Friday, April 26, 2024

సుశాంత్ కేసుపై సిబిఐ దర్యాప్తు..

- Advertisement -
- Advertisement -

Central Govt Accepted CBI probe into Sushant Death

న్యూఢిల్లీ: బలవన్మరణానికి పాల్పడ్డ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన ఆత్మహత్య ఉదంతంపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ(సిబిఐ) దర్యాప్తునకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టుకు సమాచారం అందించింది. ప్రస్తుతం కేసు విచారణ యధాతథస్థితి గురించి నివేదిక అందించాలని మరో వైపు అత్యున్నత న్యాయస్థానం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనితో ముంబై పోలీసు యంత్రాంగంలో కదలిక మొదలైంది. సుశాంత్ మరణం వెనుక ఉన్న నిజానిజాలు వెలుగులోకి రావల్సి ఉందని జస్టిస్ హృషికేష్ రామ్ బుధవారం కేసు విచారణ దశలో ధర్మాసనం తరఫున తెలిపారు. ఈ నటుడి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వాస్తవాలు వెల్లడికావల్సి ఉందన్నారు. కేసు విచారణను పాట్నా నుంచి ముంబైకి మార్చాలని తోటి నటి రిహా చక్రవర్తి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై మహారాష్ట్ర, బీహార్ పోలీసులు, రాజ్‌పుత్ తండ్రి కూడా సమాధానాలు తెలియచేయాలని ధర్మాసనం తెలిపింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం యధాతథస్థితిని అందించాలని ఆదేశించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. సిబిఐ దర్యాప్తు జరిపించాలని బీహార్ సిఎం నితీష్ కుమార్ కోరారని.. ఇందుకు తాము అంగీకరిస్తున్నామని, ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. 34 ఏండ్ల సుశాంత్ జూన్ 14వ తేదీన ముంబై శివార్లలోని బాంద్రాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్‌కు ఉరివేసుకుని మృతి చెందారు. అప్పటి నుంచి దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. బాలీవుడ్ మాఫియా ఒత్తిడి కారణంగానే ఈ విషాదాంతం జరిగిందని, తోటి నటి రిహా ఆర్థికంగా ఆయనను వేధించారని ఆరోపణలు వెలువడ్డాయి.

మరో వైపు ఈ వ్యవహారంలో ముంబై పోలీసు వర్గాలకు, పాట్నా పోలీసు ఉన్నతాధికారులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రగులుకుంది. సుశాంత్ విచిత్ర మానసిక స్థితితో తలెత్తిన జబ్బుతో బాధపడ్డారని, ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు చెపుతున్నారని ఇటీవలే ముంబై పోలీసు కమిషనర్ విలేకరులకు తెలిపారు. గతవారం బీహార్ పోలీసులు నటి రిహా, ఆమె కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. రిహా కుటుంబ సభ్యులు తీసుకవచ్చిన ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ విధంగా వారిపై ఆత్మాహత్య ప్రేరణ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. రాజ్‌పుత్ తరఫున లాయర్ సుప్రీంకోర్టుకు తమ వాదనలు తెలియచేశారు. మహారాష్ట్ర పోలీసులు ఈ కేసులో సాక్షాలను తారుమారు చేస్తున్నారని, ఇతరుల ఒత్తిడితో వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు. పాట్నా పోలీసులు ముంబైకి వెళ్లగా ముంబై పోలీసులు ఈ బృందాన్ని అడ్డుకున్నారని, పైగా పాట్నా సిటీ సెంట్రల్ ఎస్‌పి వినయ్ తివారీని అక్కడి పోలీసులు హోం క్వారంటైన్‌లో పెట్టారని లాయర్ తెలిపారు. ఇది, మంచి సంకేతం కాదని ఆక్షేపించారు. సుశాంత్ బీహార్‌కు చెందిన వాడు కావడంతో ఆయన ముంబైలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతంపై పలురకాలుగా రాజకీయ ఒత్తిడి రావడంతో బీహార్ సిఎం స్పందించారు. కేసును సిబిఐ దర్యాప్తు కోసం అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విజ్ఞప్తిని ఇప్పుడు కేంద్రం సుప్రీంకోర్టు సమక్షంలో అంగీకరించడంతో ఇక సుశాంత్ కేసును సిబిఐ దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం అయింది.

Central Govt Accepted CBI probe into Sushant Death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News