Wednesday, May 1, 2024

200మందితో నిర్వహణ

- Advertisement -
- Advertisement -

పారదర్శకంగా సమీకృత కొత్త సచివాలయం నిర్వహణ
వాటి బాధ్యతలను ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం
ఒకే సంస్థకు హౌజ్ కీపింగ్, సివిల్, ప్లంబింగ్, ఎలక్ట్రీసిటీ, ఐటీ నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలు
నిర్వహణ కోసం 200మంది సిబ్బంది అవసరమని అంచనా
గ్రీనరీ, లాండ్‌స్కేప్‌ల నిర్వహణ బాధ్యత హెచ్‌ఎండిఏకు అప్పగించే అవకాశం
-సాధారణ పరిపాలన శాఖ కసరత్తు త్వరలో టెండర్లు పిలిచే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: సమీకృత కొత్త సచివాలయం నిర్వహణను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా వాటి బాధ్యతలను ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించాలని భావిస్తోంది. కాంట్రాక్టు తీసుకున్న కన్సల్టెన్సీకి హౌజ్ కీపింగ్‌తో సహా, సివిల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ ఇతర అన్ని రకాల మరమ్మతులు, నిర్వహణలను ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీకి ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సాధారణ పరిపాలన శాఖ (జిఏడి) ఈ దిశగా త్వరలోనే టెండర్లను ఆహ్వానించే అవకాశాలున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం సైబరాబాద్‌లోని ఐటీ కంపెనీలన్నీ నిర్వహణ బాధ్యతలను ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీలే చేపడుతున్నాయి. అయితే సమీకృత కొత్త సచివాలయంలో ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీకి ఏఏ పనులు అప్పగించాలో స్పష్టత వస్తే అందుకు అనుగుణంగా జిఏడి టెండర్ ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. అయితే సచివాలయం బయట ఉన్న గ్రీనరీ, లాన్స్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్‌తో పాటు ఇతరత్రా నిర్వహణ బాధ్యతలను హెచ్‌ఎండిఏకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

సులభతర విధానం ద్వారా….
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పడిన కొత్తలో మాదాపూర్‌లోని సైబర్ టవర్స్‌తో సహా ఇతర ఐటీ కంపెనీల నిర్వహణ బాధ్యతలను ప్రయో గాత్మకంగా ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. కంపెనీల్లో సివిల్ వర్క్‌తో సహా అన్ని ఇతర మరమ్మతుల బాధ్యతలను ఒకే సంస్థ చేపట్టడంతో గడిచిన దశాబ్దన్నర కాలంగా ఈ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కొత్త సచివాలయం నిర్వహణ బాధ్యతలను కూడా అలాంటి సంస్థలకే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. హౌజ్ కీపింగ్‌తో సహా, ఐటి, విద్యుత్, ప్లంబింగ్ సహా ఇతర సివిల్ రిపేర్ల బాధ్యతలు ఒకే సంస్థకు అప్పగించడం ద్వారా ఆధునిక సచివాలయ నిర్వహణలో ప్రభుత్వం ఒక సులభతర విధానాన్ని అవలంభించినుంది. తద్వారా ఏమైనా సమస్యలు తలెత్తితే సత్వరంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

హౌజ్ కీపింగ్ కోసం దాదాపు రూ.50 లక్షలు
ఈ సచివాలయ భవనం ప్రారంభం కాకముందు బిఆర్‌ఆర్‌కె భవనంలో హౌజ్ కీపింగ్ కొరకు 80 మంది సిబ్బంది పనిచేసేవారు. వాళ్ల జీతభత్యాలకు కలిపి ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు దాదాపు రూ. 25 లక్షలను చెల్లించేది. కొత్త సచివాలయం విస్తీర్ణం అధికంగా ఉండటంతో సిబ్బంది సంఖ్య 160కి పెరుగుతుందని అధికారుల అంచనా. ఆ లెక్కన 10 లక్షల చ. అడుగుల విస్తీర్ణంలో ఉన్న కొత్త భవంతిలో ఒక్క హౌజ్ కీపింగ్ కోసమే దాదాపు రూ.50 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంది. హౌజ్ కీపింగ్ సిబ్బందితో పాటు, ప్లంబింగ్, పవర్, ఐటీ లాంటి పలు ఇతర విభాగాల్లో నిర్వహణ కోసం ఒక్కో ఫ్లోర్‌కు ఒక్కో విభాగానికి ఒకరి చొప్పున మరో 35 మంది అవసరం అవుతారు. అంటే ఆ సిబ్బంది సంఖ్య 200లకు చేరే అవకాశం ఉంటుంది.

వీళ్ల జీతభత్యాలతో పాటు, సివిల్, ఐటీ, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ లాంటి ఇతర పనులు, మరమ్మతుల నిర్వహణ కోసం అదనంగా మరో రూ. 50 లక్షలు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ నిర్వహణ ఒకసారి ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలోకి వెళితే ఇక ప్రతి చిన్న రిపేర్ మొదలు పెద్దపెద్ద మరమ్మతుల బాధ్యతను ఆ సంస్థే చూసుకోవాల్సి ఉంటుంది. తదనుగుణంగా అవసరం అయ్యే ప్రతి పార్టును, వస్తువులను రీప్లేస్ చేయాల్సిన బాధ్యత కూడా సంబంధిత సంస్థే చూసుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News