Sunday, May 5, 2024

30 దాకా కఠినంగా లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

cm kcr

 

ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం
1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు
ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు
విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి
క్యూఈ విధానంలో రాష్ట్రాలను ఆదుకోవాలి
– నాలుగున్నర గంటల పాటు తన అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన సిఎం కెసిఆర్
పాజిటివ్ కేసులు : 503
కొత్త కేసులు : 16
మరణాలు : 14(శనివారం ఇద్దరు)
డిశ్చార్జి : 96
యాక్టివ్ కేసులు : 393
క్వారంటైన్ : 1654
కంటైన్‌మెంట్ ప్రాంతాలు : 243
చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ సీరియస్ లేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఏప్రిల్ 30 తరువాత పరిస్థితిని బట్టి దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామన్నారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని, ప్రధానమంత్రి నరేంద్రమోడికి పంపుతున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తున్నామని సిఎం ప్రకటించారు. అయితే పదవ తరగతి పరీక్షల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయంతో పాటు అన్ని రకాల ఆహార ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు, నిత్యావసరాల తయారీ పరిశ్రమలు, కాయగూరల విక్రయాలను లాక్ డౌన్ నుంచి మినహాయించామన్నారు. తెలంగాణలో రైతులదే రాజ్యమని సిఎం వ్యాఖ్యానించారు. అయితే, అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలను రద్దు చేస్తున్నామని సిఎం స్పష్టం చేశారు.

సుదీర్ఘ మంత్రివర్గ సమావేశం తరువాత కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శనివారం మరో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 503కు చేరుకుందని తెలిపారు. ఇప్పటివరకు 96 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని, 14 మంది చనిపోయారన్నారు. ఇంకా 393 మందికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిదశలో క్వారంటైన్‌లో ఉంచిన మొత్తం 25,933 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు సంబంధించి 1654 క్వారంటైన్‌లో ఉన్నారని వివరించారు. అన్ని రాష్ట్రాలు కలసి పనిచేశాయని, కరోనా నియంత్రణలో ఉందన్నారు. ఇంకో పది పదిహేను రోజులు ఇలాగే ఉంటే దేశం బాగుంటుందని సిఎం వ్యాఖ్యానించారు. పిఎం వీడియో కాన్ఫరెన్స్‌లో అందరు సిఎంలు రెండు వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారన్నారు. ఒకరిద్దరు, మాత్రం రెడ్‌జోన్‌లలో మాత్రమే లాక్‌డౌన్ ఉండాలని ప్రస్తావించారన్నారు. లాక్‌డౌన్ పొడగింపుతో పాటు, రాష్ట్రం డిమాండ్‌లతో కూడిన రెండు లేఖలను పిఎంకు పంపుతున్నట్లు చెప్పారు.

243 కంటైన్‌మెంట్ క్లస్టర్లు.. డోర్ డెలివరీ
ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని కెసిఆర్ తెలిపారు. వైరస్ ఇతర ప్రాంతాలకు సోకకుండా కంటైన్‌మెంట్ (వ్యాధి ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు) క్లస్టర్లుగా 243 ప్రాంతాలను గుర్తించామన్నారు. ఇందులో జిహెచ్‌ఎంసి పరిధిలో 123 ప్రాంతాలు ఉండగా, ఇతర ప్రాంతాల్లో 120 ఉన్నాయన్నారు. అయితే ఇందులో ఎవరి పరిస్థితి సీరియస్‌గా లేదన్నారు. ఇక్కడ మొత్తం నిత్యావసరాలు డోర్ డెలివరీ చేసుతన్నట్లు తెలిపారు. ఇక కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 24 తరువాత కరోనా నుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడినట్లేనన్నారు. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 11 మంది చనిపోగా, రాజస్థాన్‌లో 117 పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. మహారాష్ట్ర బార్డర్‌ను పూర్తిగా సీల్ చేసే ఆలోచన చేస్తున్నట్లు సిఎం తెలిపారు.

రూ. 4వేల కోట్లకు.. వచ్చింది రూ.వందకోట్లే
రాష్ట్రాల రుణాలపై కేంద్రం డిఫర్మెంట్ ఇవ్వాలని కేంద్రా న్ని కోరుతున్నామని అన్నారు. రాష్ట్రానికి ఈ సమయంలో 4 వేల కోట్ల రూపాయలు రావాలి, కానీ వంద కోట్లే వచ్చాయన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. అప్పులు కడితే, తినడానికి ఉండదు. కేంద్రానికి, రాష్ట్రానికి ఆదాయం లేదు. ఈ సమయంలో క్యూ.ఇ విధానం మేలుగా వివరించారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ దేశానికి కూడా మనకు రిజర్వ్ బ్యాంకు మాదిరి గవర్నింగ్ బ్యాంకులు ఉంటాయని, ఇలాంటి సందర్భాల్లో వాళ్లే ముందుకు వచ్చి క్యూ.ఇ అమలు చేస్తుంటారన్నారు. కేంద్రానికి ఉన్న జిడిపి ప్రకారం కొంత డబ్బును ప్రభుత్వా ల ద్వారా మార్కెట్‌కు రిలీజ్ చేయడమేనని వివరించారు. అమెరికన్ ఫెడరల్ బ్యాంకు 10 శాతం క్యూఇ ఇచ్చిందని తెలిపారు. 201920 ఆర్థిక సంవత్సారినికి దేశ జిడిపి 203 లక్షల కోట్లు నిర్ధారించడబడిందని, దీంట్లో 5 శాతం ఇచ్చినా 10 లక్షల కోట్లు పైచిలుకు వస్తుందన్నారు. దానిని వివిధ రూపాలలో ప్రభుత్వాలు ప్రజలకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు.

దస్తీలు కట్టుకోవాలి…
జబ్బు వచ్చిన వాడు ఇతరులకు అంటించే పాపం చేయ డు. కానీ, జబ్బు వచ్చిందని తెలియక అంతా బాగుందని తిరుగుతాడు. వేరేవాళ్ళకు అంటిస్తాడు. నిజాముద్దీన్ పోయినోళ్ళు ఎవరు, వారి చుట్టాలెవరు.. ఎక్కడెక్కడ తిరిగారన్నది… రోకలి బండ తలకు చుట్టమన్నట్లే ఉందని సిఎం పేర్కొన్నారు. చెప్పినట్లు వినకపోతే పోలీసులు కొట్టక తప్పదని హెచ్చరించారు. నూనెలు వంటి నిత్యావసరాలు కల్తీ చేస్తే పి.డి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండు, మూడే ళ్లు జైళ్లో వేస్తామన్నారు. మాస్కులు ఎవరికి వారు ఇంట్లో తయారు చేసుకోవాలని, దస్తీలు, బట్ట కర్చీఫ్ కట్టుకోవాలని సూచించారు. నామోషీ అక్కర్లేదని, కోట్లాది మందికి మాస్కులు అందవని స్పష్టం చేశారు. లిక్కర్‌క నో చాన్స్ అని, డిమాండ్ చేస్తే అది పిచ్చితనమవుతుందన్నారు.

చేయిదాటితే ప్రైవేటుకు..
ప్రైవేటు సంస్థలతో టెస్టులు చేయించాల్సిన అవసరం ప్రస్తుతం లేదన్నారు. ప్రభుత్వం వెయ్యి టెస్టులు చేయగలదని, పాజిటివ్ వస్తే నోటిఫైడ్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తామన్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ఒకవేళ చేయిదాటితే ప్రైవేటుకు అవకాశం ఇస్తామన్నారు. ఇండొనేషియా నుంచి వచ్చిన వారు బ్రెడ్, చికెన్, ఐపాడ్లు, ల్యాప్‌టాప్ అడిగారు.. అన్నీ ఇచ్చామని వివరించారు. ధనికులు, పేదలు అనే తేడా లేకుండా అందరి ట్రీట్మెంట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని సిఎం తెలిపారు.

ఏం తప్పు చేసినమో.. చాలు భగవంతుడా!
పిఎం కేర్‌కు సిఎస్‌ఆర్, టాక్స్ లాంటి నిబంధనలు వర్తింపజేస్తున్నారో, సిఎంఆర్‌ఎఫ్‌కు వచ్చే విరాళాలకు కూడా అదే వర్తింపజేయాలని సిఎం కోరారు. మేం ఏం తప్పు చేసినామో మాకు ఈ శిక్ష చాలు.. ఏప్రిల్ 30 తరువాత గండం గట్టెక్కించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. ఏ చిన్న సమూహాన్ని కూడా అనుమతించమని పటిష్ట లాక్‌డౌన్ అమలు చేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. ఉచిత బియ్యం 12 కిలోలు ఏప్రిల్ నెలకు ఇచ్చామన్నారు. వలస కార్మికులకు రూ.500 చొప్పున నగదు పంపిణీ పూర్తి చేశామన్నారు.

పప్పు శనగ కొనుగోలుకు రూ.800 కోట్లు
పప్పు శనగ పంటను కొనుగోలు చేసేందుకు రూ.800 కోట్లతో బ్యాంకు గ్యారంటీ ఇచ్చినట్లు సిఎం తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా బాగా పంటలు బాగా పండుతున్నాయన్నారు. తనకు 20, 30 మార్కెట్‌లలో పండుగ చేసుకోవాలనే ఆలోచన ఉండగా, కరోనా వల్ల వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. కొందరు ఆలస్యంగా వరి వేసుకున్నారని, అన్ని ప్రాజెక్టుల కింద పంటలకు అవసరమైన నీటిని ఈ నెల 15వ తేదీ వరకు అందిస్తామన్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖకు తగు ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు.

పరిపాలన మొత్తం కరోనాపైనే
రాష్ట్రంలో సిఎస్, డిజిపి,ముఖ్యకార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్‌పిలు, మొత్తం పరిపాలన అంతా కరోనా కట్టడి మీదనే పనిచేస్తున్నారని సిఎం చెప్పారు. కమ్యూనల్ వైరస్ కావొద్దనే ఐసోలేషన్, హోం క్వారంటైన్, కంటైన్‌మెంట్ క్లస్టర్ పెడుతున్నట్లు వివరించారు. గాంధీ మొత్తం పోలీసు నియంత్రణలోనే ఉందని, మూడు గేట్లు మాత్రమే తెరిచి ఉన్నట్లు తెలిపారు. పేషేంట్ల బంధువులను కూడా అనుమతిస్తలేమన్నారు.

 

Strictly lockdown until 30
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News