Tuesday, April 30, 2024

రాష్ట్రంలో ఆరు హాట్‌స్పాట్‌లు

- Advertisement -
- Advertisement -

Corona hotspots

 

1. భైంసా
2. నిర్మల్
3. నిజామాబాద్
4. హైదరాబాద్
(పాతబస్తీ)
5. గద్వాల
6. మిర్యాలగూడ

ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినం
మర్కజ్ యాత్రికులు సంచరించిన ప్రాంతాలపై నిఘా

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు కరోనా హాట్ స్పాట్స్‌ను గుర్తించి ఆయా ప్రాం తాలలో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనుంది. కరోనావ్యాధి సోకిన వారు బయటకు ఎవరికీ చెప్పకుండా ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి వాటిని హాట్ స్పాట్స్‌గా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో భైంసా, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ పాతబసీ, గద్వాల్, మిర్యాలగూడను హాట్ స్పాట్స్‌గా ప్రకటించారు. ఆయా ప్రాంతాలలలో శనివారం నాటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు, వైద్యధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

రెండు,మూడు రోజుల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు నివసిస్తున్న ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతుండటంతో కరోనా ప్రభావిత ప్రాంతాలను హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో చాలా మంది బయట తిరిగారు. తమ తమ ప్రాంతాల్లో పలువురిని కలిశారు. లాన్‌డౌన్‌ను ఉల్లంఘించి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆరు హాట్ స్పాట్లలో లాక్‌డౌన్‌ను మరింత పక్కాగా అమలు చేయబోతున్నారు.

హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నిబంధనలు : రాష్ట్ర ప్రభుత్వం హాట్‌స్పాట్ ప్రాంతాలుగా గుర్తించిన పరిసర ప్రాంతాల్లో మూడు కి.మీ. పరిథి వరకు ఎవరినీ ఎక్కడికీ అనుమతించరు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఉండే వారిని బయటకు వెళ్లనీయడం కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఈ ప్రాంతాలకు బయట నుంచి కూడా ఇతరులను లోపలకు అనుమతించరు. అయితే ఆయా ప్రాంతాలలో ఉన్న వారికి నిత్యవసర వస్తుసామాగ్రిని వారి ఇళ్లవద్దకే తరలించేందుకు సర్కారు సమాలోచనలు సాగిస్తోంది. అలాగే వారి ఇళ్లను తాగునీరును అందించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.

జిల్లాల వారీగా చర్యలు : రాష్ట్రం నుంచి 1200 మంది మర్కజ్ వెళ్లని యాత్రికులు వివరాలతో పాటు వారి సన్నిహితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో జిల్లాల వారీగా మర్కజ్ వెళ్లిన ప్రాంతాలలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక మహిళ, నల్లగొండ పట్టణానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయా ప్రాంతాలను హాట్‌స్పాట్‌గా గుర్తించారు.అలాగే నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 399 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, వీరంతా ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 45 మంది జాబితా ఉందని, వారికి పరీక్షలు చేసి ఫీవర్ ఆస్పత్రికి పంపించారు. కాగా 45 మందిలో 34 మందికి నెగిటివ్ రావడంతో హోం క్వారంటైన్‌కు తరలించారు. అదేవిధంగా కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురిని ఫీవర్ ఆస్పత్రిలో చేర్చామని, వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

నిజామాబాద్ జిల్లా నుంచి ఢిల్లీలో జరిగిన తబ్లీగ్ జమాత్ మర్కజ్‌కు 57 మంది వరకు వెళ్లినట్టు అధికారులు గుర్తించగా వారిలో 42 మంది క్వారంటైన్‌కు తరలించారు. అయితే మిగిలిన 15 మంది ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈక్రమంలో మూడేండ్ల బాలుడిలోనూ వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. ఒకటి రెండు చోట్ల వైద్య మహిళా సిబ్బందిపై కుక్కలను ఉసిగొల్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ 123 బృందాల చేత 18 వేల ఇళ్లను సర్వే పూర్తిచేశారు. కాని కొన్ని చోట్ల ఇంటికి తాళాలు వేసి ఉన్నాయని సమాచారం. దాంతో సర్వే పాక్షికంగానే జరిగిందనీ, కరోనా నిర్ధారణకు పూర్తిగా ఉపయోగపడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

Six Corona hotspots in the state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News