Tuesday, May 14, 2024

క్రికెట్‌కు స్టెయిన్ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

Steyn says goodbye to International cricket

జోహెన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మంగళవారం స్టెయిన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో స్టెయిన్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఫార్మాట్ ఏదైనా అసాధారణ రీతిలో చెలరేగి పోవడం స్టెయిన్ అలవాటుగా మార్చుకున్నాడు. దక్షిణాఫ్రికా విజయాల్లో స్టెయిన్ కీలక పాత్ర పోషించాడు. ఎన్నో మ్యాచుల్లో సౌతాఫ్రికాకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టిన ఘనత స్టెయిన్‌కు మాత్రమే దక్కుతోంది. స్టెయిన్ ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా వన్డేలు, ట్వంటీ20 ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించాడు. ఇక ప్రపంచ క్రికెట్‌లోని ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బౌలర్లలో స్టెయిన్‌ను ఒకడిగా పరిగణించవచ్చు. సౌతాఫ్రికా తరఫునే కాకుండా ఐపిఎల్‌ల్లోనూ స్టెయిన్ సత్తా చాటాడు. 2008 నుంచి క్రమం తప్పకుండా ఐపిఎల్ ఆడుతున్న స్టెయిన్ వివిధ ప్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా స్టెయిన్ బరిలోకి దిగాడు. ఐపిఎల్ కెరీర్‌లో మొత్తం 95 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 97 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతేగాక సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు ఆడాడు. ఇందులో రికార్డు స్థాయిలో 439 వికెట్లను పడగొట్టాడు. దీంతో పాటు 125 వన్డేలు ఆడి 196 వికెట్లను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. మరోవైపు 47 టి20ల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన స్టెయిన్ 64 వికెట్లు పడగొట్టాడు. కాగా 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. ఇక తన చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ను 2020లో ఆస్ట్రేలియాతో ఆడాడు. ఇదిలావుండగా రెండు మూడేళ్లుగా స్టెయిన్ గాయాలతో సతమతమవుతున్నాడు. దీని ప్రభావం అతని బౌలింగ్‌పై కూడా పడింది. ఇలాంటి స్థితిలో క్రికెట్‌కు వీడ్కోలు పలకడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. ఇక స్టెయిన్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక స్టెయిన్ రిటైర్మెంట్‌పై అతని మాజీ, ప్రస్తుత సహచరులు సయితం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టెయిన్ ప్రతిభను వారు కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News