Saturday, April 27, 2024

రాష్ట్రంలో రెడ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

Telangana red alert till July 10

రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
రాష్ట్రవాప్తంగా కనిష్టంగా 7 సెం.మీలు, గరిష్టంగా 20 సెం.మీలు….
గ్రేటర్ హైదరాబాద్‌లో తక్కువ సమయంలోనే 7 సెంమీల మేర నమోదయ్యే అవకాశం
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల,
ములుగు, కొత్తగూడెం, వరంగల్ రూరల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్షం ముప్పు
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూలై 10వ తేదీ వరకు రాష్ట్రానికి ‘రెడ్’ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ‘రెడ్’ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల పాటు కనిష్టంగా 7 సెం.మీ. నుంచి గరిష్టంగా 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో తక్కువ సమయంలోనే 7 సెంమీల మేర వర్షం కురవొచ్చని ఆమె పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో వాయువ్య దిశగా ఏర్పడిన వాయుగుండం నైరుతి దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని ఆమె వివరించారు. దీని కారణంగానే తెలంగాణలో ఉత్తర, తూర్పు భాగాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు రానున్న రెండు రోజుల్లో కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు శనివారం ఉదయం వరకు కురుస్తాయని, అనంతరం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, వరంగల్ రూరల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ జిల్లాలకు ఆదివారం ఉదయం వరకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ వరకు ఆరెంజ్, ఎల్లో వార్నింగ్‌లు కొనసాగుతాయని ఆమె తెలిపారు.

బుధవారం నుంచి పలు జిల్లాలో వానలు…
బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాలో వానలు పడుతూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా నల్లగొండ జిల్లా అంతటా విస్తారంగా వర్షం కురుస్తుండడంతో పట్టణంలోని పానల్ బైపాస్ రోడ్డుపై భారీగా వరద నీరు పారుతుండగా పలు మండలాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం వరకు నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో అత్యధికంగా 93.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కేతెపల్లిలో 76.9, కట్టంగూరులో 76.4, శాలిగౌరారంలో 74, నల్లగొండలో 71.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం రికార్డయింది. ఖమ్మంలో 70, మహబూబాబాద్ 67, సూర్యాపేటలో 65, భద్రాద్రి కొత్తగూడెం 64, వనపర్తి 51, సూర్యాపేటలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ రెండు రోజులగా భారీ వర్షం నమోదవుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తోన్న వర్షంతో భూపాలపల్లి కాకతీయ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షం కారణంగా సుమారు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు అధికారులు తెలిపారు. ఇల్లందులోని సింగరేణి జెకే5 ఓసిలో (ఓబి -ఓవర్ బర్డెన్) 6 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. టేకులపల్లి మండలం కోయగూడెం సింగరేణి ఓసి గనుల్లో సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని సింగరేణి అధికారులు తెలిపారు. మరోవైపు ఇల్లందు పట్టణంలోని అతిపెద్ద ఇల్లందులపాడు చెరువు అలుగు ప్రవహిస్తోంది.

యాదాద్రి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాలో…
రెండు రోజుల పాటు యాదాద్రి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం నగరంలోని బంజారాహిల్స్, అమీర్‌పేట్, నాంపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బిఎన్‌రెడ్డి నగర్, పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపునకు వంగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి వేర్వేరుగా విస్తరించాయి. అలాగే గుజరాత్ నుంచి ఒడిశాలోని గోపాల్‌పూర్ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News