Saturday, May 4, 2024

నేటి నుంచి జ్వరసర్వే

- Advertisement -
- Advertisement -

మూడో వేవ్‌పై ముందు జాగ్రత్తగా మూడు రోజుల పాటు నిర్వహణ
వైద్య ఆరోగ్య శాఖ బృందం పలు జిల్లాల్లో పర్యటన

మన తెలంగాణ/హైదరాబాద్: వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, థర్డ్‌వేవ్ వస్తుందంటూ నిపుణులు హెచ్చరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలెర్ట్ అయింది. ఈ వేవ్‌ను ముందుగా పసిగట్టి దాని శరవేగంగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నది. ఒకవైపు పొరగు రాష్ట్రాల సరిహద్దుల్లో పెరుగుతున్న కరోనా కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూనే మరో వైపు రాష్ట్రంలోని జిల్లా సరిహద్దుల్లో కూడా కూలంకషంగా అధ్యయం చేయాలని తలపెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో క్షేత్రస్థాయిలో మరోసారి జ్వర సర్వేను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలోని పలు జిల్లాలో పర్యటించనుంది. అక్కడి పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసి కరోనాపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను అందించనుంది. జ్వర సర్వే ద్వారా కరోనాను రాష్ట్రంలో ముందస్తుగా కట్టడిచేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది.

అయితే, కొన్ని జిల్లాల్లో మళ్లీ కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసుల విషయంలో ఆయా జిల్లాలో శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గల కారణాలపై కూడా ఆరా తీయనుంది. ఈ మేరకు సిఎం కెసిఆర్ ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రానందున సరిహద్దు జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల బృందం ఆది, సోమ, మంగళ వారాల్లో (ఈ నెల 11, 12, 13 తేదీల్లో) నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా విస్తృతంగా పర్యటించనున్నారు. అలాగే ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులను, కరోనా నియంత్రణ చర్యలను అధ్యయనం చేసి సిఎంకు సమగ్ర నివేదికను అందించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా సరిహద్దు గ్రామాల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహిస్తారు.

TS Govt to Conduct fever survey from July 11

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News