Saturday, May 4, 2024

తెలంగాణ ఆత్మగౌరవ పతాక

- Advertisement -
- Advertisement -

kaloji narayana rao birth anniversary

అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట / హంస తూలికలొకచోట అలసిన దేహాలొకచోట / సంపదలన్నీ ఒకచోట గంపెడు బల గం బొకచోట! అంటూ సమాజంలోని అసమానతలను చూసి ఆవేదనతో కవితారచన చేసిన నికార్సయిన ప్రజాకవి కాళోజీ. ఆయన ఆధునికతరం వేమన. ఆయన కవిత్వంలో సమకాలీన స్పందనాత్మకత ఒక పార్శ్వమైతే, తెలంగాణ అస్తిత్వ ప్రతీకాత్మకత వేరొక కోణం. తొలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం నినదించిన కవులలో కాళోజీ స్వరం అత్యంత విలక్షణం.

మాతృదేశాన్నీ మాతృభాషను అమితంగా అభిమానించిన కాళోజీ నాటి నిజాం రాష్ట్రంలోని కొందరు తెలుగు ప్రజలు తెలుగు భాషపట్ల చూపిస్తున్న నిరాదరణకు స్పందిస్తూ ఏ భాషరా నీది ఏమి వేషమురా/ ఈ భాష ఈ వేషమెవరికోసమురా /ఆంగ్లమందున మాటలాడగలుగగనే / ఇంతగా కుల్కెదవు ఎందుకోసమురా? / అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు /సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా అంటూ స్వభాషాభిమానాన్ని తట్టిలేపారు.

ఒకవైపు ప్రగతిశీల ప్రజాకవులు దుర్మార్గపు రాజరికాన్ని నిలదీస్తూ అరణ్య అజ్ఞాత కారాగారవాసాలు గడుపుతుంటే మరోవైపు రాజరికానికి అమ్ముడుపోయిన ముగ్గురు ఆనాటి సాహితీవేత్తలను ‘రాకాసి’ అన్న సంకేతనామంతో ప్రజాస్వామ్యవాదులు గర్హించారు. వీరిలో ఒకరు రాయప్రోలు సుబ్బారావు, రెండవవారు ఖాసింఖాన్, మూడవవారు కురుగంటి సీతారామయ్య.
లేమావిచిగురులను లెస్సగా మేసేవు/ ఋతురాజువచ్చెనని అతి సంభ్రమముతోడ/ మావికొమ్మల మీద మైమరచి పాడేవు/ తిన్న తిండెవ్వారిదే కోకిలా! పాడు పాటెవ్వారిదే? అని సూటిగా నిలదీశారు కాళోజీ. ఊరు పేరు లేని పిచ్చుకను దయదలచి చేరదీస్తే మావిగున్నల మాట మాటవరుసకైనా తలవని కృతఘ్నతను ప్రశ్నించారు.

1944లో వరంగల్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రథమ వార్షికోత్సవం జరిగింది. రజాకరులు ఈ ఉత్సవాలను భగ్నం చేయాలని వరంగల్ కోటలోని ఏర్పాట్లనన్నిటిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఖుషీమహల్‌లో కవిసమ్మేళనం జరపడానికి అప్పటి పురావస్తు శాఖ వారు అనుమతిని నిరాకరించడం వలన కాలి కూలిన పందిళ్ళలోనే కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. దీనికి ముసిపట్ల పట్టాభిరామారావు అధ్యక్షత వహించగా సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, గార్లపాటి రాఘవరెడ్డి మొదలైన ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు అరవై మంది కవులు కావ్యగానం చేశారు. అందులో కాళోజీ….మాసిపోయిన రాజశాసనము జూపి / పురుగుపట్టిన తాటి పొత్తముల జూపి/ తుప్పు పట్టిన కత్తి తునకలను జూపి/ పూర్వగాథలు జెప్పి పొంగేటి/ మనస్తత్వాలను విమర్శించారు. అప్పటి దీనస్థితి పోయేందుకు ప్రజా ప్రతిఘటన అవసరమని ప్రబోధించారు.

1946 వరంగల్ కోటలో జరుపతలపెట్టిన పతాకావిష్కరణ ఉత్సవాన్ని భగ్నం చేయడానికి రజాకారులు బీభత్సం సృష్టించారు. వారి అరాచకాన్ని ఎదిరించి వీరోచితంగా పోరాడిన మొగులయ్యను దారుణంగా హతమార్చారు. తరువాత కొద్ది రోజులలోనే డాక్టర్ నారాయణరెడ్డి అనే వైద్యుడిని కూడా పాశవికంగా హత్యచేశారు. ఈ అమానుష చర్యలను నిరసించిన కాళోజీ…
రక్షణకు ఏర్పడ్డ బలగము రక్కసుల పక్షంబు జేరినరాక్షసుల ఇష్టానుసారం రాజ్యమును నడిపించినట్లే అంటూ నాటి దుష్టపాలనపై ప్రజాగ్రహాన్ని ప్రకటించారు. కాళోజీ ధర్మాగ్రహంపై నిజాం ప్రభుత్వం కన్నెర్ర చేసింది. 1947వ సంవత్సరంలో మూడు నెలల పాటు ఆయనపై వరంగల్ నగర బహిష్కార శిక్ష విధించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ప్రజాకవి కాళోజీ వరంగల్‌కు తిరిగి వచ్చి… నిందమోపిన వాడె నిందితుడు కాగా / మావూరికే మేము మరలివచ్చితిమి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాళోజీ ఈ కవిత సుప్రసిద్ధం. ఇది ఆయన కవిత్వానికి పర్యాయపద్యంగా పేర్కొనదగినది.

నల్లగొండలో నాజీ వృత్తుల నగ్న నృత్యమింకెన్నాళ్ళు? / పోలీసు అండను దౌర్జన్యాలు పోషణ బొందే దెన్నాళ్లు? /దమన నీతితో దౌర్జన్యాలకు దాగిలిమూతలు ఎన్నాళ్లు? / కంచెయె చేనును మేయుచుండగా కాంచకుండుటింకెన్నాళ్లు? / దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని దొరలై వెలిగే దెన్నాళ్లు? ఇట్లా అంటూనే ప్రతిఘటన చేసేందుకు సమయం ఆసన్నమైందని ధ్వనింపచేశారు కాళోజీ. 1946వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీనీ నిషేధించినపుడు…ప్రజాసంస్థపై పగ సాధించిన ఫలితము తప్పక బయటపడున్ / నిక్కుచునీలిగె నిరంకుశత్వం నిలువలేక నేలను కూలున్ అని ప్రజాతీర్పును క్రాంతదర్శిగా ప్రకటించారు. నిజాం సైనికులు, రజాకారులు కలిసి జనగామ తాలూకాలోని మాచిరెడ్డిపల్లె, ఆకునూరు గ్రామాలపైబడి స్త్రీలపై అత్యాచారాలు జరిపారు. ఈ దుశ్చర్యను నిరసించిన కాళోజీ…బాధ్యతలేని ప్రభుత్వ భటులు పెట్టే బాధలు చాలింక/ బాధ్యత గల పరిపాలనలేక బ్రతికిన బ్రతుకులు చాలింక/ హద్దుమీరి అధికారవర్గము ఆడిన ఆటలు చాలింక / రాజు పేరిట ఆరాజకమునకు జరిగిన పూజలు చాలింక / రక్కసితనముకు పిశాచవృత్తికి దొరిగిన రక్షణ చాలింక / మాచిరెడ్డిలో ఆకునూరులో దోచిన మానము చాలింక / రక్షణకై ఏర్పడ్డ బలగమే చేసే భక్షణ చాలింక అంటూ దుర్మార్గాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయిందని, అధికార వర్గం ఆడే ఆటలు ఇక సాగడానికి వీలులేదనీ హెచ్చరించారు. ఈ గేయం అప్పటి తెలుగు స్వతంత్ర పత్రికలో ప్రచురించబడింది. రజాకార్ల హత్యాకాండకు పరాకాష్ట జనగామ తాలూకాలో బైరాన్‌పల్లి గ్రామప్రజలపై జరిపిన మూకుమ్మడి దాడి, స్త్రీలపై అత్యాచారాలు, పురుషులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం వంటి ఘటనలతో సంస్థానమంతా అట్టుడికిపోయింది. గుల్బర్గా జైలులో నిర్బంధంలో ఉన్న కాళోజీ ఈ వార్తలను చదివి ఆగ్రహోదగ్రులయ్యారు.

మనకొంపలార్చిన మన స్త్రీల చెరచిన / మన పిల్లలను చంపి మనల బంధించిన/ మానవాధములను మండలాదీశులను / మరచిపోకుండగా గురుతుంచుకోవాలె/ కసి ఆరిపోకుండ బుసకొట్టు చుండాలె/ కాలంబు రాగానె కాటేసి తీరాలె అనే గీతాన్ని రచించారు. అహింస, దయ, క్షమ అన్న మాటలను కట్టిపెట్టి చాణుక్య నీతిని ఆచరించాలని ఉద్బోధించారు కాళోజీ.సాగిపోవుటే బ్రతుకు ఆగిపోవుటే చావు/ సాగిపోదలచిన ఆగరాదిచటెపుడు / బ్రతుకు పోరా టం పడకు ఆరాటం అని ప్రజాశ్రేణులకు ప్రబోధగీతాన్ని అందిచారు కాళోజీ. ఆ మహామనీషితో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొనడం, ఆయన ఉపన్యాస ధోరణిని మంత్రముగ్ధులమై వినడం, ఆయన ధిక్కారస్వరంతో ప్రేరణ పొందడం, ఆయన బ్రతికిన కాలంలో బ్రతకడం ఒక మధురమైన స్మృతి.

మాటలను కత్తులుగా, కొడవళ్లుగా మలచినవారు, పాటలను ఈటెలుగా ప్రయోగించినవారు. కవితాపంక్తులను సూక్తులుగా, సామెతలుగా, నుడులుగా, నానుడులుగా వాడుకునే వెసులుబాటు కల్పించినవారు, హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలకు పెద్ద దిక్కుగా నిలిచినవారు పరిపూర్ణ మానవుడు ప్రజాకవి కాళోజీ. అతిథివోలె ఉండి ఉండి అవని విడిచి వెళ్లుతాను/ పల్లె పట్టణంబులనక పల్లేరై తిరిగినాను / కంటకాల మధ్య నేను కాలినడక నడిచినాను / ఈగవోలె దోమవోలె వాగుచు తిరుగాడినాను / అతిథివోలె ఉండి ఉండి అవని విడిచి వెళ్లుతాను అన్న తెలుగుప్రజల హృదయం, తెలంగాణ గళగర్జన, మానవతా మహాశిఖరం, నిత్య చైతన్యదీప్తి కాళోజీ జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటితరానికీ, రేపటి తరానికీ స్ఫూర్తిదాయకం”.

డా. ఎస్.వి.సత్యనారాయణ- 9618032390

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News