Wednesday, May 1, 2024

పివికి భారతరత్న ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

ఉభయసభల ఏకగ్రీవ తీర్మానం

తెలంగాణ ముద్దుబిడ్డ పివి మన ఠీవి
ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదు
భారతరత్న ఇచ్చి దేశం తనను తాను గౌరవించుకోవాలి : అసెంబ్లీలో సిఎం కెసిఆర్
పివి వ్యక్తిత్వం ఒక సహస్రదళపద్మం
అసాధారణప్రజ్ఞాశీలి
కౌన్సిల్‌లో తీర్మానం ప్రవేశపెట్టిన ఈటల

TS Assembly Passes Resolution for Bharat Ratna to PV

మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇచ్చి దేశం తనను తాను గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై మంగళవారం శాసనసభలో జర్చ జరిగింది. ఈ సందర్భంగా పివికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త అని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పివి మన ఠీవి అని అన్నారు. అయితే ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. సువిశాలమైన భారతదేశంలో ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని పేర్కొన్నారు. ఈ పదవి చాలా అరుదుగా దక్కుతుందన్నారు. అలాంటి పదవి తెలంగాణ ముద్దుబిడ్డ పివికు దక్కిందని అన్నారు. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా పివికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. పివి బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిదుడని అభివర్ణించారు. అలాగే దేశ ప్రగతి కోసం నూతన ఆర్థిక సంస్కరణలకు నాందిపలికారన్నారు.
పివి శత జయంతి చరిత్రలో విశిష్ట సందర్భంగా ఉండాలని, ఆత్మగౌరవ పతాక అయిన పివి శత జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ స్మరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వ్యవస్థలో పురోగమించడానికి పివి కారకుడని పేర్కొన్నారు. అందుకే పివి మన ఠీవీ అని తెలంగాణ సగర్వంగా చెప్పుకుంటున్న సందర్భమిజి అని అన్నారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో సతమతవుతోందని, అలాంటి సమయంలో దేశ ఆర్థిక రథాన్ని ప్రగతి రథంలో పరుగులు పెట్టించారన్నారు.
దక్షిణాది నుంచి మొట్టమొదటి ప్రధానిగా కొనసాగింది పివియేనని సిఎం కెసిఆర్ అన్నారు. ఆయన నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి, వాటిని సమర్థవంతంగా అమలు చేశారని అన్నారు. రాజకీయాలతో సంబంధంలేని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి పివి తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక గమనాన్ని మార్చివేశారని తెలిపారు. అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుంచి దేశ ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించి పరుగులు తీయించారని కొనియాడారు. ప్రపంచం నలుమూలల నుంచి దేశానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణంగా పివినే అని పేర్కొన్నారు. సగటు భారతీయుని జీవన శైలి మారడంలో పివి దార్శనికత ఉందని అన్నారు. గ్లోబల్ ఇండియా రూపశిల్పి పివి అని కొనియాడారు. పివి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని, ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన రెండవ వ్యక్తి పివి అని వ్యాఖ్యానించారు. దార్శనికతతో ధైర్యంగా ముందడుగు వేసిన ఘతన పివిదే అని పేర్కొన్నారు. దాదాపు మూడు దశాబ్దాలు చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండడానికి పివినే కారణమని అన్నారు. భూసంస్కరణలను చిత్తశుద్దితో అమలు చేశారని చెప్పారు. రాష్ట్ర విద్యామంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారని, కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రిగా నవోదయ విద్యాలయాలు ప్రారంభించారని తెలిపారు. ఈ విద్యాలయాల్లో చదివిన వారు ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారని అన్నారు. తెలుగు అకాడమీని నెలకొల్పిన ఘనత కూడా పివికే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయనది సమున్నత వ్యక్తిత్వమన్నారు. అలాగే మహోన్నత తాత్వికవేత్త అని సిఎం కొనియాడారు. అఖండమైన పాండిత్యంతో పాటు వేయి పడగలు అనే నవలను హిందీ భాషలోకి అనువాదం చేశారన్నారు. ఈ నవల ఇతిహాసం వలే ఉంటుందన్నారు. ఈ నవలతో పివి పాండిత్యం ఏమిటో అర్థమవుతుందని చెప్పారు.
హెచ్‌సియుకు పివి పేరు పెట్టాలి
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సియు)కు పివి నరసింహారావు పేరుగా నామకరణం చేయాలని సిఎం కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. భారత రాజకీయాలలో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకట నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలనీ, పార్లమెంట్ ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్నీ, చిత్తరువునూ ప్రతిష్ఠించాలనీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పివి నరసింహారావు పేరు పెట్టాలనీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నదని అని సిఎం కెసిఆర్ తెలిపారు.అలాగే అసెంబ్లీలో కూడా పివి నరసింహారావు తైలవర్ణ చిత్రం ప్రతిష్టించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు.
బహుముఖ ప్రజ్ఞాశీలి పివి : భట్టి
పివి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. పివికి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతిస్తున్నామని తెలిపారు. సంక్షోభాల సమయంలో చాకచాక్యంగా పివి పాలన చేశారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని భట్టి పేర్కొన్నారు.
గొప్ప సంస్కరణ శీలి: మంత్రి కెటిఆర్
పల్లె నుంచి ఢిల్లీ పీఠం వరకు ఎదిగిన ఒక మహామేధావి పివి నరసింహరావు అని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో పివి శతజయంతి ఉత్సవాలపై చర్చలో భాగంగా కెటిఆర్ మాట్లాడుతూ, పివికి భారత రత్న ఇవ్వాలని సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు. పివిని అర్ధం చేసుకోవాలంటే 360 డిగ్రీల కోణంలో ఉన్న పర్సనాలిటీ ఆయనదని, ఆయనను అన్ని రకాలుగా అధ్యయనం చేయాలని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుబాషా కోవిదుడు, రాజకీయ చతురుడు, అపర చాణుక్యుడని…ఇంకా చెప్పాలంటే చాలా ఉందన్నారు. అన్నిటికీ మించి ఒక గొప్ప నిరంతర సంస్కరణశీలి అని కొనియాడారు. పివికి ఏ రంగంలో బాధ్యత ఇచ్చినా అక్కడ అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చి, ప్రజల కోసం ఆలోచించిన మహానుభావుడని మంత్రి కెటిఆర్ కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదటిసారి భూసంస్కరణలు అమలు చేశారని, తన సొంత ఇంటి నుంచే సంస్కరణలు అమలు చేవారన్నారు. 800 ఎకరాల సొంత భూమిని ధారాదత్తం చేసిన మహానుభావుడని మంత్రి కొనియాడారు. విద్యా రంగంలో కూడా మంచి సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు ఎవరంటే పివి నరసింహారావు పేరును చెప్పుకుంటామని కెటిఆర్ అన్నారు.

పివి ఒబిసి రిజర్వేషన్లు తీసుకువచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పివి నరసింహారావుతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన మరుగును పడేయబడ్డ ఎంతో మంది వైతాళికులను గుర్తించి గౌరవించుకుని సంస్కారవంతంగా కార్యక్రమాలు చేపడుతున్న ఘనత సిఎం కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుందని వ్యాఖ్యానించారు. మగ్గుం మొయినుద్దీన్, సేవాలాల్ మహారాజ్, ఈశ్వరీభాయి, భాగ్యరెడ్డి వర్మ, దాశరది కృష్ణమాచార్య, కాళోజి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి, దొడ్డి కొమురయ్య, పైడి జయరాజ్, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న లాంటి ఎందరినో సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో గౌరవించుకుంటూ, మహానుభావుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నామని పేర్కొన్నారు. తన అమ్మమ్మ గారి ఊరి కొదురుపాక గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడైన తన తాత ద్వారా పివి గురించి విన్నానని గుర్తు చేసుకున్నారు. సమైక్యవాదుల పాలనలో పివి లాంటి మహానుభావులను ఎంతోమందిని మరుగపడేశారని పేర్కొన్నారు. అలాంటి మహానుభావులను గౌరవించుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రం తనను తాను గౌరవించుకోవడమే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా 51 దేశాలలో కూడా పివి శత జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. తెలంగాణ జాతి సామూహిత ప్రతీక పివి అని, తెలంగాణ మట్టి పాలన చతురతకు ప్రతాక పివి అని, పట్వారి నుంచి ప్రధానిగా ఎదిగిన స్పూర్తి ప్రధాత పివి అని వ్యాఖ్యానించారు.

లంబాడ, గోండు భాషలు తెలుసు
పాలనలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పివి అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 18 భాషలు మాట్లాడే పివికి లంబాడా, గోండు భాషలు కూడా వచ్చుఅని అన్నారు. పివి శతజయంతి ఉత్సవాలపై చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ పివికి భారత రత్న ఇవ్వాలని కెసిఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు. ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ, మాజీ ప్రధాని పివి నరసింహరావు ప్రపంచ దేశాలు గర్వించదగ్గ నేతని అని కొనియాడారు. సత్తుపల్లిలో స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని, దానికి ముఖ్యమంత్రి స్ఫూర్తితో పివి పేరు పెడుతున్నామన్నారు.
భారతరత్న ఇవ్వాలి : మంత్రులు గంగుల, శ్రీనివాస్ గౌడ్
పివి నరసింహరావుకు భారత రత్న ఇవ్వాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. పివికి భారత రత్న ఇవ్వాలన్న తీర్మానం సందర్భంగా మాట్లాడిన గంగుల కమలాకర్, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పివి ఏ అన్యాయాన్ని సహించలేదన్నారు. పట్వారీ నుంచి ప్రధాని వరకు పివి అనేక సంస్కరణలు తెచ్చి దేశానికే వన్నె తెచ్చారన్నారు. పివి నరసింహారావు భారతరత్న ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పివి పేరు పెట్టాలని అన్నారు. కాగా 1991లో పివితో తాను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నానని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. అలాగే ఎంఎల్‌ఎలు రాజాసింగ్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెడ్యానాయక్‌లు మాట్లాడుతూ, పివికి భారత రత్న ఇవ్వాలని కెసిఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు. అనంతరం తీర్మాన్నీ సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.

TS Assembly Passes Resolution for Bharat Ratna to PV

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News