Wednesday, May 1, 2024

అమ్మకాలు ఎక్కువగా ఉన్నచోటే కొత్త మద్యం షాపులు!

- Advertisement -
- Advertisement -
telangana excise policy 2020-21
పాత లైసెన్స్ ఫీజు, దరఖాస్తు రుసుములనే వర్తింపజేయాలని నిర్ణయం
ఎస్‌సి, ఎస్‌టి, గౌడలకు రిజర్వేషన్లు
ఎక్సైజ్ పాలసీ జిఒ జారీ

మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నచోటే కొత్త దుకాణాలకు అనుమతి ఇవ్వాలని, అందులో భాగంగా ఈసారి 350 మద్యం షాపులను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. కొత్త ఎక్సైజ్ విధానంతో పాటు కొత్త మద్యం షాపుల ఏర్పాటు తదితర విషయాలపై అన్ని జిల్లాల ఎక్సైజ్‌శాఖ అధికారులతో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమీక్ష నిర్వహించారు. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ అధికారులకు కమిషనర్ పలు విషయాలను వెల్లడించారు. 2021,-23 సంవత్సరానికి సంబంధించిన లీజు కాలానికి రిటైల్ మద్యం దుకాణాలకు సంబంధించి విధి, విధానాలపై అధికారులతో ఆయన చర్చించారు. దీనికి సంబంధించిన జిఒ 98లో ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సిఎస్ సోమేశ్‌కుమార్ జారీ చేశారు.

మార్గదర్శకాలు ఇలా….

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉండగా వాటికి అదనంగా మరో 350కిపైగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దుకాణాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడలకు 15 శాతం కేటాయింపులు చేయనున్నారు. గతంలో ఒక వ్యక్తి ఒక దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉండగా, ఈ కొత్త విధానంలో ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా వేసుకోవచ్చు. దీంతోపాటు లైసెన్సు ఫీజు, దరఖాస్తు రుసుముల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. దరఖాస్తు రుసుము గతంలో ఉన్న నాన్ రిఫండబుల్ ఫీజు రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఎక్సైజ్ టాక్స్‌లకు సంబంధించి స్లాబ్‌ల్లో ఎటువంటి మార్పు చేయలేదు. లైసెన్స్ దారులు ఇదివరకు వార్షిక ఎక్సైజ్ టాక్స్‌ను నాలుగు వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా రానున్న లీజు కాలానికి ఆరు వాయిదాల్లో చెల్లించే సౌలభ్యం కల్పించారు.

ఒకరి పేరుతో ఎన్ని దరఖాస్తులు అయినా….

లైసెన్స్ పొందడానికి ముందు సమర్పించవలసిన బ్యాంకు గ్యారెంటీ ఇదివరకు నాలుగు వాయిదాల పద్ధతిలో రెండు వాయిదాల కొరకై ఇవ్వవలసి ఉండేది. ప్రస్తుతం రాబోయే లీజు కాలానికి సమర్పించవలసిన బ్యాంకు గ్యారెంటీ వార్షిక ఎక్సైజ్ టాక్స్ లో కేవలం 25 శాతానికి మాత్రమే 25 నెలల కాలపరిమితితో ఇవ్సాల్సి ఉంటుంది. దుకాణదారుడుకి వచ్చే లాభాల వాటా అతని వార్షిక టర్నోవరు వార్షిక ఎక్సైజ్ టాక్స్ కంటే 7 రెట్లు దాటగానే తగ్గి కేవలం 6.4 శాతం గా ఉండేది. కాగా రాబోయే లీజు కాలానికి వార్షిక టర్నోవర్ పరిమితిని వార్షిక షాపు ఎక్సైజ్ టాక్స్ యొక్క ఏడు రెట్లకు బదులుగా పది రెట్లుగా నిర్ధారించారు. ఆయా దుకాణదారులు వారి నిర్ధారిత వార్షిక ఎక్సైజ్ టాక్స్ కంటే పది రెట్లు టర్నోవర్ చేసేంత వరకు కూడా వారికి లభించే లాభాల పూర్తి మార్జిన్‌ను పొందగలిగే వెసులుబాటు కల్పించనున్నారు. దుకాణాన్ని పొందగోరే ఆసక్తి దారులు ఒక దుకాణానికి వారు కోరుకుంటే వారి పేరుతోనే ఎన్ని దరఖాస్తులనైనా చేసుకోవచ్చు. ప్రతి దరఖాస్తుకు కేటాయించబడే ఎంట్రీ పాస్ నెంబర్‌ను లాటరీలో కచ్చితంగా ఉంచనున్నారు. తద్వారా, వారికి ఆయా దుకాణాలు దక్కే అవకాశాలు బాగా మెరుగుకానున్నాయి.

ఈ దఫా మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూం

మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూంతో పాటు సోడా, వాటర్ బాటిల్, గ్లాసులు, తినుబండరాలు వంటి వాటికి కొత్తగా అనుమతులను జారీ చేశారు. వాక్ ఇన్ స్టోర్ పేరిట ఈ పర్మిట్ రూమ్‌లకు అనుమతించినట్టు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. దీనికి గాను రెండేళ్ల కాలానికి రూ.5లక్షలు పర్మిట్‌రూంకు రుసుం కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మద్యం దుకాణంలో జరిగే క్రయ, విక్రయాలపై పారదర్శకత కోసం ఆధునిక ఎక్విప్‌మెంట్‌లను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మద్యం దుకాణం యజమాని మూడు సిసి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఈ కెమెరాల ఫుటేజీలను కంట్రోల్‌రూమ్‌లకు అనుసంధానం చేయాలని ఆ నిబంధనలో ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఎవరూ ముందుకు రాకుండా మిగిలిపోయిన మద్యం దుకాణాలను నోటిఫై చేసి వాటిని తెలంగాణ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఔట్‌లెట్లను ఏర్పాటు చేసి నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ ఆ జిఓలో పేర్కొంది.

రిజర్వేషన్ల బాధ్యత జిల్లా కలెక్టర్‌లదే…

మద్యం తాగడంతో కలిగే దుష్ప్రరిమాణాలపై ప్రచారం నిర్వహించాలని మద్యానికి బానిసైన వారిని దాని నుంచి బయటపడేందుకు డి ఎడిక్షన్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ చర్యలు తీసుకోవాలని ఈ జిఓలో సూచించింది. ప్రభుత్వం నిర్ధేశించిన కులాలకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత జిల్లా కలెక్టర్‌లకు అప్పగించారు. జిల్లాల వారీగా జనాభా ప్రాతిపదికన కలెక్టర్లు నోటిఫై చేసి ఆయా దుకాణాలకు ఆయా వర్గాలే దరఖాస్తు చేసేలా కార్యాచరణ ప్రకటించనున్నారు.

జిహెచ్‌ఎంసి పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటలు

గతేడాది పాలసీలో లెవీగా ఎక్సైజ్ ట్యాక్స్‌ను రూ.5లక్షలకు విధించారు. ఏడాదికి ప్రతి దుకాణం లైసెన్స్ నుంచి ఈ ఫీజును అదనంగా వసూలు చేస్తుండగా ఈ ఏడాదిలో దీనిని అలాగే కొనసాగిస్తున్నారు. ఇక వ్యాపారుల లాభంగా పేర్కొనే మార్జిన్‌ను ఆర్డీనరీ మద్యంపై 27 శాతం, మీడియ, ప్రీమియం మద్యంపై 20 శాతం, బీర్లపై 20 శాతం ఉండగా దీనిని కూడా అదేవిధంగా కొనసాగిస్తున్నారు. మద్యం దుకాణాల వేళలలను జిహెచ్‌ఎంసి పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.

లైసెన్స్ ఫీజులు జనాభా వారీగా

జనాభా రుసుము (లక్షల్లో)
5000ల లోపు రూ.50 లక్షలు
5001 నుంచి 50 వేల వరకు రూ.55 లక్షలు
50,0001 నుంచి లక్ష వరకు రూ.60 లక్షలు
1,00,001 నుంచి 5 లక్షల వరకు రూ.65 లక్షలు
5 లక్షల నుంచి 20 లక్షల వరకు రూ.85 లక్షలు
20 లక్షలకు పైబడిన జనాభాకు కోటి 10 లక్షల రూపాయలు
మద్యం షాపు టెండర్‌లకు 16 చివరితేదీ ?
అయితే ఈ మద్యం షాపులకు టెండర్‌ల నిమిత్తం దరఖాస్తులను ఈనెల 09వ తేదీన ఆహ్వానిస్తుండగా, దరఖాస్తులకు చివరితేదీగా 16వ తేదీని, డ్రా తేదీ 18వ తేదీని, లైసెన్స్ ఇష్యూ తేదీని 20వ తేదీని నిర్ణయించినట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News