Saturday, May 11, 2024

అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా

- Advertisement -
- Advertisement -

TS Govt files Petition in SC on Rayalaseema Project

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి బుధవారం తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రజల వనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు సమావేశం వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జలవనరులశాఖ తెలిపింది. స్వాతంత్రదినోత్సవం అనంతరం ఈ నెల చివరిలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఉండే అవకాశం ఉంది. అయితే 23 సెప్టెంబర్ 2016లో జరగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలు కాకపోవడం పట్ల కేంద్ర జలవనరులశాఖను తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టుకు మళ్లించే నీటిలో ట్రుబ్యునల్ అవార్డు మేరకు రావల్సిన 43 టిఎంసిల వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అలాగే పట్టిసీమ నుంచి కూడా తెలంగాణకు వాటా రావల్సిఉంది. నీటి వినియోగంలో పారదర్శకత, టెలిమెట్రీల ఏర్పాటు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై జరిగిన కౌన్సిల్ సమావేశంలోని తీర్మానాలు ఇప్పటికీ అమలు కాకున్నా తిరిగి అపెక్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటని ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ కేంద్ర జలవనరుల శాఖను ప్రశ్నించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలోని నీటివాటాలే ఇప్పటికీ అమలు కావడంపట్ల తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ సమస్యలు ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీశైలం నుంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం సామర్థాన్ని పెంచేందుకు పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. అయితే, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిబంధనలమేరకు ముఖ్యమంత్రులు అంగీకరిస్తేనే సమావేశం జరపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల ఏర్పాట్లు, కరోనా నియంత్రణ చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉండటంతో 20 తర్వాత తేదీని ప్రకటించాలని సిఎం కెసిఆర్ కేంద్ర జల వనరుల శాఖకు సూచించారు. ఈ సూచన మేరకు సమావేశం వాయిదా పడింది. సమావేశం ఎప్పుడు జరిగినా కృష్ణాగోదావరి నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, దశాబ్దాల తరబడి తెలంగాణ జలవనరులను దోపిడి చేస్తున్న ఆంధ్రను ఎండగట్టేందుకు తెలంగాణ అధికారులు ప్రాజెక్టుల వారిగా సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉన్నారు. కృష్ణానదీ యాజమాన్యం బోర్డు, గ్రీన్‌ట్రిబ్యునల్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఆంధ్రలో కడుతున్న ప్రాజెక్టులను తక్షణం నిలపివేయాలని తెలంగాణ చేసే డిమాండ్లలో ఎలాంటి రాజీ లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అమోదించే ప్రసక్తే లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టులో ఫిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ సుప్రీంకోర్టులో ఫిటీషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ఈ పథకం ద్వారా పోతిరెడ్డిపాడుకు రోజుకు 88 వేల క్యూసెక్కుల నీరు తరలించే అవకాశం ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. సమైక్యరాష్ట్రంలో నదుల నీటి వాటా విషయంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఈ అంశం బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా పేర్కొందని సుప్రీంకు తెలంగాణ విన్నవించింది. ఎపి ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం జారీ చేసిన ఉత్తర్వులను, పిలిచినటెండర్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది తెలంగాణ ప్రభుత్వం.

TS Govt files Petition in SC on Rayalaseema Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News