Tuesday, May 7, 2024

ఉపా నుంచి ఊరట!

- Advertisement -
- Advertisement -

US and NATO pull-out of afghan raises tremendous

ప్రజల ఓటుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు నిరంకుశంగా పాలించదలిచేటప్పుడు ముందుగా బలి తీసుకునేది సమాచార స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్నే. బిజెపి పరిపాలనలోని త్రిపుర పోలీసులు ఈ పనిని పరమ నిష్ఠగా, అత్యంత నికృష్టంగా జరిపిస్తున్నారని స్పష్టపడుతున్నది. ఆ రాష్ట్రంలో మైనారిటీలైన ముస్లింలను లక్షంగా చేసుకొని గత నెలలో సాగిన రాజకీయ హింసపై నిజ నిర్ధారణ పరిశీలన జరిపిన ఇద్దరు లాయర్ల మీద, ‘త్రిపుర మండిపోతున్నది’ అంటూ ట్విటర్ పోస్టింగ్ పెట్టిన ఒక జర్నలిస్టుపైన అక్కడి పోలీసులు చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం (ఉపా) కింద కేసులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. పోలీసుల చర్యపై సుప్రసిద్ధ హక్కుల పరిరక్షణ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా ఆ ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వెంటనే స్పందించి ఆ ముగ్గురిపై అరెస్టు సహా ఎటువంటి బలవంతపు, బలప్రయోగ చర్యలకు పాల్పడరాదని త్రిపుర పోలీసులను ఆదేశించింది. ఉపా చట్టం కింద గరిష్ఠంగా మరణ శిక్ష లేదా యావజ్జీవ ఖైదును విధించవచ్చు. నిందితుల ఆస్తులను జప్తు చేయవచ్చు. 1967 నాటి ఈ చట్టానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 జులైలో మరిన్ని కోరలను చేర్చి ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రయోగించడానికి నిర్ణయించింది. దీని కింద అరెస్టయిన వారు ముందస్తు జామీనుకు గాని, జామీనుకు గాని సాధారణంగా అర్హులు కారు. నిజ నిర్ధారణను చేపట్టడమో, వాస్తవ పరిస్థితిని మిగతా ప్రపంచానికి తెలియజేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టింగ్ పెట్టడమో ఉగ్రవాద చర్యలు ఎలా అవుతాయో అర్థం కాని విషయం.

రెండు మతాల మధ్య చిచ్చు రేపడానికి ప్రయత్నించారని వీరిపై త్రిపుర పోలీసులు అభియోగాలు మోపారు. ఉపా చట్టాన్ని ఇంతకు ముందు భీమా కోరేగామ్ అల్లర్లు, హింసాకాండకు సంబంధించి ప్రజాస్వామిక మేధావి ఆనంద్ తేల్‌తుమ్డే, జర్నలిస్టు గౌతమ్ నవ్‌లఖ, మరి 9 మంది ప్రముఖులపై ప్రయోగించారు. పట్టణ నక్సలైట్లు అని పేరు పెట్టి మావోయిస్టు సానుభూతిపరులంటూ అరెస్టు చేయడం పరిపాటైపోయింది. త్రిపుర న్యాయవాదులను, జర్నలిస్టును ఈ చట్టం కింద అరెస్టు చేయకుండా అడ్డుకోడం ద్వారా సుప్రీంకోర్టు దాని దూకుడుకు అడ్డు చక్రం వేసి దేశంలో ప్రజాస్వామిక ధర్మానికి కొంత ఊపిరి పోసింది.బంగ్లాదేశ్‌లో ఇటీవల దుర్గా పూజ సందర్భంగా ఒక వదంతిని ఆధారం చేసుకొని అక్కడి మైనారిటీ హిందువులపై హింసాకాండ చెలరేగిన సంగతి దానిని నిరోధించడానికి హసీనా ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను దింపి కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ హిందు వ్యతిరేక అల్లర్లకు నిరసనగా త్రిపురలో గత నెల 26న జరిగిన ప్రదర్శనలో హింస చోటు చేసుకున్నది. ఆ వెంటనే అక్కడి ముస్లింలపై దాడులు సంభవించి అల్లర్లకు దారి తీశాయి. త్రిపుర బంగ్లాదేశ్‌కు ఆనుకొని ఉన్నది. ఆ రెండింటి మధ్య 856 కి.మీ సరిహద్దు వుంది. అందుచేత బంగ్లా అల్లర్లకు ప్రతిగా ఇక్కడి హిందుత్వ శక్తుల ప్రేరణతో ముస్లింలపై దాడులు జరిగాయని భావిస్తున్నారు. త్రిపుర జనాభా 42 లక్షల మందిలో ముస్లింలు 9 శాతం మంది మాత్రమే. గతంలో వామపక్ష పాలనలో త్రిపుర ముస్లింలపై ఎన్నడూ ఈగ కూడా వాలలేదు. 1980, 1990లలో స్థానిక గిరిజన తెగలకు, బెంగాలీలకు మధ్య ఘర్షణలు సంభవించినప్పుడు కూడా ముస్లింల జోలికెవ్వరూ పోలేదు.

కాని హిందుత్వ శక్తులకు అండదండగా ఉన్న బిజెపి పాలనలో ముస్లిం వ్యతిరేక దాడులు, అల్లర్లు, మతకల్లోలాలు మొదటిసారిగా సంభవించడం గమనించవలసిన విషయం. అల్లర్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకోడానికి బదులు నిజ నిర్ధారణ చేపట్టిన లాయర్ల మీద, వాస్తవ పరిస్థితిపై ట్వీట్ చేసిన జర్నలిస్టుపైన ఉపా చట్టాన్ని త్రిపుర పోలీసులు ప్రయోగించడంలోనే వారి ప్రభు భక్తి ప్రస్ఫుటమవుతున్నది. ఒక మసీదును తగులబెట్టారంటూ తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా దుండగులు వ్యాప్తి చేస్తున్నారని అది వాస్తవం కాదని పోలీసులు ప్రకటించారు. అన్ని మసీదులకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. అయితే అల్లర్లను అరికట్టడానికి అవసరమైనంత గట్టి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదన్న అభిప్రాయంతో, మీడియాలో వార్తల ఆధారంగా హైకోర్టు తనంత తానుగా ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. శాంతి భద్రతల పునరుద్ధరణకు త్రిపుర ప్రభుత్వం చేస్తున్న కృషిని హర్షిస్తూనే మరిన్ని చర్యలు తీసుకోవాలని, జిల్లా స్థాయిలోనే కాకుండా తాలూకా, గ్రామ స్థాయిల్లో కూడా శాంతి సంఘాలను నెలకొలాలని సూచించింది. పోలీసు యంత్రాంగం రాజ్యాంగ ప్రకారం నడుచుకోడానికి బదులు రాజకీయ ప్రభువులను సంతృప్తి పరచడం కోసం చట్టాన్ని దుర్వినియోగం చేసినప్పుడే న్యాయ స్థానాలు కలుగజేసుకోవలసి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News