Sunday, May 5, 2024

వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్

- Advertisement -
- Advertisement -

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతాం
గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణ జరుపుతున్నాం
తప్పు చేసిన వారంతా జైలుకే….
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి:  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని ఫిబ్రవరి నుంచి అమలు చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేయడం వల్లే హామీల అమలు ఆలస్యం అవుతుందన్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సహా భారత రాష్ట్ర సమితి నేతలు చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారు జైలుకెళ్లటం ఖాయమని ఆయన హెచ్చరించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని స్పష్టం చేశారు.  గాంధీభవన్‌లో మంగళవారం మేనిఫెస్టో కమిటీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీపాదాస్ మున్షీ, ఏఐసిసి ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీ ఖాన్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మేనిఫెస్టో కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. హామీల అమలుపై కమిటీ సమీక్ష చేసిన తర్వాత మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబులు మాట్లాడారు.
కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ
ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో తాము చెప్పినట్లుగానే 100 రోజుల్లో అమలు చేసి తీరతామని ఆయన పునరుద్ఘాటించారు. నిరుద్యోగ భృతి మొదలుకుని, డబుల్ బెడ్ రూంల వరకు అన్ని హామీలను బిఆర్‌ఎస్ నేతలు విస్మరించారని ఆయన విమర్శించారు. ఆ పార్టీ నేతల మాదిరిగా తాము ప్రజలను రెచ్చగొడితే, ఫామ్‌హౌస్ దాటకపోయే వారని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందన్నారు. హామీల అమలుపై సమీక్ష చేశామని ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు.
ప్రతిపక్షాలవి తొందరపాటు విమర్శలు: మంత్రి శ్రీధర్‌ బాబు
మరోవైపు రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రతిపక్షం తొందరపాటు విమర్శలు చేస్తోందని మరో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆక్షేపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామన్నారు. రాష్ట్రంలో అన్నింటి కంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగామన్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చామని అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రెండో రోజు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీలో పది లక్షల ఆరోగ్య పథకాన్ని అందించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసాన్ని చూపారన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఏఐసిసి మేనిఫెస్టోకు టి-కాంగ్రెస్ సాయం తీసుకుంటాం: చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి
ఏఐసిసి మేనిఫెస్టోకు టి-కాంగ్రెస్ సాయం తీసుకుంటామని ఏఐసిసి ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విధంగా ఉండాలని ఆయన తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టోను అందించారన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని ఆయన తెలిపారు. ఏఐసిసి మేనిఫెస్టోకు మాజీ కేంద్రమంత్రి చిదంబరం నేతృత్వంలో జరుగుతుందన్నారు. మేనిఫెస్టో పబ్లిక్ ప్రెండ్లీగా, క్రోని క్యాపిటల్‌కు దూరంగా, ప్రజావసరాలకు దగ్గరగా ఉండాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News