Sunday, April 28, 2024

పోలీసు సంస్కరణలకు ట్రంప్ శ్రీకారం

- Advertisement -
- Advertisement -

Trump signs order on police reform

 

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
ఇక ఉన్నత ప్రమాణాలతో పోలీసు సేవలు
పోలీసులే లేకుంటే ప్రజలకు రక్షణేది: ట్రంప్

వాషింగ్టన్: ఆఫ్రికన్ జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్యతో అట్టుడిగిన అమెరికాలో ప్రజలంతా ముక్తకంఠంతో పోలీసు సంస్కరణలను డిమాండు చేస్తున్న నేపథ్యంలో పోలీసు విభాగాలు అత్యుత్తమ సేవలను, ఉన్నత ప్రమాణాలతో కూడిన విధి నిర్వహణలను నిర్వర్తించేందుకు వీలుకల్పించే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నత ప్రమాణాలతో పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వహించడాన్ని ప్రోత్సహిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాను సంతకం చేశానని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రమాణాలు అత్యంత ఉన్నతంగా, శక్తివంతంగా ఉంటాయని మంగళవారం ఆర్డర్‌పై సంతకం చేసిన సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. పోలీసు అత్యధికులలో అత్యధికులు నిస్వార్థపరులని, ధైర్యవంతులైన ప్రజా సేవకులని ఆయన కితాబు ఇచ్చారు.

పోలీసులు ఎంతో గొప్పవారని, ప్రమాదం ఎదురైనపుడు ఇతరులు పారిపోతుంటే వారు మాత్రం నేరుగా ప్రమాదానికే ఎదురు వెళతారని, తమకు తెలియని అపరిచితుల కోసం సైతం వారు తమ ప్రాణాలకు తెగించి పోరాడతారని ట్రంప్ ప్రశంసించారు. స్థానిక పోలీసు విభాగాన్ని రద్దు చేయాలన్న రాజకీయ ప్రత్యర్థుల డిమాండును పరోక్షంగా ప్రస్తావిస్తూ పోలీసు విభాగాన్ని రద్దు చేయాలన్న ప్రమాదకరమైన ప్రతిపాదనకు తాను వ్యతిరేకమని ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికాలో ఇటీవల కాలంలో క్రైమ్ రేటు చాలా తగ్గిపోయిందని, అమెరికా పౌరులకు వాస్తవాలు తెలుసునని, పోలీసులే లేకపోతే అల్లకల్లోలమేనని ఆయన వ్యాఖ్యానించారు. చట్టాలు లేకపోతే అరాచకం ప్రబలుతుందని, ప్రజలకు భద్రత లేకపోతే పెనుప్రమాదమని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. నేరాల సంఖ్యను తగ్గించడం, పోలీసు సేవలలో ప్రమాణాలు పెంచడం పరస్పర భిన్నమైన లక్ష్యాలు కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రెండు లక్ష్యాలను అనుసంధానిస్తూ పోలీసు శాఖలో సంస్కరణలు సాధించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News