Saturday, May 4, 2024

హిజ్బుల్‌కు చావుదెబ్బ

- Advertisement -
- Advertisement -

Hizbul Commander

 

టాప్ కమాండర్ నైకూ హతం
ఉగ్రవాదంపై పోరులో సైన్యం భారీ విజయం
ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉగ్రవాదం వైపు…
కశ్మీర్ లోయలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

శ్రీనగర్: ఉగ్రవాదంపై పోరులో మన భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని సాధించాయి. కశ్మీర్‌లోని ఫుల్వామా జిల్లాలో బుధవారం జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను హతమార్చాయి. నైకూ ఎన్‌కౌంటర్‌తో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చన్న అనుమానంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్ లోయ అంతటా ప్రైవేట్ ఆపరేటర్ల మొబైల్ ఫోన్ సేవలను, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపి వేశారు. మూడు రోజుల క్రితం కశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో ముష్కరుల దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులు సహా ఎనిమిది మంది భద్రతా జవాన్లు ప్రాణాలు కోల్పోయినప్పటినుంచి భద్రతా దళాలు మిలిటెంట్ల కోసం భారీ ఎత్తున వేట ఆరంభించాయి.

ఈ క్రమంలో నైకూ ఇటీవల తన స్వగ్రామమైన బెయ్‌పోరాకు వచ్చినట్లు పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమైన దళాలు మంగళవారం రాత్రి ఆ గ్రామాన్ని దిగ్బంధించి అతను ఉన్న ఇంటిని చుట్టుముట్టాయి. గతంలో నైకూ మూడు సార్లు భద్రతా దళాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపారిపోయిన నేపథ్యంలో ఈసారి అలాంటి అవకాశం లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. ఈ క్రమంలో ఉగ్రవాది భద్రతా దళాలపై కాల్పులు ప్రాంభించడంతో సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో అతను హతమైనట్లు అధికారులు ధ్రువీకరించారు. తప్పించుకు పారిపోవడానికి యత్నించిన అతని అనుచరుడ్ని కూడా సైన్యం మట్టుబెట్టింది. ఇదే జిల్లాలోని షర్షహల్లి గ్రామం వద్ద జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని మిలిటెంట్లు హతమైనారు.

ఉపాధ్యాయుడిగా పని చేసి…
తొలుత ఉపాధ్యాయుడిగా పని చేసిన రియాజ్ 33 ఏళ్ల వయసులో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైనాడు. కరుడు గట్టిన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీహతమైన తర్వాత ఆ బాధ్యతలను రియాజ్ తీసుకున్నాడు. మరో కీలక నేత జాకీర్ ముసా హిజ్బుల్‌నుంచి నిష్క్రమించిన తర్వాత రియాజ్ కీలక నేతగా మారాడు. లోయలో యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్పెషల్ పోలీసు ఆఫీసర్స్(ఎస్‌పిఓ)ను బెదిరించి రాజీనామా చేయించడంలోను కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నాయి. నైకూపై కరుడుగట్టిన టాప్ ఉగ్రవాదిగా ముద్ర ఉంది. అతని తలపై రూ.12 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. రియాజ్‌ను హతమార్చడం భద్రతా దళాలకు పెద్ద విజయమనే చెప్పాలి. అతని మరణంతో స్థానికంగా ఉగ్రవాద కార్యకలాపాలు బలహీనపడే అవకాశముంది. అలాగే హంద్వారా ఎన్‌కౌంటర్‌లో జరిగిన ప్రాణనష్టానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు కూడా అవుతుంది.

Top militant commander killed by Indian forces in JK
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News