Sunday, April 28, 2024

తెగించి కొట్లాడుదాం

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్‌లో కేంద్రాన్ని దోషిగా నిలబెడదాం

నిబంధనల ముసుగులో రాష్ట్రంపై ఆర్థిక కుట్ర
ప్రగతి పథాన సాగుతున్న రాష్ట్రానికి సహకరించని
కేంద్రం అడుగడుగునా అభివృద్ధిని
అడ్డుకుంటున్న మోడీ ఎఫ్‌ఆర్‌బిఎంపై మాట
మార్చడంలో ఆంతర్యమేమిటి? తొలుత
రూ.53వేల కోట్లకు అంగీకరించి, రూ.23వేల
కోట్లకు కుదించడం కుట్ర నీతి ఆయోగ్ సిఫార్సులు
బుట్టదాఖలా? కలిసొచ్చే విపక్ష ఎంపిలతో
సమన్వయం చేసుకొని ఆందోళనలు చేపట్టాలి
టిఆర్‌ఎస్ ఎంపిలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

అవసరమైతే నేనూ ఢిల్లీకి వస్తా.. విపక్ష నేతలతో చర్చిస్తా

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘తెగించి కొట్లాడితేనే… తెలంగాణ వ చ్చింది. తెగించి కొట్లాడుడు.. తెలంగా ణ రక్తంలోనే ఉంది. ఏమైతదో ఏమో అనే అనుమానం అక్కర్లేదు. మన పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రజల ఆ కాంక్షలకు అనుగుణంగానే మనం పో రాటం చేస్తున్నపుడు ఎందాక పోవాల్నో అందాక పోవాల్సిందే’ అని ముఖ్యమం త్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. బిజెపిని ఎండగడుతూ సాగే టిఆర్‌ఎస్ పోరాటంలో కలిసొచ్చే అన్ని పక్షాలను సరైన దిశగా ఫ్లోర్ కో-ఆర్డినేషన్ చేసుకుంటూ నిరసనలను చేపట్టాలని పార్లమెంట్‌లోని రాజ్యసభ, లోక్ సభ పక్షనేతలైన కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావులను ఆదేశించారు. నెల 18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివా రం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ స మావేశం జరిగింది.

ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ స భ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల కాలంలో రాష్ట్ర విభజన హామీలతో సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బిజెపి అసంబద్ధ వైఖరిని, కలిసొ చ్చే విపక్ష ఎంపిలతో సమన్వయం చేసుకొని ఎండట్టేందుకు కార్యాచరణపై వా రితో కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, పట్ల కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిపై ఉభయ సభ ల్లో తీవ్ర స్థాయిలో నిరసన గళం విప్పాలని ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రాన్ని ప్రోత్సహించడం మాని, తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు.

అవసరమైతే నేనూ ఢిల్లీకి వస్తా

పార్లమెంటు సమావేశాల సందర్భంగా అవసరమైతే తాను ఢిల్లీకి వచ్చి బిజెపి వ్యతిరేక పోరాటంలో కలిసివచ్చే విపక్ష పార్టీల అధినాయకులు, ఎంపీలతో చర్చలు జరుపుతానని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న పలు ప్రజా వ్యతిరేక బిల్లులను నిర్ద్వందంగా తిరస్కరించాలని ఎంపీలకు ఆదేశించారు.

పార్లమెంటు వేదికగా కేంద్రంపై సమరం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోతోందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా, భారత పౌరులుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు పార్లమెంటు ఉభయ సభలే సరైన వేదికలుగా మలుచుకొని సమరం చేయాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం
ఆర్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోడీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నదని సిఎం దుయ్యబట్టారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. అదే సమయంలో ఎఫ్‌ఆర్‌బిఎం పరిధికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న తీరును ఎంపీలకు వివరించారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క రోజు కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమన్నారు. ఆర్‌బిఐ ఆధ్వర్యంలో జరిగే బిడ్ల వేలం ప్రక్రియలో పాల్గొనే ఇన్వెస్టర్లు తెలంగాణ బిడ్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్న విషయం వాస్తవం కాదా? అని ఈ సందర్భంగా కేంద్రాన్ని కెసిఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రం మీద మోడీకి కన్నుకుట్టింది
పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోడీకి కన్నుకుట్టిందని సిఎం కెసిఆర్ దుయ్యబట్టారు. నిబంధనల పేరుతో ఆర్ధికంగా రాష్ట్రాన్ని అణచివేయాలని చూడటం అత్యంత శోచనీయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బిజెపి సోషల్ మీడియా గ్రూపులకు ఎట్లా చేరుతున్నాయో ఆ పార్టీనాయకత్వం స్పష్టం చేయాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. . దేశానికి, రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం నేరపూరిత చర్యగా సిఎం అభివర్ణించారు. ఇదంతా ఒక పకడ్బందీ పథకం ప్రకారం జరుగుతున్న బిజెపి రాజకీయ దిగజారుడుతనమని దుయ్యబట్టారు.

ఎఫ్‌ఆర్‌బిఎంపై కేంద్రం మాట మార్చింది
ప్రతిఏటా ఎఫ్‌ఆర్‌బిఎం లిమిట్‌ను కేంద్రం ప్రకటించిన తర్వాతే రాష్ట్రాలు కేంద్రం ప్రకటనపై ఆధారపడి వారి వారి బడ్జెట్లను రూపొందించుకుంటాయని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎఫ్‌ఆర్‌బిఎం లిమిట్‌ను రూ.53,000 కోట్లు అని ప్రకటించిన తరువాత కేంద్ర ప్రభుత్వం మాట మార్చడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా, కక్షపూరితంగా రూ.53 వేల కోట్ల లిమిట్‌ను రూ.23,000 కోట్లకు కుదించడం కుట్ర కాదా? అని సిఎం ప్రశ్నించారు. ఇటువంటి దివాళాకోరు, తెలివితక్కువ వ్యవహారాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో బిజెపిని నిలదీస్తూ, వారి నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేయాలని ఎంపీలకు కెసిఆర్ స్పష్టం చేశారు. అందుకు అన్నిరకాల ప్రజాస్వామిక పద్ధతులను అనుసరించాలని వారికి సూచించారు.

మోడీ ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం
ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు కేంద్రానికి ఒక మాదిరి, రాష్ట్రాలకు మరోమాదిరి ఉండటం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సిఎం అన్నారు. రాష్ట్రాల జీఎస్‌డిపిలో ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని 3శాతంగా పరిమితి విధించి, కేంద్రం మాత్రం 6.4శాతంగా నిబంధనలు సడలించడం ఎక్కడి న్యాయమన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం వచ్చిన 19 ఏండ్ల కాలంలో కేవలం ఒక్క ఏడాది తప్పితే మిగిలిన 18 ఏండ్లలో ఒక్కనాడు కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు పాటించలేదనే సంగతిని పార్లమెంటు దృష్టికి తేవాలన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం సవరణల పేరుతో కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు.

దోచిపెట్టేందుకే విద్యుత్ సంస్కరణలు
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రాల మీద ఒత్తిడి తేవడంపై సిఎం కెసిఆర్ మండిపడ్డారు. దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ ప్రతిసారి నీతి ఆయోగ్ ప్రశంసిస్తున్నదని, అత్యుత్తమ ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని పలుమార్లు నీతి ఆయోగ్ వంటి సంస్థలను చేసిన సిఫారసులను ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలు చేసిందని, దీనిపై కూడా నిలదీయాలని సిఎం అన్నారు.

కేంద్రం తీసుకున్నదెంత? ఇస్తున్నదెంత?
దేశంలో ఏ మూలన అభివృద్ధి సాధిస్తున్నా అది దేశ జీడీపీకే సమకూరుతుందని సిఎం కెసిఆర్ అన్నారు. దేశంలో కేవలం 8 రాష్ట్రాలే ఎక్కువ శాతం దేశ జీడీపీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయని, అందులో తెలంగాణ ఒకటని అన్నారు. ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది ఎంత? కేంద్రం నుంచి తిరిగి రాష్ట్రానికి వచ్చిన నిధులెన్ని? అనే లెక్కలు పరిశీలిస్తే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం ఏమిటో అర్ధమవుతుందన్నారు. ఆదాయ పన్ను సహా, వ్యాపార, వాణిజ్య, జిఎస్‌టి తదితర పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి అందుతున్న రూపాయలు అక్షరాల రూ. 3,65,737 కోట్లు కాగా, కేంద్రం నుంచి తెలంగాణకు అందుతున్నవి కేవలం రూ. 1,96, 449 కోట్లు మాత్రమేనని అన్నారు.

ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీయాలని కెసిఆర్ ఎంపీలకు వివరించారు. ఇందులో అన్నిరాష్ట్రాలకు వచ్చినట్లుగానే రాజ్యాంగబద్దంగా తెలంగాణకు కేంద్రం నుంచి వస్తున్న నిధుల్లో సెంట్రల్ డెవల్యూషన్ పద్దు కింద వచ్చినవి రూ.1,17,797 కోట్లు అని వివరించారు. ఈ నిధులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద వచ్చేవి కావన్నారు. అంటే రాష్ట్రానికి అందుతున్న మొత్తం నిధుల్లోంచి సెంట్రల్ డెవల్యూషన్ పద్దు ద్వారా అందుతున్నవి తీసివేస్తే కేవలం రూ.78 వేల కోట్లు మాత్రమేనని కెసిఆర్ పేర్కొన్నారు. అంటే 8 ఏండ్ల నుంచి సగటున కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన నిధులు ఏటా కేవలం రూ. 9 వేల పైచిలుకు కోట్లు మాత్రమేనని వివరించారు.

దేశాన్ని దివాళా తీసే దిశగా….
ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా విఫలమైందని సిఎం దుయ్యబట్టారు. దేశం ఆగమైతే.. రాష్ట్రాలు కూడా ఆగం కావా? అని ప్రశ్నించారు. అంటే మిమ్నల్ని అడిగేవారు ఎవరూ లేరని అనుకుంటున్నరా? అని మండిపడ్డారు. దేశంలో రాష్ట్రాలు భాగస్వామ్యం కాదా? రాష్ట్రాలను హద్దుల్లో పెడుతున్న కేంద్రం ఇష్టానుసార చర్యల్ని రాష్ట్రాలు ఎందుకు నిలదీయకూడదు? రాష్ట్రాలకు మిమ్నల్ని ప్రశ్నించే హక్కు ఎందుకు ఉండదు? మీ అసంబద్ధ చర్యల వల్ల దేశం ఆగమైతే రాష్ట్రాలు ఆగమైనట్లు కాదా? దేశంలోని రాష్ట్రాలన్నీ ఇదంతా చూస్తూ మౌనంగా ఉండాలా? మీరు కూర్చున్న కొమ్మను నరుక్కునే విధంగా కేంద్రం అనుసరిస్తున్న క్షమించరాని నేరాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని సిఎం కెసిఆర్ నిర్ద్వందంగా ప్రకటించారు. ఇదే విషయంపై పార్లమెంటు సాక్షిగా కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

అధిక ధరకు బొగ్గును కొనుగోలు చేయాలని ఒత్తిడి తేవడం ఏంటీ?
ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు అంటూనే కరంటు మోటార్లకు మీటర్లు పెట్టాలనే వంకర టింకర నిబంధనలను ఏ విద్యుత్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమో దేశానికంతా తెలుసుననే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని ఎంపీలకు సిఎ కెసిఆర్ పిలుపునిచ్చారు. నువ్వు అది చేస్తేనే…. నేను ఇదిస్తా.. అంటే ఇదేమన్నా బేరమా? అని కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వినడానికే విచిత్రంగా ఉందన్నారు. ఎక్కువ ధరకు కరెంటు కొనాలని, విధిగా ఎక్కువ ధర చెల్లించి బొగ్గును కొనాలని రాష్ట్రాలను ఒత్తిడి చేయడం హాస్యాస్పదమన్నారు. పిడికెడు మంది నీ వ్యాపారులకు సాయం చేయడానికి దేశానికి నష్టం చేస్తవా? అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఈ దుర్మార్గ చర్యల తంతు ఉభయ సభల్లో రికార్డు కావాలె అని సిఎం స్పష్టం చేశారు.

ఎనిమిదేళ్లలోనే రూ.100 కోట్లా అప్పా?
స్వాతంత్య్రం వచ్చిన 67 ఏండ్లలో దేశం అప్పు రూ. 56 లక్షల కోట్లు ఉంటే కేవలం తన 8 ఏండ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని సిఎం దుయ్యబట్టారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఏందో చెప్పాలన్నారు. రూపాయి పతనం, విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్ధికమాంద్యం, పాతాళానికి పడిపోయిన జీడీపీ తప్పితే, మోడీలో పాలనలో కనిపించే ప్రగతి శూన్యమన్నారు.

ఏ ప్రధానీ ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మలేదు
మోడీ ప్రభుత్వానికి తాగునీరు అందించడం చేతగాదు…. విద్యుత్తు అందిండం చేతగాదని కెసిఆర్ నిప్పులు చెరిగారు. కనీస మౌలిక వసతుల కల్పన కల్పించాలన్న ఊసే లేకుండా పోయిందని విమర్శించారు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లకూ, విద్యుత్ కు కరువు ఉండటం సిగ్గుచేటన్నారు. నాటి నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకూ ఈ దేశ ప్రధానులుగా పనిచేసిన వారెవరూ కూడా ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించారే తప్ప, అమ్మకానికి పెట్టలేదన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసిన ఘనత బిజెపికే దక్కిందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కారు చౌకగా తెగనమ్ముతుండటం సిగ్గుచేటన్నారు. ్ర. ఇప్పటివరకూ దేశాన్ని ఏలిన ఏ ప్రధానీ చేయనన్ని తప్పులను మోడీ చేస్తున్నారని అన్నారు.

ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దుర్మార్గం
రాష్ట్ర రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనకుండా కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గ వ్యవహారంపై ఎంపీలతో సిఎం కెసిఆర్ చర్చించారు. వడ్లు పండించుమని ఒకసారి, వద్దని మరోసారి, కొంటామని ఒకసారి, కొనడంలేదని ఇంకొకసారి…….. ఇలా ఢిల్లీ బిజెపి, ఇటు గల్లీ బిజెపి నేతలు ద్వంద్వ వైఖరిని అవలంభించడం దుర్మార్గమన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరుగుతున్నదని, వరిపంట ఎక్కువ పండించాలని నాలుగు రోజులనుంచి మళ్లీ బిజెపి ప్రభుత్వం ప్రచారం చేస్తూ, అయోమయానికి గురి చేస్తున్నదన్నారు. రైతులను మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు, అయోమయానికి గురిచేస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వ గోల్ మాల్, రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునిచ్చారు.

ఉపాధిహామీని ఆపేందుకు కుట్ర
రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి నేటిదాకా తెలంగాణ అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని (నరేగా) అమలు చేస్తున్నదని ప్రశంసిస్తూ వస్తున్న కేంద్రం…. నేడు మాట మార్చి కుట్రపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటని సిఎం కెసిఆర్ విమర్శించారు. తనిఖీల పేరుతో ఎన్నడూ లేనివిధంగా ఉద్దేశపూర్వకంగా కేంద్రం ఒకేసారి 16 బృందాలను పంపి కోడిగుడ్డు మీద ఈకలు పీకేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. ఇప్పటికే కేంద్రం పశ్చిమ బెంగాల్లో నరేగా పథకాన్ని రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిందని, తెలంగాణాలో కూడా ఇలాగే నరేగాను రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాతాళంలోకి దిగజారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ
కేంద్రం ఇటీవలి బడ్జెట్లో అన్నిరంగాలకు కోతలు విధించింది, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కట్టింది లేదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రగతి బాటలో నడవాల్సిన యువత మెదళ్లను కలుషితం చేస్తున్నదని సిఎం అన్నారు. ఇప్పటిదాకా ఈ దేశంలో బ్రెయిన్ డ్రెయిన్ మాత్రమే జరిగిందని, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాపిటల్ డ్రెయిన్ జరుగుతున్నదని పేర్కొన్నారు. భారత విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని ఈ సందర్భంగా సిఎం ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో డాలర్ విలువ 100 రూపాయలకు చేరుకునే పరిస్థితులు దాపురించాయని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారని, అవేమీ పట్టని మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రముఖ విదేశీ కంపెనీలు దేశాన్ని విడిచి ఎందుకు వెళుతున్నాయో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. మేకిన్ ఇండియా పేరుతో ప్రగల్భాలు పలికిన బిజెపి ప్రభుత్వం తద్విరుద్దంగా వ్యవహరిస్తున్నదన్నారు. పతంగులకు వాడే చిన్న మాంజా దగ్గర నుంచి ప్రతీ వస్తువు చైనా తదితర దేశాల నుంచే దిగుమతి చేసుకోవడం చూస్తుంటే.. మోడీ మేకిన్ ఇండియా డొల్లతనం బయటపడుతుందన్నారు.

బిజెపి మూకస్వామ్యంపై నిరసన గళం వినిపించాలి
పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం ఫరిఢవిల్లాల్సిన దేశంలో అశాంతి ప్రబలే సూచనలు దాపురించాయని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు సమాఖ్య స్పూర్తికి, లౌకికవాదానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయన్నారు. దేశంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి,, మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కేంద్రం అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గళం విప్పాలని ఎంపీలకు సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలి
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, పాలనలో పూర్తిగా విఫలమైన బిజెపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా ఎలుగెత్తి చాటాలన్నారు. వారు కేవలం 30శాతం పైచిలుకు ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన సంగతి మరువద్దని, మిగిలిన 70శాతం మంది దేశ ప్రజానీకం బిజెపి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేయాలని ఎంపీలకు సూచించారు. ప్రజా వ్యతిరేకత ఉధృతమైతే పార్లమెంటు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భాలను ఎంపీలకు గుర్తు చేశారు. అదే పరిస్థితిని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎదుర్కోక తప్పదన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు అంశాలకు చెందిన డిమాండ్లతో పాటు ఎస్‌టి రిజర్వేషన్ల పెంపుపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఈ జాప్యానికి బిజెపిని దోషిగా నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర రావు, జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పలువురు మంత్రులు, వివిభ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News