Friday, April 26, 2024

నేతలపై కేసులు ఏళ్లూ పూళ్లూ

- Advertisement -
- Advertisement -

               Sushant Singh Rajput death case       చట్టం ముందు అందరూ ఒకటే, కొందరు మాత్రం దానికంటే ఒక మెట్టు పైనే, వారి జుట్టు దానికి అందదుగాక అందదు సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్న దేశంలోని నిన్నటి, నేటి శాసన కర్తలపై పెండింగ్‌లో గల క్రిమినల్, అవినీతి కేసుల ఉదంతాన్ని గమనించినప్పుడు ఎంత కఠినమైన చట్టమైనా కొందరికి మాత్రం చుట్టమనే సంగతి సందేహాతీతంగా బోధపడుతుంది. రాజకీయ నాయకులపై చిరకాలంగా, అపరిష్కృతంగా ఉన్న కేసులు 4462 అని సుప్రీంకోర్టుకు అందిన అధికారిక నివేదిక వెల్లడించింది. దీనిని చూసి సుప్రీం ధర్మాసనమే ఆశ్చర్యచకితురాలయింది. ఈ కేసులన్నిటిలోనూ ప్రస్తుత, పూర్వపు ఎంఎల్‌ఎలేలు, ఎంపిలే ప్రధాన నిందితులు. వీటిపై విచారణను వేగంగా పూర్తి చేసి దోషులుగా తేలినవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎన్.వి. రమణ అధ్యక్షతన గల సుప్రీం ధర్మాసనం స్వీకరించింది.

నిందితులైన చట్ట సభల సభ్యులు తమ పలుకుబడితో కేసులు ముందుకు కదలకుండా చేస్తున్నారని, దర్యాప్తుల కుత్తుకలపై వారి ఖడ్గం వ్రేళ్లాడుతున్నదని జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్య న్యాయ గమనాన్ని రాజకీయ ప్రముఖులు అడ్డుకుంటున్న తీరును ఎండగట్టింది. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నెలకొన్న ప్రత్యేక న్యాయస్థానాల్లో సైతం ఇటువంటి కేసులు గుర్రు నిద్ర తీస్తున్నట్టు తెలుస్తున్నది. పెండింగ్‌లో గల మొత్తం 4462 కేసుల్లో 2556 ప్రస్తుత ఎంపిలు, ఎంఎల్‌ఎలపై దాఖలైనవే. 356 కేసుల్లో ప్రాథమిక విచారణపై హైకోర్టులు స్టేలు మంజూరు చేశాయి. కొన్ని కేసుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది నేతలు నిందితులుగా ఉన్నారు. ఒక్కో శాసన కర్త బహుళ కేసుల్లో నిందితులైన ఉదంతాలు ఉన్నాయి. ఈ మొత్తం కేసుల్లో 40 ఏళ్ల క్రితం దాఖలైనవి ఉన్నాయంటే దర్యాప్తు స్థాయిలోనే పలుకుబడి ప్రయోగించి అవి ముందుకు సాగకుండా అడ్డుకోగలుగుతున్న రాజకీయ బలవంతుల ప్రతాపం ఎటువంటిదో తెలుస్తున్నది.

1217 పెండింగ్ కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలోనూ, 510 పైచిలుకు కేసులతో బీహార్ రెండోదిగానూ ఉన్నాయి. 1991, 1993, 1994లలో యుపిలో నమోదైన మూడు కేసులు ఇంకా ప్రాథమిక విచారణకు కూడా రాలేదంటే దర్యాప్తుల తీరు ఎలా ఉన్నదో, పోలీసు యంత్రాంగం ఎంతగా రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నదో స్పష్టపడుతున్నది. ‘ఈ వివరాలన్నీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి, పరిస్థితి తీవ్రతను రుజువు చేస్తున్నాయి’ అని ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత చేసిన వ్యాఖ్యానం గమనించదగినది. దర్యాప్తు వ్యవస్థను పీడిస్తున్న రాజకీయ ఒత్తిడుల జాడ్యం ఎంతగా ముదిరిపోయిందో వెల్లడవుతున్నది. ఈ కేసుపై ఈ నెల 10వ తేదీన విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం 16వ తేదీన దానిని కొనసాగించింది. ఈ సందర్భంలో కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ హైకోర్టుల స్టేలున్నవాటితో సహా అన్ని కేసుల విచారణను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేలా ఆదేశాలివ్వాలని నివేదించారు.

అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టు సహాయకులు సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్నాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో 12 స్పెషల్ కోర్టులు పని చేస్తున్నాయి. ఈ అన్ని రాష్ట్రాల్లోనూ పెండింగ్ కేసులు ఉన్నాయి. అందుచేత కేవలం ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటే పరిష్కారం కాకపోవచ్చు. దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టినా ఎఫ్‌ఐఆర్ (అభియోగ పత్రాలు)లు దాఖలు చేయకపోడం, సాక్షులను రప్పించి వాంగ్మూలాన్ని రికార్డు చేయకపోడం వంటి కారణాలతో విచారణలు నిలిచిపోయిన సందర్భాలున్నాయని జస్టిస్ రమణ గుర్తు చేసిన అంశమూ ప్రధానమైనదే. అందుచేత జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారులపైన కూడా అనుల్లంఘనీయమైన బాధ్యతలను ఉంచి త్వరత్వరగా దర్యాప్తు ముగిసేలా, అభియోగ పత్రాలు నమోదయ్యేలా చూడవలసి ఉంది.

అన్నింటికీ మించిన మూల సమస్య కేసుల కాళ్లు విరిచి పోగులు పెట్టగలుగుతున్న రాజకీయ ఒత్తిడి, పోలీసులకు పలుకుబడి గల శాసన కర్తలకు మధ్య ఉన్న అపవిత్ర ముడి, పోలీసు, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి వ్యవస్థలు పాలకుల ప్రభావాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించలేని స్థితి, వారి కనుపించని సంకెళ్లకు బందీలై ఉన్న దుస్థితి. న్యాయమూర్తులు సైతం రిటైర్మెంట్ తర్వాత లభించగల పదవుల మీద కన్నుతో పాలకులకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలున్నాయనే అనుమానాలకూ కొదువ లేదు. సుప్రీంకోర్టు చొరవ తీసుకొని ఈ కేసులన్నింటినీ త్వరగా ముగింపుకి తెచ్చేలా చర్యలు తీసుకున్నా దర్యాప్తు స్థాయిలో పోలీసులు నిజాయితీతో వ్యవహరించకపోతే ప్రాసిక్యూషన్ బలహీనమై అసలు దోషులు శిక్షల నుంచి సునాయాసంగా తప్పించుకునే ప్రమాదమూ ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News