Friday, April 26, 2024

కోల్‌కతా జోరు సాగేనా!

- Advertisement -
- Advertisement -

Tomorrow match between Kolkata knight riders vs Mumbai Indians

రేపు ముంబైతో పోరు

అబుదాబి: ఐపిఎల్ రెండో దశ టోర్నమెంట్‌లో కళ్లు చెదిరే విజయంతో శ్రీకారం చుట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ గురువారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక ఆరంభ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలై డీలా పడిన ముంబైకి ఈ పోరు సవాల్‌గా మారింది. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో జట్టు ప్రధాన కోచ్ జయవర్ధనే మాత్రం రోహిత్ బరిలోకి దిగుతాడనే సంకేతాలను ఇచ్చాడు. ఇక పటిష్టమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా అలవోక విజయాన్ని అందుకుంది. వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్‌లు చక్కటి బౌలింగ్‌ను కనబరచడంతో నైట్‌రైడర్స్ ఘన విజయం సొంతం చేసుకుంది. ఇదే జోరును ముంబైతో జరిగే మ్యాచ్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోల్‌కతా బలంగా కనిపిస్తోంది.

ఓపెనర్లే కీలకం..

ఈ మ్యాచ్‌లో కూడా కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్‌లపై భారీ ఆశలు పెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో వీరిద్దరూ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. వెంకటేశ్ ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇక మరో ఓపెనర్ గిల్ కూడా ఫామ్‌లోకి రావడం కోల్‌కతాకు ఊరటనిచ్చే అంశమే. గిల్, వెంకటేశ్‌లు రాణిస్తే ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ మెరుగైన ఆరంభం ఖాయం.

ఆ ఇద్దరు రాణించాల్సిందే..

మరోవైపు సీనియర్లు దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్‌లు ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరం జట్టుకు ఎంతో ఉంది. కిందటి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వీరికి రాలేదు. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండక పోవచ్చు. కిందటి మ్యాచ్‌లో ప్రత్యర్థి తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో కోల్‌కతా పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ముంబై వంటి బలమైన జట్టును తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడం అంత సులువేమీ కాదు. ఇక బౌల్ట్, బుమ్రా, రాహుల్ చాహర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉన్న ముంబైపై మెరుగైన స్కోర్లు సాధించాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఇక కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాల్సిన పరిస్థితి మోర్గాన్‌పై నెలకొంది. ఇక వికెట్ కీపర్ కార్తీక్ కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. ఆండ్రీ రసెల్, నితీష్ రాణా తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక వరుణ్ చక్రవర్తి, రసెల్, ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ, నరైన్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారింది. దీంతో కోల్‌కతా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

గెలవాల్సిందే..

మరోవైపు తొలి మ్యాచ్‌లో సిఎస్‌కె చేతిలో కంగుతిన్న ముంబై ఇండియన్స్‌కి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో గెలవక తప్పదు. అయితే కోల్‌కతాతో పోల్చితే ప్రస్తుతం ముంబై పరిస్థితి కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. కానీ రెండో దశలో ఇతర జట్లు కూడా దూకుడు మీద కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు ప్లేఆఫ్‌కు చేరుతుందో ముందే ఊహించడం కష్టంగా మారింది. ఇక సిఎస్‌కె మ్యాచ్‌లో ముంబై తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. బౌలర్లు బాగానే రాణించినా బ్యాటింగ్ వైఫల్యంతో ముంబైకి తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. కిందటి మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్, డికాక్, పొలార్డ్, కృనాల్, ఇషాన్ కిషన్ తదితరులు ఘోరంగా విఫలమయ్యారు.

వీరి వైఫల్యం జట్టుపై బాగానే పడింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు చెలరేగితే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించడం ముంబైకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ బరిలోకి దిగకపోతే అతని స్థానంలో పొలార్డ్ సారథ్యం వహిస్తాడు. కాగా, ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్న ముంబైని తక్కువ అంచనా వేస్తే కోల్‌కతా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News