Friday, April 26, 2024

వార్నర్ సేనదే పైచేయి!

- Advertisement -
- Advertisement -

Sunrisers Second qualifier today against Delhi Capitals

 

అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న సన్‌రైజర్స్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్

అబూదాబి: ఐపిఎల్ టోర్నమెంట్‌లో భాగంగా అబూదాబి వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే పై చేయిగా కనిపిస్తోంది. గత కొన్ని మ్యాచ్‌లలో ఈ రెండుజట్ల ఆటతీరును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. టోర్నమెంట్ లీగ్ తొలి భాగంలో అంత పెద్దగా రాణించలేకపోయిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత వార్నర్ సారథ్యంలో అద్భుతంగా రాణించి నాకౌట్ దశకు చేరుకున్న విషయం తెలిసిందే. నాకౌట్‌కు చేరుకోవడానికి డిఫెండింగ్ చాంపియన్ ముంబయిపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు రాణించిన తీరు కానీ, ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని బలమైన ప్రత్యర్థుల్లో ఒకటైన బెంగళూరుపై సాధించిన ఘన విజయం దీనికి అద్దం పడుతున్నాయి.

మరో వైపు లీగ్ దశలో తొలి అర్ధ భాగం ముగిసే దాకా కూడా టైటిల్ దక్కించుకోవడానికి పోటీలో ముందు వరసలో ఉన్నట్లుగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత జరిగిన ఆరు మ్యాచ్‌లలో వరసగా ఐదింటిలో ఓడిపోయి ఒక్కసారిగా తేలిపోయింది. గతం ఎలాగున్నప్పటికీ ఆదివారం మ్యాచ్‌లో హైదరాబాద్‌పై విజయం సాధించి టైటిల్ వేటలో పోటీదారుగా నిలవాలని ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. మరో వైపు ఈ సారి కూడా టైటిల్‌ను దక్కించుకొని 2016లో సాధించిన టైటిల్‌కు మరోటి చేర్చుకోవాలని వార్నర్ ఉవ్విళ్లూరుతున్నాడు. వాస్తవానికి వార్నర్ రాబోయే రెండు మ్యాచ్‌లు గెలిస్తే టోర్నమెంట్‌లోనే తక్కువ అనుభవం కలిగిన తన జట్టు ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచిన వాడవుతాడు.

ఇక ఢిల్లీ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ వైఫల్యమే ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా తొలి మూడు స్థానాలే పెద్ద సమస్య. వీరిలో 15 గేమ్‌లు ఆడి 525 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావనే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాడు. మరో ఓపెనర్ పృథ్వీషా 12 మ్యాచ్‌లలో కేవలం 228 పరుగులే సాధించాడు. టాప్‌క్వాలిటీ బౌలర్లను ఎదుర్కొనే విషయంలో అతని టెక్నిక్ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మరో వైపు ఏడు మ్యాచ్‌లు ఆడిన అజింక్య రహానే 111 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే అతను చెప్పుకోదగ్గ స్కోరు సాధించాడు. అన్నిటికన్నా మించి ఎంతో అనుభవం ఉన్న ఈ ముగ్గురు పరుగులేమీ చేయకుండానే మొత్తం 11 సార్లు పెవిలియన్‌కు చేరుకోవడం కోచ్ రికీ పాటింగ్‌కు నిద్రలేకుండా చేస్తోంది. శిఖర్ ధావన్ నాలుగు సార్లు డకౌట్ కాగా, పృథ్వి, రహానెలు రెండేసి సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు. అయితే బౌలింగ్ విభాగం ఆ జట్టును అనేక సందర్భాల్లో ఆదుకుంటూ వచ్చింది. ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా(25 వికెట్లు) ఈ విషయంలో ముందు వరసలో ఉండగా అనిరిచ్ రిట్జి(20), రవిచంద్రన్ అశ్విన్( 13)లు కూడా బాగా రాణిస్తున్నారు.

మరో వైపు హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ గత కొన్ని మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించింది. జట్టులోని ప్రధాన ఆల్‌రౌండర్ జాసన్ హోలర్ సైతం అదే విషయాన్ని అంగీకరిస్తున్నాడు. బ్యాటింగ్‌లో మేము చక్కగా రాణిస్తున్నాం. కెప్టెన్ వార్నర్ ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తుండగా వృద్ధిమాన్ సాహా అతనికి చక్కటి తోడ్పాటు అందిస్తున్నాడు. మరో వైపు బెయిర్‌స్టో, మనీష్ పాండేలు అద్భుతంగా రాణిస్తుంటే కేన్ విలియమ్స్ ఫినిషింగ్ బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నాడు. ఒక్కరేమిటి, జట్టులోని అందరు కూడా తమ పాత్రను చక్కగా నెరవేరుస్తున్నారని అతను అభిప్రాయపడ్డాడు. బౌలర్‌గా హోల్డర్ ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా ఆరు మ్యాచ్‌లలో 13 వికెట్లు సాధించి ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. గాయం కారణంగా వృద్ధిమాన్ సాహా ముంబయితో జరిగిన తొలి ఎలిమినేషన్ మ్యాచ్‌లో ఆడలేక పోయాడు. ఆదివారం మ్యాచ్‌లో కూడా అతను ఆడడం అనుమానాస్పదమే. అయితే అతని స్థానంలో వికెట్ కీపర్‌గా వచ్చిన శ్రీవత్స్ గోస్వామిపట్ల తమకెంతో నమ్మకం ఉందని హోల్డర్ అంటున్నాడు.

ఈ టోర్నమెంట్‌లో రషీద్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నాడని టోర్నమెంట్ మొత్తలో కూడా అతను ఓవర్‌కు ఆరు పరుగులకన్నా తక్కువ ఇవ్వడం అతని చతురతకు నిదర్శనమని హోల్డర్ అభిప్రాయపడ్డాడు. ఇక కొత్త బంతితో అద్భుతంగా స్వింగ్ చేయగల సందీప్ శర్మ వార్నర్ జట్టుకు అదనపు బలంగా నిలుస్తోంది. అయితే అంతగా టి20 టోర్నమెంట్ల అనుభవంలేని ప్రియంగార్గ్, అబ్దుల్ సమద్‌లాంటి బ్యాట్స్‌మెన్‌లు చివర్లో ఆడుతుండడం జట్టుకు కాస్త బలహీనతే కానీ ఇప్పటివరకు అది అంతగా బైటపడలేదు. ఒక వేళ ఢిల్లీ క్యాపిటల్స్ గనుక ప్రారంభంలోనే వికెట్లు తీస్తే మాత్రం వీరిపై ఒత్తిడి పెరుగుతంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో డేనియల్ శామ్ బౌలర్‌గా అంతగా రాణించక పోతుండడంతో అతని స్థానంలో రేపటి మ్యాచ్‌కి హెట్‌మైర్‌ను తీసుకుని బ్యాటింగ్‌ను మరితం పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే మార్కస్ స్టోయినిస్ పూర్తి కోటా ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంది. మొత్తం మీద రెండు జట్లు కాగితంపై సమాన బలంగా కనిపించినప్పటికీ ఆట రోజున ఎవరు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారో వారిదే విజయం. ఈ విషయంలో వార్నర్ తన అనుభవానఇ్న తెలివిగా ఉపయోగిస్తే హైదరాబాద్ ఫైనల్ చేరుకోవడం కష్టమేమీ కాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News