Friday, April 26, 2024

కరోనా కొత్త వ్యాప్తి: వ్యాక్సిన్ల పాత్ర

- Advertisement -
- Advertisement -

The role of Vaccines in Corona control

 

కొవిడ్-19 మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే వుంది. 200 దేశాలలో, సుమారు 19.40 కోట్ల కేసు లు, 40 లక్షల మరణాలతో మానవాళికి మహావిపత్తుగా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికీ ఇండియా, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ వంటి ఆసియా దేశాలు, జింబాబ్వే, కాంగో, లిబియా వంటి ఆఫ్రికా దేశాలు, బ్రెజిల్, గౌతమాల, క్యూబా వంటి లాటిన్ అమెరికన్ దేశాలు, అనేక యూరప్ దేశాలు కరొన కోరలలో చిక్కుకునే వున్నాయి. అయితే ఒక ఏడాదిన్నర పైగా గడిచిన తరువాత, ప్రపంచ వ్యాప్తంగా ఒక రకం సాధారణ స్థితి కూడా కొన్నిచోట్ల నెలకొంటోంది. మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి స్థితిలో వివిధ స్థాయిలలో వ్యత్యాసాలు వున్నాయి.

అనేక అభివృద్ధి చెందిన దేశాలలో సామూహిక వ్యాక్సినేషన్లు అమలు చేయబడ్డాయి, స్థానికంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను జనాభా ఎక్కువగా స్వీకరించింది. అనేక ప్రాంతాలు సామాజిక దూరం, ప్రయాణ పరిమితులు సడలించడం ప్రారంభించాయి. చాలా మంది ప్రజలు మహమ్మారికి ముందు గడిపిన విధంగా జీవితాన్నితిరిగి ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. ఏదేమైనా, ఈ ఆశావహ చిత్రం ప్రపంచమంతా ఒక్కలాగా లేదు. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఇక్కడ వ్యాక్సిన్ కొరత ప్రబలంగా ఉంది. కొవిడ్- 19 అనేక ప్రతికూల పరిణామాలు అంతం కాలేదు. అనారోగ్యం, కొవిడ్ సంబంధిత మరణాలు, ఆరోగ్య వ్యవస్థలపై మోయలేని భారం, ఆర్థిక వ్యవస్థలలో గణనీయమైన క్షీణత, అలాగే మానసిక ఆరోగ్యం పై, జనాభా మొత్తం శ్రేయస్సు పై చీకటి నీడలు కొనసాగుతూనే న్నాయి.

ఈ మహమ్మారి అంతటా, కొట్టవచ్చేట్టు కానవచ్చే అంశం- అభివృద్ధి చెందిన దేశాలు తమ స్వంత పౌరులను రక్షించుకోవడం పేర అనుసరిస్తున్న జాతీయవాదం. ఇతర దేశాలను పట్టించుకోకుండా తమకు ఆర్ధికంగా ఉపయోగపడే అనేక రక్షణాత్మక చర్యలు తీసుకుంటూ, తమ కార్పొరేటు గుత్త సంస్థల కొమ్ము గాస్తూ, విపత్కర స్థితిలో వున్న అనేక పేద, మధ్యతరగతి ఆదాయాలు గల దేశాలను ఆర్ధిక ఇబ్బందులకు గురిచేయటం ఒక సాధారణ ఇతివృత్తంగా కనిపిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలకు మానవాళి ఎదుర్కొంటున్న ఈ విషమ స్థితిగతులను పరిష్కరించవలసిన బాధ్యత చాలా ఎక్కువగా వున్నది, కానీ అవి ఆ బాధ్యతను నెరవేర్చటం లేదు. బలమైన ఆర్ధిక శక్తిగా వున్న చైనా మొదటి నుంచీ ఇది మొత్తం మానవాళి సంయుక్తంగా ఎదుర్కొని పరిష్కరించవలసిన సమస్య అని చెబుతూ వస్తున్నది.

ఉమ్మడి కార్యాచరణకు పిలుపు నిచ్చింది. కానీ ఆశాస్త్రీయమైన,రాజకీయ ప్రేరేపితమైన నిందలు మోపుతూ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు చైనాను కరోనా ఉత్పత్తిదారు అని నిందిస్తూ దానిని ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కరోనా నియంత్రణలో వారి అనుభవాలను, సాంకేతికతను పెద్దగా పట్టించుకోవటం లేదు. శత్రుపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఈ మహమ్మారిలో, అనేక దేశాలు వైద్యపర రక్షణ వాదం కూడా అనుసరించాయి. వారు తమ స్వంత పౌరుల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలు, వెంటిలేటర్ల వంటి సాధనాలను దాచి ఉంచడానికి ప్రయత్నించారు. వారి అవసరాలకు మించిన సాధనాలు, పరికరాలు, వ్యాక్సిన్లు పోగు పోసుకుని వుంచుకున్నారు. తక్షణమే వాటి అవసరం వున్న ఇతర దేశాల దుస్థితిని విస్మరించారు. వాస్తవానికి, అభివృద్ధి చెందిన,- అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వనరుల అసమాన పంపిణీ ఎంతోకాలంగా వున్న పాత సవాలే. ఈ పాండమిక్ పరిస్థితిలో దాని భయంకర స్వరూపం నగ్నంగా బయట పడింది. ఇది చరిత్రాత్మకంగా స్థిరమైన, దీర్ఘకాలిక పరిష్కారం నోచుకోక నిర్లక్ష్యం చేయబడింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే, అభివృద్ధి చెందిన దేశాలకు, వారి అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదటి నుంచీ వున్నదే. అయితే మహమ్మారి సమయంలో ఈ సమస్య ప్రధానంగా ముందుకు వచ్చింది. ప్రపంచంలో ఏ మూల కరోనా ఉనికి కొనసాగుతున్నా- ప్రపంచం మొత్తానికీ ముప్పు పొంచివున్నట్లే లెక్క. మహమ్మారిని అంతం చేయడానికి ప్రపంచంలో వున్నఈ వివక్ష స్వభావమే అడ్డుగా నిలిచి వున్నదని చెప్పక తప్పదు. వ్యాధి వ్యాప్తిని అరికట్టలేక పోవటానికి అదీ ఒక కారణమని చెప్పవచ్చు.

కొత్త సార్స్ కొవిడ్- 2 వేరియెంట్ల ఉత్పరివర్తనాలకు ఎలాంటి భౌగోళిక సరిహద్దులు, హద్దులు కావు. అనియంత్రిత అంతర్జాతీయ ప్రయాణాలతో – ఎక్కడైనా కేసుల్లో పెరుగుదల వుంటే, అది ప్రతిచోటా వరుస తరంగాలకు దారితీస్తుంది. టీకాలు తీసుకున్నవారు, టీకాలు తీసుకోని జనాభా మధ్య తిరుగుతూ వుంటే, (అంతర్జాతీయ ప్రయాణాలలో ఈ అవకాశం ఎక్కువ) కొత్త ఉత్పరివర్తనాలు ఉద్భవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత వ్యాక్సిన్లు కొత్త వేరియెంట్‌లకు వ్యతిరేకంగా పూర్తి సమర్థతతో పని చేయకపోవచ్చు. అందువల్ల అభివృద్ధి చెంది న దేశాలకు వ్యాక్సిన్లను నిల్వ చేసి వుంచటం వల్ల అంత ప్రయోజనం నెరవేరదు. ఈ నూతన వేరియంట్ల వల్ల నిలవ వున్న వ్యాక్సిన్లు త్వరగా సొమ్ము చేసుకోవాల్సి వచ్చింది.

ప్రపంచ వ్యాక్సిన్ పంపిణీ, మహమ్మారిని నిర్మూలించ గల వేగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మరింతగా గుర్తించి, నాయకులు మరింత సమానమైన, న్యాయబద్ధమైన విధానాలను అమలు చేయడానికి ప్రయత్నించాలి. సాధారణ ప్రజలు కొవిడ్- 19 కు గురయ్యే అవకాశాలను పరిమితం చేయడానికి వివిధ నివారణ చర్యలను కొనసాగించడం ప్రాముఖ్యతను కూడా అర్థం చేసుకోవాలి.

‘ప్రపంచ జనాభాలో 27.5% మంది కొవిడ్- 19 వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదును పొందారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మోతాదులు వ్యాక్సిన్ ఇచ్చారు. 3.56 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇప్పుడు ప్రతి రోజూ ఇస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో మాత్రం కేవలం 1.1% మంది మాత్రమే కనీసం ఒక మోతాదును పొందారు. (వరల్డ్ డాటా, 20 జులై -2021)

వ్యాక్సినేషన్ పురోగతి: మనం ఎంత దూరం వచ్చాం?

మహమ్మారికి ముందు వున్న జీవనశైలికి తిరిగి రావడానికి, జనాభాలో కనీసం 70% మంది సామూహిక (గుంపు) రోగనిరోధక శక్తిని సాధించాల్సిన అవసరం ఉందని సాధారణంగా అంగీకరిస్తున్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా మనం ప్రస్తుతం గమనిస్తున్న వ్యాక్సినేషన్ రేట్లకు ఈ లక్ష్యం చాలా దూరంగా ఉంది. టీకాలు వేసిన ఎగువ పదీ, దిగువ పది దేశాలలో పూర్తిగా జనాభా టీకారేట్లలో వ్యత్యాసం అభివృద్ధి చెంది న, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వ్యాక్సినేషన్ రేట్లలో ఉన్న అసమానతను వివరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జులై 15 వరకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసిన 1. ఎగువ దేశాల అత్యధిక జనాభా నిష్పత్తులు: యు.కె. 53.18%; స్పెయిన్ 52.07%; కెనడా 50.71%; అమెరికా 48.28%; జర్మనీ 46.36 %; ఫ్రాన్స్ 42.14% . యు. యస్. లో 2020 డిసెంబర్ 14 న వ్యాక్సినేషన్ ఆరంభించి 34 కోట్ల డోసులు వినియోగించారు. 16.3 కోట్ల మందికి టీకాలు పూర్తి డోసులు ఇచ్చారు. ఆమెరికాలో 49.2% జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది.

చైనా ఇప్పటికే 160 కోట్ల డోసులు వినియోగించి ప్రథమ స్థానంలో వుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చిన వ్యాక్సిన్లలో 60% చైనా ప్రజలకు ఇచ్చారు. 57.3% జనాభాకు రెండు డోసులు పూర్తి చేశారు. ప్రతి రోజు రెండు కోట్ల మందికి టీకాలు ఇస్తూ రాబోయే మూడు నెలల్లో తమ 140 కోట్ల జనాభాకు టీకాలు పూర్తి చేస్తామని వారు ప్రకటించారు. అంతేకాదు 75 దేశాలకు 35 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ అందించింది చైనా.

దిగువ దేశాల అత్యల్ప జనాభా నిష్పత్తులు: వియత్నాం 0.32%; సూడాన్ 0.42%; ఆఫ్ఘనిస్థాన్ 0.56%; నైజీరియా 0.68%; మొజాంబిక్ 0.96%. జనాభాకు మాత్రమే టీకాలు పూర్తి చేశారు. మన దేశంలో 16 జనవరి 21 న వ్యాక్సినేషన్ ఆరంభించారు. ఇప్పటి వరకు 39 కోట్ల మందికి టీకాలు ఇచ్చారు (31.5 కోట్ల మందికి మొదటి డోసు, 8 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేశారు). ప్రస్తుతం రోజు 40 లక్షల మందికి టీకాలు అందిస్తున్నారు. 5% జనాభాకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన టీకాల రేటు చాలా తక్కువగా వుంది. ప్రపంచం మొత్తానికి టీకాలు సప్లయ్ చేయగలిగిన సమర్ధత వుందని చెప్పిన మన పాలకులు నిష్క్రియా పరంగా మిగిలిపోయారు.

‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పేద దేశాల కోసం ప్రపంచ కోవాక్స్ పథకం కింద అందుకున్న 2.7 మిలియన్ ఎజెడ్ (ఆస్ట్రా జెనెకా) మోతాదులలో ఎక్కువ భాగాన్ని ఉపయోగించలేమని తెలిపింది. ఇవి జూన్ 24 గడువు తేదీని (expiry) కలిగి ఉన్నాయి. ఘనా, మడగాస్కర్ తో సహా ఇతర దేశాలకు వాటిని పంపివేశారు. “దక్షిణ సూడాన్ కూడా కోవాక్స్ పథకం ద్వారా పొందిన 72,000 మోతాదులను తిరిగి ఇచ్చి వేస్తోంది. ఇది మార్చిలో ఎజెడ్ వ్యాక్సిన్, 1,32,000 మోతాదులను పొందింది, వాటి చివరి గడువు జూన్. వీటిలో దక్షిణ సూడాన్ కేవలం 10,000 డోసులు మాత్రమే ప్రజలకు ఇవ్వగలిగింది. గడువు ముగియడానికి ముందే పంపిణీ చేయడానికి మరో 50,000 ఉంచి, మిగతావి వాపస్ చేస్తోంది.

-(మా వాయ్ 8 జూన్ 2021) పేద, మధ్య ఆదాయ దేశాల వైద్య వ్యవస్థలు, వాటి సాధన సంపత్తి కొద్ది సమయంలో, అందునా అత్యవసర ప్రాతిపదికన తమ ప్రజలకు టీకాలు పంపిణీ చేయగల సమర్ధత కలిగి లేవు అని స్పష్టంగా తెలుస్తోంది. తక్కువ లేదా మధ్యతరహా ఆదాయ దేశాలలో (ఎల్‌ఎమ్‌ఐ సిలు) తక్కువ వ్యాక్సినేషన్ రేటు నిజంగా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే జనసాంద్రత కలిగిన ఈ దేశాలు కరోనాను అరికట్టలేకపోతే, అవి ‘కరోనా వైరస్ కొత్త, మరింత ప్రమాదకరమైన వేరియంట్లకు ఇంక్యుబేటర్లుగా పనిచేస్తాయి’. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యత తీసుకుని ధనిక దేశాల ఆర్ధిక, పాదార్ధిక వనరులను వినియోగిస్తూ మానవ జాతిని కాపాడవలసి వుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News