Home తాజా వార్తలు పాలమూరు పచ్చబడాలే

పాలమూరు పచ్చబడాలే

2021 నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోతల ద్వారా సాగునీరు

అనుకున్నట్టుగానే పనులు జరగాలి
పాలమూరురంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్
పనులను తనిఖీ చేసిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి, అధికారుల బృందం
ఏదుల రిజర్వాయర్ వద్ద ప్యాకేజీల వారీగా పనులపై సమీక్ష, అధికారులకు ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఎట్టి పరిస్థితుల్లో 2021 నాటికి సాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజాప్రతినిధుల సమావేశం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ప్రాజెక్టు ఇంజనీర్లు పాలమూరు-రంగారెడ్డి పనులను శుక్రవారం తనిఖీ చేశారు. శ్రీశైలం తిరుగు జలాల నుంచి పిఆర్‌ఎల్‌ఐకి నీరు తీసుకునే పాయింట్ మొదలుకుని నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్, టన్నెల్, పంప్‌హౌస్‌లు అన్నింటిని తనిఖీ చేశారు. అనంతరం ఏదుల రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో ప్యాకేజీ వారిగా మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నార్లాపూర్‌లో సాధ్యమైనంత ఎక్కువ నీరు నిలువ ఉంచే సామర్థానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏదుల, నార్లాపూర్ పిఆర్‌ఎల్‌ఐ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు తాగునీరు అందించేలా చూడాలన్నారు. కెఎల్‌ఐడి 5 ద్వారా తక్షణమే ఏదుల రిజర్వాయర్‌ను నింపాలి. ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పవర్ బిల్లులు ప్రాజెక్టు ఇంజనీర్‌ల ఆధ్వర్యంలో ఉంచాలన్నారు.

ఉపాధి హామీ పథకం కింద పిఆర్‌ఎల్‌ఐ డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు చేపట్టే అవకావం పరిశీలించాలన్నారు. మిగిలిపోయిన పనుల పూర్తికి ఒక ప్రత్యేక సమయం నిర్ణయించి, పనులు చేయని ఏజెన్సీలను తొలగించి బిట్స్ చేసి ఇతరులకు అప్పగించాలన్నారు. ఆర్ అండ్ ఆర్ భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిఆర్‌ఎల్‌ఐ ద్వారా సాధ్యమైనంత త్వరగా సాగునీరు ఇవ్వాలన్నారు. పనులు వేగవంతం చేసి, ప్రతినెలా పనుల పురోగతిని వాట్సాప్ ద్వారా ఉమ్మడి పాలమూరు ప్రజాప్రతినిధులందరికీ తెలిజేయాలన్నారు. ఏకకాలంలో కాలువ పనులు, టన్నెలు పనులు చేపట్టాలని కోరారు. పిఆర్‌ఎల్‌ఐ ద్వారా 80 శాతం నుంచి 90 శాతం నీరు మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్‌కు సాగునీటి సౌకర్యం లేదని, త్వరగా నీరివ్వాలనే తమ తపన అర్థం చేసుకోవాలన్నారు. కర్వేన రిజర్వాయర్‌లో ఎలాంటి ఇబ్బంది లేదని, ఉదండాపూర్ రిజర్వాయర్‌లో సమస్యలేదురైతే ఎంఎల్‌ఎల సహకారంతో పరిష్కరిస్తామన్నారు. ప్రజాప్రతినిధులందరితో మరోసారి వట్టేం, కరవేన, ఉదండపూర్ సందర్శించి మహబూబ్ ‌నగర్‌లో సమావేశం నిర్వహించాలన్నారు.

దేవరకద్ర ఎంఎల్‌ఎల ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వట్టెం, కర్వేనపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలన్నారు. శంకర సముద్రం, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల సమస్యలపై మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు గువ్వల బాల్‌రాజు, కె.దామోదర్ రెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపిలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు, నాగర్‌కర్నూల్ జెడ్‌పి ఛైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణ రెడ్డి, ప్రాజెక్టుల సిఇ రమేష్, ప్రాజెక్టుల సలహాదారు పెంటరెడ్డి, ఎంఎల్‌ఎలు డాక్టర్ లకా్ష్మరెడ్డి, జైపాల్ యాదవ్, మర్రి జనార్ధన్ రెడ్డి, కొల్లాపూర్ ఎంఎల్‌ఎలు భీరం హర్షవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు శర్మన్, షేక్ యాస్మిన్ భాష, ఏజెన్సీలు హాజరయ్యారు. పిఆర్‌ఎల్‌ఐఎస్‌ఇ తదితరులు పాల్గొన్నారు.

Srinivas Goud Inspection at Palamuru-Rangareddy Project