Wednesday, May 1, 2024

రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిన గవర్నర్ ప్రసంగం

- Advertisement -
- Advertisement -

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 హామీ మరిచారు
ప్రజావాణిపై ఆర్భాటంగా ప్రకటనలు చేసి పరువుతీసుకున్నారు: బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో కలిసి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఎప్పటి నుంచి ఇస్తారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదన్నారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయమై ఒక్క మాటా లేదన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేలు ఇచ్చే విషయం ప్రస్తావించలేదన్నారు. గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ గురించి మాత్రమే చెప్పారని, కానీ మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, గవర్నర్ ప్రతిష్ట దిగజార్చిందని, ప్రజావాణి పరువు తీసిందని విమర్శించారు. ప్రజావాణిలో రోజూ సిఎం స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని ఆర్భాటంగా ప్రకటించి మొదటి రోజు తరువాత సిఎం మొహం చాటేశారని ఎద్దేవా చేశారు. ప్రజావాణికి రోజుకొక మంత్రి వెళ్తారని చెప్పారని, అదీ లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పారు. బిఆర్‌ఎస్ పాలనలో కలెక్టర్లు దరఖాస్తులు తీసుకునేవారని, ప్రజావాణి గురించి గర్నవర్‌తో అర్థసత్యాలు చెప్పించారన్నారు.

ఆరు గ్యారంటీల్లో 13 హామీలున్నాయని, మహాలక్ష్మి పథకంలో మూడు చెప్పి ఒక గ్యారంటీ అమలుచేశామని చెబుతారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అమలు లోపభూయిష్టంగా ఉన్నందునే గవర్నర్ ప్రసంగంలో చెప్పించలేదన్నారు. నిర్దిష్ట సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీలు అమలు చేయడం లేదని చెప్పారు. డిసెంబర్ 9న అధికారంలోకి వస్తాం, రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. అయితే ప్రమాణ స్వీకారాన్ని ముందుకు జరిపి హామీల అమలును వాయిదా వేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. వంద రోజుల్లో 60 రోజులు పూర్తయ్యాయని, ఇంకా 40 రోజులే మిగిలి ఉన్నాయని గుర్తుచేశారు. మరో పది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని అప్పటివరకు సాగదీసి హామీల అమలు వాయిదా వేయాలని ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు. చిత్తశుద్ది ఉంటే హామీల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో ఉండేదన్నారు.

రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు కరెంట్ గురించి మాత్రమే ప్రస్తావించారని, మిగతా హామీలు వచ్చే ఏడాదిలో చేయలేమని  చెప్పకనే చెప్పారని వెల్లడించారు. వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులెత్తేశారని విమర్శించారు. రూ.15 వేల రైతుభరోసా ఇస్తామన్నారు, 10 వేల రైతుబంధు కూడా ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వచ్చే యాసంగి పంటకు అయినా బోనస్ ఇస్తామని చెబుతారని ఎదురు చూస్తే నిరాశ ఎదురైందన్నారు. రూ. 40 వేల కోట్ల పెట్టుబడిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఊసేలేదని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళన బిఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తారన్నారు.. కానీ 7వ తేదీ వచ్చినా జీతాలు పడలేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని రెండు, మూడు నెలల నుంచి వారికి జీతాలు ఇవ్వడంలేదని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News