావనం, నీ కాలు తాకి రాయి ఏడాది అయినదంట అనే పదాలు మైమరిపించేలా ఉన్నా వర్తమానంలో రుజువు కానివి. తార్కికత, సత్యం, వాస్తవం, నిరూపణ గల సాహిత్యం కావాలిప్పుడు. హేతుబద్దత, నీతినియమాలు నేర్పే వేమన పద్యాలూ, సుమతీ శతకం అక్కడే ఆగిపోయాయి. అలాంటి జీవిత సత్యాలకు కొనసాగింపుగా నీ జీవితానికి నీవే ఆధారం, మరెవ్వరూ లేరనే సందేశంతో మానవ జీవన సౌందర్యానికి, సార్థకతకు తన గీతం ద్వారా మార్గాన్ని చూపారు జయరాజ్.
ఈ గీతంలో వర్తమాన ఆధునిక జీవితంలో మనిషి వదులుకుంటున్న, కోల్పోతున్న ప్రతి విషయాన్ని ఎత్తుకున్నారు. ఒక్కో చరణం ఒక్కో అధ్యాయంలో సమానం. తాత్వికతతో మొదలైన చరణాలు ప్రకృతి, పశు పక్షుల ప్రాధాన్యతతో పెనవేస్తూ మానవ జీవన విధానంలో రావలసిన మార్పులను, తద్వారా సంఘం, మనిషి, ప్రకృతి పొందే ప్రయోజనాలను వివరిస్తాయి.
ప్రకృతితో మనిషి అనుబంధాన్ని వివరిస్తూ ’వెన్నెల, పున్నమి, ఇంద్రధనస్సులు చూసే పుట్టుకెంత భాగ్యమో!’ అంటారు. కష్టసుఖాలను సమంగా చూసేలా ’వెలుగులను వేటాడే చీకటి.. చీకటిని చెండాడే వెలుగు’ ఉంటుందని అంటారు. ’కలలు కనకుండా సంద్రం అలలు మీటేనా!’ అని ఆశలు చావనీయరు.

’శ్రమకు జీవం పోసినపుడే కడుపు నిండేది’ అని శ్రమ విలువను కాపాడుతారు. ’పుట్టుకకు లెక్క ఉన్నది.. పట్టుదలకు లక్ష్యమున్నది.’ ’అలలకు భయపడితే నావ దరికి చేరేనా?’ అని నిరాశను దారికి చేరనీయరు. ’దేవుడిని చేసింది నీవు.. దైవముగా కొలిచింది నీవు.. మతమును సృష్టించి జనుల మతులను మార్చింది నీవు.. మానవత్వమే మనిషి మతము కావాలోయ్ !’ అని మనుషులంతా ఒక్కటే అని చాటారు. మనిషికి జ్ఞానమొక్కటే చాలదు, వివేకం అలవరచుకోవాలి అని మనిషితనానికి ప్రాథమ్యాలను విడమరిచారు.
‘ఆకూ తెంచుతే పాలుగారే అమ్మతనముంది కొమ్మలో.. సృష్టిలో ప్రతిజీవికి సృజన ఉన్నది తెలుసుకో!’ అని అమ్మకు చెట్టుకు సామ్యత కూర్చారు. సర్వం తన చుట్టూ పెట్టుకొని గుడ్డితనంతో ఏమిలేదని బాధ పడతావన్నారు. గేయమంతా సరళ భాషా ప్రయాణం, ఓలలాడే స్వర పరవశం. ఆద్యంతం మనిషికంటిన మాలిన్యాలను శుభ్రపరచే ప్రయాస. కవి వర్తమానాన్ని పరీక్షించి భవిష్యత్తును తన మనో జ్ఞాననేత్రంతో దర్శించి తోటి మనిషిని మేలుకొలపాలి. ఈ గీతం ద్వారా జయరాజ్ తన కవి పాత్రకు న్యాయం చేశారు.
పాటలో ఎక్కడా రాజకీయ ప్రస్తావన లేదు, ప్రభుత్వాలపై విమర్శ లేదు, వ్యక్తులను కించపరచింది లేదు. మానవ జీవిత ఔన్నత్యాన్ని చాటే క్రమంలో పైవన్నీ అల్ప విషయాలే అనిపిస్తాయి. మనిషి ఎవరి ప్రలోభాలకు లోను కాకూండా, మాయ మాటలు నమ్మకుండా తనే శిలనై, తానే శిల్పియై తన వివేచనతో, తన అనుభవజ్ఞానంతో మానవతామూర్తిగా మారమని నివేదిస్తున్నారు. మనుషులంతా మానవత్వ శిల్పాలైతే అమానవీయ ధోరణులు వాటికవే కూలిపోతాయనే సత్యం ఈ పంక్తుల్లో ఉంది.
జయరాజ్ కవన పయనంలో ఇదొక మజిలీ. ముందు తానే శిల్పిగా తన శిల్పాన్ని చిక్కుకున్న ఈ కవి తద్వారా తనొందిన జ్ఞాన సంపదను గీతాల అల్లికతో మనకందిస్తున్నారు. ఇక మనిషిని ఉద్దరించడానికి మరొకరి సాయమద్దు. శిల నీవే.. శిల్పి నీవే.. శిల్పానివి నీవే సృష్టిలో.ఈ పదాల స్ఫూర్తితో ఇక కార్యోన్ముఖులవడమే మిగిలుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News