Monday, April 29, 2024

త్వరలోనే టిజిఓ, టిఎన్జీఓ సంఘం ఎన్నికలు!

- Advertisement -
- Advertisement -

ఏకగ్రీవం కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఉద్యోగుల డిమాండ్
ఈ రెండు సంఘాల నుంచి పోటీ చేయడానికి పలువురు ఆశావహుల ఆసక్తి

మనతెలంగాణ/హైదరాబాద్:  టిజిఓ, టిఎన్జీఓ సంఘంలో యూనియన్ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ రెండు సంఘాల్లోనూ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మొత్తం కార్యవర్గాన్ని నూతనంగా బ్యాలెట్ ద్వారా (ఎన్నికలను నిర్వహించి) నాయకులను ఎన్నుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. టిజిఓ సంఘం అధ్యక్షురాలిగా మమత 5 సంవత్సరాలుగా కొనసాగుతుండగా టిఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీ ఉంది. అయితే తెలంగాణలో ఈ రెండు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంలో కీలకం. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ రెండు సంఘాలను ఆశ్రయిస్తుంటారు.

మొదటగా టిజిఓ సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2017 నుంచి టిజిఓ సంఘానికి (గెజిటెడ్ అధికారుల సంఘానికి) అధ్యక్షురాలి మమత కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం 5 సంవత్సరాలుగా ఈ సంఘానికి ఎన్నికలు లేకుండా మమతనే అధ్యక్షురాలిగా కొనసాగుతుండడంతో మిగతా ఉద్యోగులు ఈసారైనా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఈసారి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవితో పాటు మిగతా కార్యవర్గాన్ని బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని గెజిటెడ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉద్యోగులు తాము పోటీలో నిలిచి గెలవాలన్న ఉత్సాహంతో ఈ ఎన్నికల నిర్వహణ కోసం పట్టుబడుతున్నట్టుగా తెలిసింది. అయితే టిజిఓ ఎన్నికల కోసం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పోటీ చేయడానికి పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పోటీ పడుతున్నట్టుగా సమాచారం.

వచ్చేనెల 03వ తేదీన టిఎన్జీఓ సంఘం కోర్టు కేసు
ఇదిలా ఉండగా టిఎన్జీఓ సంఘంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేయడం విశేషం. ఇప్పటికే టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం, తానే ఈ సంఘానికి అధ్యక్షుడినంటూ టిఎన్జీఓ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ సంఘం ఎన్నికలు నిర్వహించవద్దని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎన్నికలు జరిగితే కచ్చితంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నాన్ గెజిటెడ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తుండడం విశేషం. అయితే ఈ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం పలువురు టిఎన్జీఓ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు గతంలో టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేసిన రాయకంటి ప్రతాప్, ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా టిఎన్జీఓ అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ, మారం జగదీశ్వర్‌లు టిఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శి పదవుల కోసం పోటీపడుతున్నారు. వచ్చేనెల 03వ తేదీన కోర్టు కేసు ఉండడం అనంతరం ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో తమ పట్టునిలుపుకోవాలని పలువురు ఆశావహులు తమవంతు ప్రయత్నాలను మొదలుపెట్టారు.

కొత్త ప్రభుత్వంలో కొత్త నాయకత్వం అవసరం…
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ సభ్యులు డిమాండ్ చేస్తుండడం విశేషం. ఇప్పుడున్న కమిటీతో ముందుకు సాగలేమని కొత్త కమిటీని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు నొక్కి చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన వారు స్వలాభం చూసుకున్నారని ఫలితంగా ఉద్యోగులు చాలా నష్టపోయారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో కొత్త నాయకత్వం అవసరమని మెజార్టీ సభ్యులు వాదిస్తుండగా ఇందుకు సంబంధించి రహస్య సమావేశాలు కూడా నిర్వహించడం గమనార్హం. అయితే ఈ రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక పాత కమిటీలనే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News