Friday, April 26, 2024

పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేది లేదు

- Advertisement -
- Advertisement -

TRS Party Working President KTR Roadshow

 

సింహంలా సింగిల్‌గా ప్రజల మనిషి కెసిఆర్
డజన్ల కొద్ది ఢిల్లీ నాయకులు పరిగెత్తుకుని వస్తున్నారు
వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా హైదరాబాద్ వైపు కన్నెత్తి చూశారా?
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను ఆగం చేయాలని చూస్తున్నారు
నగర ప్రజలు ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టండి
మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

హైదరాబాద్: పొలిటికల్ టూరిస్టులతో హైదరాబాద్ నగరానికి ఒరిగేది ఏమీలేదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఎన్నికలు అనగానే పరిగెత్తుకుని వస్తున్న ఢిల్లీ బిజెపి నాయకులు ఈ ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్ షోలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి వరదల్లో హైదరాబాద్ నగర ప్రజలు తల్లడిల్లుతుంటే కనీసం ఇటు వైపు చూసే సాహసం కూడా బిజెపి నాయకులు చేయలేదన్నారు. ఇప్పుడు మాత్రం నగరానికి గుంపులు గుంపులుగా వస్తున్నారన్నారు. గుజరాత్‌లో వరదలు వస్తే రూ. 500కోట్లు, బెంగుళూరులో వరదలు వస్తే రూ.669 కోట్లు హుటాహుటిన వరదసాయం ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ…హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే తక్షణ సాయం కింద రూ. 1350 కోట్ల సాయం అందించమని సిఎం కెసిఆర్ ఉత్తరం రాస్తే ఉలుకూ పలుకూ లేకుండా పోయిందన్నారు. దున్నపోతు మీద వానపడ్డట్లుగా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ నగరానికి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రజల పక్షాన సిఎం కెసిఆర్ డిమాండ్ చేసిన విధంగా రూ.1350 కోట్లు తీసుకొని రావాలన్నారు. జనధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో ధన్ ధన్ మంటూ రూ.15 లక్షలు వేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు. ఆ తరువాత ఇదే అంశాన్ని ఒక విలేఖరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద ప్రస్తావన తీసుకు రాగా అది ఎన్నికల జిమ్మిక్కని కొట్టిపారేశారు. జనం చెవిలో పువ్వు పెట్టినం అని చెప్పారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. అదే విధంగా హైదరాబాద్ నగర ప్రజలకు బిజెపి నాయకులు ప్రకటించిన వరద సాయం రూ 25 వేలు రేపు పొద్దున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల జిమ్మిక్కుగా కొట్టిపారేస్తాడన్నారు. తెలంగాణ విషయంలో మోడీ సర్కార్ చేసింది సున్నా అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అమిత్ షా చెప్పినట్లు కేంద్రం నుండి తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని చేస్తున్న వాదన అసంబద్దమైనదిగా పేర్కొన్నారు.

లెక్కల్లోకి వెళితే తెలంగాణ ద్వారా వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన సొమ్ము అక్షరాలా రూ.2 లక్షల 72 వేల కోట్లన్నారు. తిరిగి రాష్ట్ర ప్రజలకు కేవలం సగం మాత్రమే వస్తున్నాయన్నారు. ఇంకా మాట్లాడాలంటే బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రోడ్లు ఇతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్న సొమ్ములో తెలంగాణ ప్రజల చెమట ఉందన్నారు. కరోనా సందర్భంగా మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎంతమందికి చేరిందో ప్రజలకు తెలుసన్నారు. 20లక్షల కోట్లను 132 దేశ జనాభా తో చూస్తే ప్రతి ఒక్కరికీ రూ.15,384 రూపాయలు రావాలని మరి ఎంతమందికి వచ్చాయో తెలియదన్నారు. ఇలా మోడీ ప్రభుత్వం చేసేది పచ్చి మోసం అన్నారు. వాళ్లకు విషం చిమ్మడం మాత్రమే తెలుసన్నారు . అభివృద్ధి మీద అవగాహనా లేక మతం పేరుతొ యువతను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి సమయంలో యువత చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వీళ్ళ మాయమాటలకు తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితవు పలికారు. ఎవరు ఈ రాష్ట్రంలో పేదవాడికి అండగా ఉన్నారో గుర్తించండి అని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదవాడిని సిఎం కెసిఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు.

కెసిఆర్ కిట్, ఆసరా పెన్షన్, బస్తీ దవాఖానా వంటి కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు. అంతేకాదు 20 వేల లీటర్ల లోపు నీటిని వాడుకున్న వారికి డిసెంబర్ నెల నుండి నల్లా పన్ను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని న్నారు. ఈ హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్య స్థానంగా మార్చుకున్నామని ఇదే స్ఫూర్తిని, అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందన్నారు. గల్లీ పార్టీ కావాలో ఢిల్లీ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. గత ఆరేళ్లలో నగర అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూడాలన్నారు. ఉద్వేగాలు కాదు… మన పిల్లలకు కావాల్సినవి ఉద్యోగాలు అని అన్నారు. ఈ క్రమంలో అమెజాన్, ఆపిల్, గూగుల్ వంటి కంపెనీలు హైదరాబాద్ నగరానికి వస్తున్నాయంటే కారణం ఇక్కడి నగరంలో ఉన్న సౌకర్యాలు, శాంతి భద్రతలే కారణం అన్నారు. అలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే నగర అభివృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రజలంతా అలోచించి గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News