Friday, April 26, 2024

అబద్ధాలవైపా, అభివృద్ధివైపా?

- Advertisement -
- Advertisement -

TRS in GHMC election campaign

 

హైదరాబాద్‌లో గ్రేటర్ ఎన్నికల హీట్ నడుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం, మంత్రి కెటిఆర్ సారథ్యంలో టిఆర్‌ఎస్ పార్టీ మంచి ఊపులో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఆరేండ్లలో చేసిన అభివృద్ధిని, గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కెటిఆర్ అనేక ప్రసంగాల ద్వారా, వేదికల ద్వారా ప్రజలకు వివరిస్తూ ఓటు అడుగుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం పచ్చి అబద్ధాలను చెబుతూ ఓట్లు సంపాదించాలని చూస్తుంది. ఇదేం చిత్రమో ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ ఆ పార్టీ అబద్ధాలను నమ్ముకుంది. ఫేక్ సోషల్ మీడియా, ఫేక్ ముచ్చట్లను ముందరేసుకుని అవే నిజం అన్నట్టుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. ఇంతకు ముందు నిజామాబాద్, కరీంనగర్ ఇటీవల దుబ్బాకలో అబద్ధపు ప్రచారాలు, ఉద్దెర హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వారు విజయం సాదించారు. వాళ్ళు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మితే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్ధం చేసుకున్నారు.

టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించి ఎవరి మద్దుతూ లేకుండా గ్రేటర్ పీఠం కైవసం చేసుకుంది. టిఆర్‌ఎస్ పగ్గాలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఏదైనా పార్టీ తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకోవాలి టిఆర్‌ఎస్ చెప్పిందే చేస్తున్నది. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గ నిర్దేశనంలో మంత్రి కెటి రామారావు ఐటిలో పెట్టుబడులకు హైదరాబాద్‌ను స్వర్గధామంగా మార్చారు. అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన ప్రసంగాలను, హైదరాబాద్ గురించి చెప్పిన విషయాల పట్ల పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులు ఆకర్శితులై హైదరాబాద్‌లో పెట్టుబడులు, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చారు.పెట్టుబడులు, పరిశ్రమలతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

అందరికీ చేతినిండా పని దొరుకుతుంది. అందమైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యను తీర్చే అండర్ పాస్‌లు, స్కైవేలు, ఫ్లై ఓవర్లు, లింకు రోడ్లను టిఆర్‌ఎస్ సర్కారు ఏర్పాటు చేసి హైదరాబాదీలకు ట్రాఫిక్ సమస్యను దూరం చేసింది. నిరంతరం త్రాగునీరు, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, గతంలో లాగా పవర్ హాలీడేలు లేకుండా పరిశ్రమలు 24 గం.ల కరెంట్‌తో లాభాల బాట పట్టాయి. శాంతి భద్రతల పర్యవేక్షణలో అద్భుతంగా తెలంగాణ పోలీస్‌లు పని చేస్తున్నారు. షీ టీమ్స్‌తో మహిళలకు సంపూర్ణ భద్రత దొరికింది. హైదరాబాద్ సేఫ్ సిటీగా నిలిపింది తెలంగాణ ప్రభుత్వం.

కొత్త ఆలోచనలకు పునాదులు వేసేలా టి హబ్ స్థాపన, ప్రజల రక్షణకై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, పేదల కోసం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం, టిఎస్ ఐ సాస్ ద్వారా ఉత్తమ పారిశ్రామిక విధానం, ఐటి, ఫార్మా తయారీ రంగాల్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు 8.5 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. నగరానికే వన్నె తెచ్చేలా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, మెట్రో ఇలా చెప్పుకుంటూ పోతే 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని టిఆర్‌ఎస్ పార్టీ ఆరేండ్లలో చేసి చూపించింది. హైదరాబాద్‌లో గతంలో మతకల్లోలాలు జరిగేవి. కానీ గత ఆరేండ్లలో ఒక్క గొడవా లేదు. అన్ని మతాల సామరస్యాన్ని ప్రభుత్వం కాపాడుతూ, అందరినీ సమానంగా చూస్తూ పాలన సాగిస్తుంది టిఆర్‌ఎస్. చేసింది చెపుతూ, చేయబోయేది చెబుతూ టిఆర్‌ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంది..

కానీ జాతీయ పార్టీ అయిన బిజెపి పరిస్థితి వింతగా తయారైంది. ప్రజల జీవన విధానాల్లో మార్పు జరిగేలా హామీలు ఉండాలి. ఒక పని చేస్తే అది ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. అంతేకానీ ప్రజల జీవితాలు నాశనం చేసేదిగా ఉండకూడదు. బిజెపి అధ్యక్షుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. వారు ఇస్తున్న హామీలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతిస్తాం, డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేసుకోవచ్చు, చలానాలు మేమే కడతాం అంటూ బండి సంజయ్ చేసిన ప్రసంగాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. జనాలు ఆ హామీలను చూసి నవ్వుకుంటున్నారు. అసలు దాని వల్ల ఉపయోగం ఏంటి..? యువత పెడదారి పట్టద్దనే కదా ప్రభుత్వాలు తప్పు చేస్తే శిక్షలు పెట్టింది..? యువతను సన్మార్గంలో నడిపించాల్సిన నేతలు ఇలాంటి హామీలు ఇచ్చి యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? బండి సంజయ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరోవైపు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం తర్వాత చేతులెత్తేయటం బిజెపికి అలవాటుగా వస్తున్నది.

గతంలో ఎంఎల్‌సిగా గెలిపిస్తే ప్రత్యేక హైకోర్టు తీసుకొస్తా అని రాంచందర్ రావు గెలిచాక మాట మార్చారు. తనను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తా అని ధర్మపురి అరవింద్ నిజామాబాద్‌లో రైతుల ఓట్లతో గెలిచి చివరకు రైతుల నోట్లో మట్టి కొడుతూ మాట మార్చాడు. దుబ్బాకలో గెలిస్తే కేంద్రం నిధులు తెస్తా అని చెప్పి గెలిచినాక రఘునందన్ రావు తాను తెస్తా అనలేదని మాట మార్చారు. ఇప్పడు తాజాగా హైదరాబాద్‌లో బిజెపి ఇస్తున్న హామీలు చూస్తే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉన్నాయి. వరదల్లో బైక్ పోతే బైక్ కొనిస్తం, కారు పోతే కారు కొనిస్తాం, లారీ పోతే లారీ కొనిస్తాం అంటూ ఉద్దెర హామీలను బండి సంజయ్ ఇస్తున్నారు. అసలు ఇంత అబద్ధాలు ఆడవచ్చా, ఇంత అసహ్యంగా మాట్లాడవచ్చా, ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉండి ఇన్ని అబద్ధాలు చెప్పవచ్చా, అసలు ఇది సాధ్యమా? హైదరాబాద్ లో వరదలొస్తే కేంద్రం నుండి అర్ధ రూపాయి కూడా సాయం చేయలేదు..

అలాంటి పార్టీ రూ. లక్షల్లో సాయం చేస్తుందంటూ అసత్యాలు చెబితే ప్రజలు నమ్ముతారా..? పశ్చిమ బెంగాల్‌కు రూ. 2707.77 కోట్లు, ఒడిశాకు రూ. 128.23 కోట్లు, మహారాష్ట్రాకు రూ. 268 .59 కోట్లు, కర్ణాటకకు రూ. 577.84 కోట్లు, మధ్య ప్రదేశ్‌కు రూ. 611.61 కోట్లు, సిక్కింకు రూ. 87.84 కోట్లు ఇలా ఆరు రాష్ట్రాలకు 4,381.88 కోట్ల వరద సాయం చేసిన బిజెపి ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసింది. మన రాష్ట్రానికి రావాల్సిన జిఎస్‌టి బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుంది. సన్న ధాన్యాన్ని కొనేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా లక్ష కొర్రీలను పెడుతూ అడ్డం పడుతుంది. పత్తిపంటకు మద్దతు ధరను తగ్గించి రైతుల పొట్టకొడుతుంది. హైదరాబాద్‌కు, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది బిజెపి. కానీ ఇక్కడ బండి సంజయ్, బిజెపి నేతలు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఉచిత హామీలు ఇస్తున్నారు. ఈ హామీలను నమ్మి హైదరాబాద్ ప్రజలు మోసపోరు. హైదరాబాద్ ప్రజలు వీళ్ళ అసత్యాలను ఓటు ద్వారా తిప్పికొట్టాలి. బిజెపికి తగిన గుణపాఠం చెప్పి హైదరాబాద్‌ను రక్షించుకోవాలి..

ఇప్పటికే దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. బిఎస్‌ఎన్‌ఎల్ నుండి ఏయిర్ ఇండియా వరకు సర్వం కార్పొరేట్ చేతుల్లో పెడుతున్నది. ఇలాగే వదిలేస్తే వారు రేపు హైదరాబాద్‌ను సైతం అమ్మేస్తారు. ఎందరో ఉద్యోగులు నేడు రోడ్డున పడ్డారు. పాలించడం అంటే ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగట్టడమే పరమావధిగా బిజెపి ప్రయత్నిస్తున్నది. ఆరేండ్లుగా హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది. అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిజెపి ఓట్లు, సీట్ల కోసం మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రపన్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టి మన హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా..? కల్లోల హైదరాబాద్ కావాలా..? ప్రజలు ఇది తేల్చుకోవాల్సిన సమయం. ఆలోచించి ఓటు వేసి హైదరాబాద్‌ను మరింత అభివృద్ది చేసుకునే అవకాశం ఇప్పుడు హైదరాబాద్ ప్రజల చేతుల్లో ఉంది. అబద్ధాలతో మేడలు కట్టే పార్టీల వైపు ఉంటారా..? అభివృద్ధి చేస్తున్న పార్టీ వైపు ఉంటారా? విజ్ఞులైన హైదరాబాద్ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ ఓటు రేపటి హైదరాబాద్ బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. అబద్ధాలు చెప్పే పార్టీలను నమ్మి మోసపోతే గోసపడ్తం. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష..

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News