మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్‌లపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న రాజ్ న్యూస్ ఛానల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఎంఎల్‌సి ఎం.శ్రీనివాస్ రెడ్డి,టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ,లీగల్ సెల్ ప్రతినిధులు కళ్యాణ్ రావు ,రాములు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధికి వినతిపత్రం సమర్పించారు. రాజ్‌న్యూస్ చానల్‌లో ప్రసారమవుతున్న కార్యక్రమాలు ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఆ చానల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
రాజ్‌న్యూస్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ఆరోపించారు. రాజ్‌న్యూస్‌లో ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రస్తారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి టిఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, బిజెపి పార్టీకి అనుకూలంగా రాజ్‌న్యూస్ నిరాధారమైన కథనాలు ప్రసారం చేసిందని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రసారాలు చేసిన రాజ్‌న్యూస్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఇసిని కోరారు.