Monday, April 29, 2024

సిరీస్ నీదా.. నాదా

- Advertisement -
- Advertisement -

Today is the last ODI between IND vs ENG

ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, టీమిండియాకు పరీక్ష, నేడు చివరి వన్డే

పుణె: ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగే మూడో, చివరి వన్డే టీమిండియాకు సవాలుగా మారింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినా ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్, జాసన్ రాయ్ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. ఈ గెలుపు నింపిన జోష్‌తో చివరి వన్డేకు ఇంగ్లండ్ సమరోత్సాహంతో సిద్ధమైంది. టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉండడం ఇంగ్లండ్‌కు పెద్ద ఊరటగా మారింది. రెగ్యూలర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అందుబాటులో లేకున్నా రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ అసాధారణ పోరాట పటిమతో విజయం అందుకుంది.

ఇదే జోరును చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీమిండియా కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయానికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతోంది. ఇప్పటికే టెస్టు, టి20 సిరీస్‌లను హస్తగతం చేసుకున్న విరాట్ కోహ్లి వన్డేల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. అయితే కిందటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించడం అనుకున్నంత తేలికేం కాదు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో చివరి మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పాలి. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 11తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.

పరుగుల వరద ఖాయం..

తొలి రెండు మ్యాచుల్లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యాయి. చివరి మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటు ఇంగ్లండ్, అటు భారత బ్యాట్స్‌మెన్‌లు అందరూ ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఆఖరి మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు కావడం ఖాయమనే చెప్పాలి. ఇక రెండో వన్డేలో 337 పరుగుల లక్ష్యాన్ని సయితం ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. ఒకవైపు ఫ్లాట్ పిచ్..మరోవైపు తేమ ఉండడంతో బ్యాట్స్‌మెన్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. టీమిండియాలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, కెఎల్.రాహుల్, రిషబ్ పంత్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య తదితరులు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. కిందటి మ్యాచ్‌లో పంత్ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. రాహుల్ శతకంతో కదంతొక్కాడు. కోహ్లి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. తొలి మ్యాచ్‌లో శిఖర్ ధావన్ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, రాహుల్, కృనాల్‌లు తమదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా బ్యాట్స్‌మెన్ చెలరేగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జోరు సాగాలి..

మరోవైపు ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లో కూడా భారత బ్యాట్స్‌మెన్ మెరుగ్గానే ఆడారు. అయితే రెండో వన్డేలో రోహిత్ శర్మ, ధావన్‌లు తక్కువ స్కోర్లకే ఔట్ కావడం కాస్త ఆందోళన కలిగించే పరిణామం. అయితే కెప్టెన్ కోహ్లి, కెఎల్.రాహుల్‌లు ఫామ్‌లో ఉండడం భారత్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. కోహ్లి ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లోనూ అర్ధ సెంచరీలతో అలరించాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నాడు. రాహుల్ కూడా మరోసారి చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఓ అర్ధ సెంచరీ, మరో శతకంతో సత్తా చాటిన రాహుల్ చివరి మ్యాచ్‌లోనూ చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. ధావన్, రాహుల్, కోహ్లి, రోహిత్‌లలో ఎవరూ నిలదొక్కుకున్నా జట్టుకు భారీ స్కోరు నల్లేరుపై నడకే. మరోవైపు రిషబ్ పంత్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్యల రూపంలో విధ్వంసం సృష్టించే హార్ద్ హిట్లర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా భారీ స్కోరు సాధించడం ఖాయం.

అసలు సమస్య బౌలింగే..

టీమిండియా బ్యాటింగ్‌లో బాగానే రాణిస్తున్నా బౌలింగ్‌కు వచ్చేసరికి చతికిల పడుతోంది. ఒక్క భువనేశ్వర్ కుమార్ తప్ప మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ బాగానే ఉన్న ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయడంలో విఫలమవుతున్నాడు. వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు సమర్పించుకుంటుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. శార్దూల్ ఠాకూర్ కూడా నిరాశ పరుస్తున్నాడు. ఇక స్పిన్నర్లు కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్‌లు అయితే ఘోరంగా విఫలమయ్యారు. భారీ ఆశలు పెట్టుకున్న కుల్దీప్ యాదవ్ అత్యంత చెత్త బౌలింగ్‌తో నిరాశే మిగిల్చాడు. తొలి వన్డేలో 64, రెండో వన్డేలో ఏకంగా 84 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక కృనాల్ పాండ్యకూడా ఆరు ఓవర్లలోనే 72 పరుగులు ఇచ్చి జట్టు పరాజయానికి పరోక్ష కారణమయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో చాహల్, అక్షర్ పటేల్, నటరాజన్, సిరాజ్‌లకు చోటు ఖాయంగా కనిపిస్తోంది.

వారిని కట్టడి చేస్తేనే..

ఇక ఇంగ్లండ్ జట్టును కూడా బౌలింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే బ్యాట్స్‌మెన్ విజృంభణతో ఆ లోటు కనబడడం లేదు. రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని సయితం ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. బెయిర్‌స్టో, జాసన్ రాయ్, బెన్‌స్టోక్స్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నారు. కిందటి మ్యాచ్‌లో ఈ ముగ్గురు అద్భుతంగా రాణించారు. బెన్ స్టోక్స్ వీర విధ్వంసం సృష్టించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తే 50 బంతుల్లోనే 99 పరుగులు సాధించాడు. దీన్ని బట్టి స్టోక్స్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. మరోవైపు బెయిర్‌స్టో కూడా విధ్వంసం సృష్టిస్తున్నాడు. కిందటి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. రాయ్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వీరిని కట్టడి చేస్తేనే భారత్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయి. లేకుంటే సిరీస్‌ను కోల్పోవడం ఖాయమనే చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News