Saturday, May 4, 2024

కశ్మీర్ విద్యార్థులకు ఇదే సువర్ణావకాశం

- Advertisement -
- Advertisement -

governor tamilisai

 

హైదరాబాద్ : భారతదేశం గొప్పతనం, వైవిధ్యం, ఐక్యత గురించి తెలుసుకోవడానికి కశ్మీరు విద్యార్థులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సోమవారం రాజ్ భవన్‌లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం ‘వతన్ కో జానో 2019, -2020’ కింద హైదరాబాద్ వచ్చిన కాశ్మీర్ విద్యార్థులతో గవర్నర్ తమిళిసై సంభాషించారు. ఈ సందర్భంగా గవర్నర్ విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ మన దేశం యొక్క గొప్పతనాన్ని చూసి అందరూ గర్వించాల్సిన అవసరం ఉందన్నారు. మనకు సాంస్కృతిక భేదాలు ఉన్నప్పటికీ మనమంతా ఒకటే అన్న సందేశాన్ని వ్యాప్తి చేయాలని ఆమె సూచించారు. విద్యార్థులు ఇక్కడ తెలుసుకున్న అనుభవాలను వారి స్నేహితులు, బంధువులతో పంచుకోవాలని, వారు తమ ప్రదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు శాంతి, మంచి సంకల్పం, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయాలని ఆమె కోరారు.

కశ్మీర్‌ సందర్శనకు రండి: గవర్నర్ కు ఆహ్వానం
హైదరాబాద్ యొక్క సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు ఈ సందర్భంగా గవర్నర్‌తో జరిపిన సంభాషణలో పేర్కొన్నారు. బండిపోరా జిల్లాకు చెందిన 9వ తరగతి విద్యార్థిని హర్మత్ హమీద్ తదుపరి చదువును హైదరాబాద్‌లో కొనసాగాలని తన మనసులోని కోరికను గవర్నర్ ఎదుట వెలిబుచ్చారు. కశ్మీర్‌ను సందర్శించాలని ఆమె గవర్నర్‌ను ఈ సందర్భంగా ఆహ్వానించారు.

రాజ్‌భవన్ వారసత్వ భవనాలను చూడటం ఆనందంగా ఉందని బారాముల్లా జిల్లాకు చెందిన బిఎ 1వ సంవత్సరం విద్యార్థి జాహిదా పేర్కొన్నారు. బండిపోరా జిల్లాకు చెందిన ఇంటర్ 2 వ సంవత్సరం విద్యార్థి మిస్టర్ జాఫర్ హుస్సేన్ హైదరాబాద్‌ను చూసే అదృష్టం కలగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బండిపోరా జిల్లాకు చెందిన బి.ఎస్.సి ఫైనల్ ఇయర్ విద్యార్థి మిస్టర్ యాకుబ్ అహ్మద్ హైదరాబాద్ లోని అందమైన ప్రదేశాలను చూసినప్పుడు తనకు కలిగిన అనుభవాలను మరోసారి గుర్తు చేసుకున్నారు.

పర్యటనకు సంబంధించిన సమాచారం ఆసక్తికరంగా ఉందని బుద్గాన్‌కు చెందిన 4 వ సెమ్ బిఎ (హోస్) జాస్మిమ్ జహూర్ పేర్కొన్నారు. బుద్గాన్ జిల్లాకు చెందిన బిఎ 2 వ సంవత్సరం విద్యార్థి మిస్టర్ జహేద్ నిజీర్, హైదరాబాద్ నగర వారసత్వం, సంస్కృతీ, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. తమ పర్యటనను సులభతరం చేసినందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఎస్‌ఎస్‌బి, సిఆర్‌పిఎఫ్, తెలంగాణ పౌర అధికారులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

This is great opportunity to learn greatness of India
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News