Wednesday, May 1, 2024

కాటేసే చట్టంతో పోలిస్తే కరోనా మాకో లెక్కా

- Advertisement -
- Advertisement -

New Farm laws are dangerous than Coronavirus

 

ఢిల్లీకి తరలివచ్చిన రైతు దండు స్పందన
భౌతిక దూరాలు మాయం
మాస్క్‌లు లేకుండానే పయనం

సోనీపట్ (హర్యానా) : కరోనా వైరస్ కన్నా తమకు కేంద్ర ప్రభుత్వపు నూతన వ్యవసాయ చట్టాలే ప్రమాదకరం అని రైతు నేతలు స్పష్టం చేశారు. దేశ రాజధాని వైపు సాగుతోన్న తమ నిరసన దండును కరోనా నేపథ్యంలో నిలువరించేది లేదని సోమవారం తెలిపారు. భౌతికదూరాలు ఇతరత్రా కట్టడిలను తాము పట్టించుకునే తీరిక ఓపిక లేదని, తమ పొట్టలు కొట్టేలా దాపురించిన కొత్త వ్యవసాయ బిల్లుల ముందు ఈ కరోనా వ్యాప్తి భయాలు తమకు దిగదుడుపే అని తేల్చిచెప్పారు. పంజాబ్, హర్యానా, యుపిలకు చెందిన రైతులు వేలాది మంది దండుగా ఢిల్లీకి తరలివస్తున్నారు. రైతులు ఒకేచోట గుమికూడటంతో పొంచి ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దుష్ట చట్టాలు తమను తమ పంట పొలాలను కమ్ముకున్నాయని, వీటి ముందు ఇటువంటి ప్రాణాంతక కరోనా భయాలు తమకు ఓ లెక్కా అని రైతు సంఘాల నేతలు తెలిపారు. తమ ఉద్యమం పూర్తి స్థాయిలో నూతన చట్టాల రద్దు వరకూ సాగుతూ ఉందని వెల్లడించారు. గత వారం రోజులుగా రైతులు కదంతొక్కుతున్నారు.

రాష్ట్రాలలో కదలికల ప్రభావం ఇప్పుడు పొరుగునేఉన్న దేశ రాజధానిపై పడి పలు విధాలుగా రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. దూసుకువస్తున్న రైతులు అతి కొద్ది మందే ముఖాలకు ముసుగులు ధరిస్తున్నారు. కలిసికట్టుగా రావడంతో భౌతికదూరాలు ఇతరత్రా కట్టుబాట్లు గాలికి ఎగిరిపొయ్యాయి. దండుయాత్రలో ఇక ముసుగులేమిటీ, తమకు పోలీసు వలయాలను తప్పించుకుని పోవడం, అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలిగించుకుని ముందుకు సాగడమే పని అని, దేని గురించి ఆలోచించే ప్రసక్తే లేదన్నారు. తమ ప్రాణాధార వృత్తి ప్రాణాలు తీసేలా వచ్చిన చట్టాలను తిప్పికొట్టడమే ఇప్పుడు తమ ముందు ఉన్న సవాలు అని తేల్చిచెపుతున్నారు. అయినా కష్టాలు కన్నీళ్లు అన్నింటినీ దిగమింగుతూ ప్రకృతి వైపరీత్యాల పిడుగుపాట్లను భరిస్తూ వచ్చే తమకు ఇటువంటి అనారోగ్య కరోనా వాతావరణం లెక్కలోకి రాదని తెలిపారు. ఢిల్లీ ముఖద్వారాల వద్ద ఇప్పుడు రైతాంగం ఇంటిల్లిపాదిగా అన్నట్లు చేరుకుంది. బారికేడ్ల వద్ద పోలీసులతో తలపడుతున్నారు. చాలా మంది రైతులు ట్రాక్టర్ల ట్రాలీలలో తలదాచుకుంటున్నారు. అయితే రైతులు పెద్ద ఎత్తున గుమికూడటం కరోనా వైరస్ వ్యాప్తిని మరింత వేగవంతం చేస్తుందని నిపుణులు తెలిపారు. భౌతిక దూరాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్ సామూహిక వ్యాప్తికి ఇటువంటి పరిణామాలు దారితీస్తాయని హెచ్చరించారు.

జీవనోపాధికి గండి : బికెయు నేత

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగం తమ తరతరాల నాటి జీవనోపాధిని పోగొట్టుకుంటుందని భారతీయ కిసాన్ యూనియన్ ( ఎక్తా ఉగ్రహాన్) అధ్యక్షులు జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ తెలిపారు. ఈ చట్టాలతో పోలిస్తే తమను కరోనా వైరస్ ఏమీ చేయలేదన్నారు.

బీహార్ ఎన్నికల సంగతేమిటీ : కిసాన్ మజ్దూర్

రైతుల ఆందోళన విషయానికి వచ్చినప్పుడే అంతా పడిపడి కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్నారు. మరి బీహార్ ఎన్నికలప్పుడు ఈ సంగతి ప్రస్తావన ఎందుకు రాలేదని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంథేర్ విమర్శించారు. ఎన్నికల ర్యాలీలు అడ్డుఅదుపూ లేకుండా జరగలేదా? ఇప్పుడు రైతలు నిరసన ప్రదర్శనల విషయంలోనే అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు ముందుగా కోవిడ్ 19 నేపథ్యంలో ప్రదర్శనలకు అనుమతిని నిరాకరించింది.

రైతులు బాధ్యత పాటిస్తున్నారు : బికెయు

రైతులకు బాధ్యతలు తెలుసునని, సాధ్యమైనంత వరకూ అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వస్తున్నారని బికెయు హర్యానా యూనిట్ అధ్యక్షులు గుర్నాం సింగ్ ఛరూని తెలిపారు. తాము విధిగా మార్గదర్శకాలను పాటిస్తున్నామని, ఇందులో రాద్ధాంతానికి తావేలేదన్నారు. ముందు చట్టాల రద్దు జరగాలి, మిగిలినవన్నీ సర్దుకుంటాయని తెలిపారు. సోనిపట్‌లో హర్యానా ఆరోగ్య విభాగం వారు రైతులకు మొత్తం మీద 5 వేల మాస్క్‌లు పంపిణీ చేశారు. పలు ప్రాంతాలలో సంచార టాయ్‌లెట్లను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ చర్యలు చేపట్టారు.

వరదవుతున్న రైతులు.. వెలుస్తున్న పోలీసు బారికేడ్లు

ఓ వైపు దేశ రాజధాని తమ నిరసనల మజిలీగా ఎంచుకున్న రైతాంగం అత్యధిక సంఖ్యలో ఢిల్లీకి దూసుకువస్తోంది. మరో వైపు ఢిల్లీ పోలీసులు రైతులను వారి వారి రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరకుండా మార్గమధ్యంలో బారికేడ్లతో అడ్డుకుంటున్నారు. యుపి సరిహద్దుల వెంబడి ఘజాపూర్ బార్డర్ వద్ద ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున కాంక్రీటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఓ వైపు రైతులు తమ నిరసనల ఐదో రోజు సోమవారం ఢిల్లీ హర్యానా సరిహద్దుల వద్ద భైఠాయించారు. వీరికి తరలివస్తున్న రైతుల దండు జత అవుతోంది. బారికేడ్లను తొలిగించుకుంటూ రైతులు ముందుకు వచ్చే ప్రయత్నాలకు దిగడం పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. దేశ రాజధానికి వెళ్లే పలు ఇతర హైవేలను కూడా దిగ్బంధం చేసేస్తామని రైతులు ప్రకటించారు. దీనితో భద్రతా ఏర్పాట్లు విస్తృతం చేశారు. సింగూ, టిక్రి సరిహద్దుల వెంబడి శాంతియుత ప్రదర్శనలతో రైతులు నిరసన చేపట్టారు. గత రెండు రోజులుగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. బురారీ గ్రౌండ్స్‌కు తరలివెళ్లాలని, చర్చలు జరుపుతామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతుల నాయకులు తోసిపుచ్చారు.

సరిహద్దుల వద్దనే తిష్టవేసుకున్నారు. షరతులతో కూడిన చర్చల ప్రతిపాదనలు తమకు అంగీకారం కాదన్నారు. ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సిమెంట్ జెర్సీ బారికేడ్లు పెట్టామని , రైతులు ఢిల్లీలోకి చొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. రైతులు బురారీ గ్రౌండ్స్ వద్దకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని, వారు జంతర్ మంతర్ వద్దకు చేరుకుని నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. ఢిల్లీ గజియాబాద్ సరిహద్దును ఇప్పటికైతే మూసివేయలేదన్నారు. తామైతే బురారీ గ్రౌండ్‌కు పరిమితం అయ్యే ప్రసక్తే లేదని టిక్రి వద్ద ఆందోళనలో ఉన్న రైతులు తెలిపారు. ఈ ప్రాంతంలోనే చేరుకుని నిరసనలు వ్యక్తం చేయాలని అధికారులు నిర్ధేశించారు. కనీసం ఆరు నెలలు తిష్టవేసుకుని ఉండే విధంగా ఆహారపు సరుకులతో ఢిల్లీకి వచ్చామని తమ నిరసనలను ఎవరూ కట్డడి చేయలేరని రైతులు తెలిపారు. కేంద్రంతో చర్చలకు సిద్దం అని, అయితే కేంద్రం నుంచి సవ్యమైన పరిష్కారం లేకపోతే ఢిల్లీకి వెళ్లే దారులు బంద్ చేసి తీరుతామని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు హెచ్చరించారు. సరిహద్దులలో పలుచోట్ల రైతులకు వైద్య పరీక్షల కోసం మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు.

డిమాండ్ల సాధన వరకూ నిరసనలు ఆగవు
స్పష్టం చేసిన రైతాంగం

న్యూఢిల్లీ ః తాము ఢిల్లీకి వచ్చింది నిర్ణయాత్మక పోరుకు అని , తమ డిమాండ్లు నెరవేరే వరకూ ఆందోళన సాగుతుందని రైతులు హెచ్చరించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని వద్దకు రైతులు వేలాదిగా చేరుకున్న విషయం తెలిసిందే. తాము ఢిల్లీకి ఈ పరిస్థితులలో ఊరికే రాలేదని, నిర్థిష్ట అంశాలతో నిర్ణయాలు తేలే వరకూ సాగే నిర్ణయాత్మక పోరుబాటలో వచ్చామని రైతులు తెలిపారు. సింగూ సరిహద్దులలో రైతుల ప్రతినిధులు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మన్ కీ బాత్‌ను తాము విన్నామని, ప్రధాని మోడీ తమ (రైతుల) మన్ కీ బాత్ వింటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తమ డిమాండ్లపై రాజీ ప్రసక్తే లేదని తెలిపారు.

అధికార పార్టీ రైతాంగ సమస్యలను పట్టించుకోకపోతే తగు విధమైన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. తమ సమస్యల తీవ్రతను గుర్తించుకునే అన్ని కష్టాలు నష్టాలకు ఓర్చి ఇక్కడికి వచ్చామని తమది సరైన నిర్ణయాలు రాబట్టుకుని వెళ్లే వరకూ సాగే పోరు అని, ఇందులో రాజీ ఉండదని స్పష్టం చేశారు. తమను పోలీసులు వేధిస్తున్నారని, ఇప్పటికే 31 కేసులు పెట్టినట్లు రైతుల నేత గుర్నామ్ సింగ్ చదూని తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకూ రైతుల ఆందోళన సాగుతుందన్నారు. రైతులు తమ నిరసనలను బురారీ గ్రౌండ్స్‌కు తరలించాలని హోం మంత్రి అమిత్ షా కోరారు. అక్కడికి వెళ్లితే చర్చలకు వీలుంటుందని చెప్పారు. అయితే షరతులతో కూడిన చర్చల ప్రసక్తే లేదని రైతు నేతలు సమాధానం ఇచ్చారు. సింగూ, టిక్రి సరిహద్దుల వద్దనే చల్లటి గాలుల మధ్య రైతులు మరో రాత్రి గడపాల్సి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News