Sunday, April 28, 2024

కరోనా ఎఫెక్ట్: కౌలాలంపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ఊరట

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను ఢిల్లీ, విశాఖపట్నాలకు చేరవేయాలంటూ బుధవారం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఏషియా షటిల్స్ కు అనుమతిచ్చింది. దీంతో కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులోని భారత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా భయంతో పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను కేంద్రం(రద్దు) నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో 350 మంది భారతీయ విద్యార్థులు కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టుల్లో దాదాపు 30 గంటల పాటు చిక్కుకుపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన వారిలో అత్యధికులు హైదరాబాద్, వరంగల్‌ జిల్లాలకు చెందిన విద్యార్థులున్నారు. వీళ్లంతా దాదాపు అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టులొనే వేచి ఉండాల్సి వచ్చింది.

కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని పలు యూనివర్సిటీలు, కాలేజీలు 2 నెలపాటు సెలవులు ప్రకటించడంతో పాటు ఆయా విద్యార్థులు 72గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించాయి.దీంతో వందల మంది విద్యార్థులు మనీలా విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా మలేసియాలోని కౌలాలంపూర్‌ మీదుగా భారత్‌కు రావాల్సి ఉండగా వారిలో కొందరు కౌలాలంపూర్‌లో, మనీలాలోని ఎయిర్‌పోర్ట్‌లలో నిలిచిపోయారు. కౌలాలంపూర్‌లో 150 మంది, మనీలాలో 60 మంది చిక్కుకుపోవడంతో అటు విద్యార్థులు, ఇటువ వారి తల్లిదండ్రులు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థుల ఇక్కట్లపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చాలంటూ ఎయిర్ ఏషియా షటిల్స్ కు అనుమతిచ్చింది. దీంతో విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టుల నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని, అందుకు సదరు విద్యార్థులు సైతం సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌లలోని స్క్రీనింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు.

Telugu Students stuck at Kuala Lumpur Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News