Monday, April 29, 2024

మూడు కొత్త చట్టాలతో నవశకంలోకి వ్యవస్థలు

- Advertisement -
- Advertisement -

సాధికార న్యాయవ్యవస్థ వికసిత్ భారత్‌లో భాగం
సుప్రీంకోర్టు వజ్రోత్సవాల్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
న్యాయ వ్యవస్థకు వాయిదాల సమస్య : సిజెఐ చంద్రచూడ్

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చట్టాలను ఆధునికీకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వెల్లడించారు. ఆ చట్టాలు రేపటి భారతానికి మరింత బలం చేకూరుస్తాయని ప్రధాని ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, మూడు కొత్త క్రిమినల్ న్యాయ చట్టాల  ఆమోదంతో భారత్ న్యాయ, పోలీసింగ్, నేరపరిశోధన వ్యవస్థలు నవ శకంలోకి అడుగు పెట్టాయని చెప్పారు. ‘వందల ఏళ్ల నాటి చట్టాల నుంచి కొత్త చట్టాల అమలులోకి మారడం ముఖ్యం. ఈ విషయంలో మేము ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ, సత్తా పెంపు పనిని ఇప్పటికే ప్రారంభించాం’ అని మోడీ తెలియజేశారు. ఇతర భాగస్వామ్య వర్గాల శక్తి పెంపు దిశగా కృషి చేయవలసిందిగా సుప్రీం కోర్టుకు మోడీ విజ్ఞప్తి చేశారు. ‘సాధికార న్యాయ వ్యవస్థ ‘వికసిత్ భారత్’లో భాగం. విశ్వసనీయ న్యాయ వ్యవస్థ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం నిరంతరం పని చేస్తోంది. పలు నిర్ణయాలు తీసుకుంటున్నది. జన్ విశ్వాస్ బిల్లు ఆ దిశగా వేసిన ఒక అడుగు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థపై అనవసర భారాన్ని ఇది తగ్గిస్తుంది’ అని ప్రధాని చెప్పారు. మధ్యవర్తిత్వంపై చట్టం వల్ల కోర్టులపై భారం తగ్గుతుందని, ఆ చట్టం ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగం మెరుగుదలకు దోహదం చేస్తుందని ఆయన సూచించారు.

భారత్ ప్రజాస్వామ్యాన్ని సుప్రీం కోర్టు మరింత పటిష్ఠం చేసిందని, వ్యక్తిగత హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ముఖ్యమైన పలు తీర్పులు ఇచ్చిందని, అవి దేశ సామాజిక, రాజకీయ వ్యవస్థకు కొత్త దిశ ఇచ్చాయని మోడీ తెలిపారు. ‘ప్రస్తుత భారత ఆర్థిక విధానాలు రేపటి శ్రేష్ఠ భారతానికి ఆధారం అవుతాయి. భారత్‌లో ఇప్పుడు చేస్తున్న చట్టాలు రేపటి మెరుగైన భారతాన్ని మరింత దృఢతరం చేస్తాయి’ అని ప్రధాని చెప్పారు. ‘ఇప్పుడు చేసిన చట్టాలు భారత్ భవిష్యత్తును మెరుగుపరుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మార్పులతో ప్రపంచం దృష్టి భారత్‌పై కేంద్రీకరించాయి. ప్రపంచ నమ్మకమే భారత్‌లో మరింత పటిష్ఠంగా మారుతోంది. ఇటువంటి సమయాల్లో తనకు లభించే ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవడం భారత్‌కు ప్రధానం’ అని మోడీ చెప్పారు. సుప్రీం కోర్టు భవనం విస్తరణ నిమిత్తం రూ. 800 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం క్రితం వారం ఆమోదించిందని కూడా మోడీ తెలియజేశారు. సర్వోన్నత న్యాయస్థానం విస్తరణను సవాల్ చేస్తూ ఏ ఒక్కరూ పిటిషన్ దాఖలు చేయబోరని మోడీ చమత్కార స్వరంతో ఆశాభావం వెలిబుచ్చారు. పార్లమెంట్ కొత్త భవనం ప్రాజెక్ట్‌ను కోర్టుల్లో సవాల్ చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

న్యాయవ్యవస్థకు వాయిదాల సమస్య : సిజెఐ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ ఈ సభలో ప్రసంగిస్తూ, ఇప్పటి పరిస్థితుల్లో ఒక సంస్థగా తన అస్థిత్వాన్ని కొనసాగించగలిగే న్యాయవ్యవస్థ సామర్థానికి సవాళ్లను గుర్తించగలగడం, ‘సంక్లిష్ఠ సంభాషణలు’ ప్రారంభించడం అవసరమని సూచించారు. ఆయన ‘వాయిదా సంస్కృతి’, సుదీర్ఘ సెలవులు వంటి సమస్యలను కూడా ప్రస్తావించారు. బడుగు, పీడిత వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచడం, తొలి తరం న్యాయవాదులకు సమాన అవకాశాలు కల్పించడం అవసరమని కూడా సిజెఐ ఉద్ఘాటించారు. భారత్‌లో జనాభాపరంగా జరుగుతున్న మార్పుల గురించి కూడా సిజెఐ మాట్లాడారు. సాధారణంగా న్యాయవాద వృత్తిలో బాగా తక్కువగా ప్రాతినిధ్యం ఉన్న మహిళలు ఇప్పుడు జిల్లా న్యాయవ్యవస్థలోని న్యాయవాదుల సంఖ్యలో 36.3 శాతం మేర ఉన్నారని తెలియజేశారు. న్యాయవాద వృత్తిలో జనాభాలోని విభిన్న వర్గాలకు భాగస్వామ్యం కల్పన అవసరమని సిజెఐ చంద్రచూడ్ పిలుపు ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌టిల ప్రాతినిధ్యం ‘బార్‌లోను, బెంచ్‌లోను చాలా తక్కువగా ఉంది’ అని ఆయన గుర్తు చేశారు. నారీ శక్తి గురించి ఆయన ప్రస్తావిస్తూ, భారత్‌లో ముఖ్యమైన స్థానాలలో మహిళలను ఇప్పుడు చూడవచ్చునని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News