Monday, April 29, 2024

రాజస్థాన్‌కు పరీక్ష

- Advertisement -
- Advertisement -

Tomorrow match between RR-RCB

నేడు బెంగళూరుతో కీలక పోరు

దుబాయి: ఐపిఎల్ సీజన్14లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రాజస్థాన్‌కు నెలకొంది. కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైన రాజస్థాన్‌కు ఈ పోరు సవాల్‌గా మారింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాయల్స్ బలమైన బెంగళూరును ఓడించాలంటే అసాధారణ ఆటను కనబరచక తప్పదు. ఇక కిందటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన బెంగళూరు ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్న కోహ్లి సేన ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాజస్థాన్‌లో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాట్స్‌మన్ ఆ జట్టులో ఉన్నారు. అయితే నిలకడలేమి రాజస్థాన్‌కు ప్రధాన సమస్యగా మారింది. ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే ఈ మ్యాచ్‌లో గెలవడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి.

జోరుమీదున్న విరాట్

బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో దశ మ్యాచుల్లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. మరో ఓపెనర్ దేవ్‌దుత్ పడిక్కల్ కూడా బాగానే ఆడుతున్నాడు. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కానీ, కోహ్లి ఫామ్‌లో ఉండడం బెంగళూరుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాచ్చు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా బాగానే ఆడుతున్నాడు. కిందటి మ్యాచ్‌లో డాషింగ్ ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ కూడా చెలరేగి పోయాడు. ఇటు బ్యాట్‌తో అటు బంతితో మాక్స్‌వెల్ రాణించాడు. మాక్స్‌వెల్ ఫామ్‌లోకి రావడం బెంగళూరుకు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా మాక్స్‌వెల్‌కు ఉంది. కిందటి మ్యాచ్‌లో అతను ఈ విషయాన్ని రుజువు చేశాడు. అయితే మరో స్టార్ ఆటగాడు డివిలియర్స్ వైఫల్యం బెంగళూరును కలవరానికి గురిచేస్తోంది. రెండో దశలో అతను ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. దీంతో బెంగళూరుకు బ్యాటింగ్ కష్టాలు తప్పడం లేదు. డివిలియర్స్ కూడా గాడిలో పడితే కోహ్లి సేనకు ఎదురే ఉండదు. ఇక బౌలింగ్‌లో బెంగళూరు నిలకడైన ప్రదర్శన చేస్తోంది. సిరాజ్, హర్షల్ పటేల్, చాహల్, మాక్స్‌వెల్‌లు రాణిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రెండు విభాగాల్లో సమష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు విజయం ఖాయమనే చెప్పొచ్చు.

శాంసన్ ఒక్కడే..

ఇక రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. రెండో దశలో రాజస్థాన్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ శాంసన్ ఒక్కడే జట్టుకు అండగా నిలిచాడు. మిగతావారు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోతున్నారు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. యశస్వి జైస్వాల్ బాగానే ఆడుతున్నా అతనికి సహకరించే వారు లేకుండా పోతున్నారు. లివింగ్ స్టోన్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా తదితరులు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. శాంసన్ మాత్రం ప్రతి మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. మహిపాల్ కూడా కాస్త బాగానే ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో జట్టు ఆటగాళ్లందరూ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారడం ఖాయం. దీంతో రాజస్థాన్ గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News